నగరాలను రక్షిస్తున్న శక్తివంతమైన దేవాలయాల గురించి తెలుసా!
నగరాలను రక్షిస్తున్న శక్తివంతమైన దేవాలయాల గురించి తెలుసా!
భారతదేశంలో ప్రతి చిన్న గ్రామంలోనూ కనీసం ఒక చిన్న దేవాలయం అయినా ఉంటుంది. ఇక భారతదేశం మొత్తం చూస్తే బోలెడు దేవాలయాలు ఉంటాయి. అయితే ప్రతి గ్రామం, పట్టణంలో ఉండే దేవాలయాలలో కొన్ని దేవాలయాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. అవి వాటి నిర్మాణ శైలికే కాకుండా.. ఆ దేవాలయాలలో ఉండే దేవతా శక్తులకు కూడా చాలా ప్రసిద్ధి చెందినవి. అయితే.. కొన్ని దేవాలయాలు మాత్రం ఏకంగా అవి ఉన్న ప్రసిద్ధ నగరాలకే రక్షణగా నిలుస్తున్నాయి. ఆ నగరాలు కేవలం ఆ నగరాలలో ఉన్న గుడుల వల్లనే ఇప్పటికి సజీవంగా ఉన్నాయని చెప్పవచ్చు. భారతదేశంలో అలాంటి ప్రసిద్ధమైన 5 దేవాలయాల గురించి తెలుసుకుంటే..
భూయి పోర్ ఆలయం.. జార్ఖండ్..
జార్ఖండ్ రాష్ట్రం ధన్ బాద్ నగరంలో ఉన్న భూయి పోర్ ఆలయం ఈ నగరానికి రక్షణ కవచంలా నిలుస్తోందని చెబుతారు. భూయి పోర్ ఆలయంలో పరమశివుడు పూజలు అందుకుంటున్నాడు. భూయి అంటే భూమి, ఫోర్ అంటే.. చీల్చుకుని రావడం అని అర్థమట. ఇక్కడ దేవాలయంలో పరమేశ్వరుడు భూమి నుండి చీల్చుకుని వచ్చాడని, ఇది స్వయంభూ శివలింగం అని చెబుతారు. ఇక్కడ పరమేశ్వరుడు కేవలం ఒక దైవంగా మాత్రమే కాకుండా, నగరానికి రక్షకుడిగా భావిస్తారు. కంటికి కనిపించని, వివరించలేని శక్తుల నుండి ఈ ఆలయం తమ ప్రజలను కాపాడుతుందనే నమ్మకం ఇక్కడి ప్రజలలో ఉంది.
కాళీ దేవాలయం.. కోల్కతా..
కోల్‌కతాలోని కాళీ దేవాలయం చాలా పటిష్టమైన రక్షణకు చిహ్నంగా పరిగణించబడుతుంది. ఇక్కడి కాళీ మాత శక్తి చాలా దృఢంగా ఉంటుంది. ఇక్కడి అమ్మవారు అంటే చాలా భయపడతారు. అలాగే.. ఎంతో భక్తి శ్రద్దలతో కాళీ అమ్మవారిని పూజిస్తారు. కానీ.. ధర్మం, న్యాయం ఉన్నప్పుడు ఈ అమ్మ చాలా అప్యాయంగా ఉన్నట్టు అనిపిస్తారట, తప్పులు చేసినప్పుడు, అన్యాయం జరిగినప్పుడు, ముఖ్యంగా కొల్కతా నగరానికి రక్షణ కవచంలా ఉండి, నరగాన్ని కాపాడుతుందని నమ్ముతారు.
రంగనాథస్వామి దేవాలయం.. శ్రీరంగం..
శ్రీరంగంలోని శ్రీ రంగనాథస్వామి ఆలయం ఇక్కడి నగర రక్షణను, శాంతిని కాపాడుతోందట. ఈ ఆలయంలో చాలా ప్రశాంతంగా ఉంటుందని అంటారు. ఈ ఆలయానికి వెళ్లిన ప్రతి ఒక్కరు ప్రశాంతతను అనుభూతి చెందుతారు. ఇక్కడి వాతావరణం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. కాలం నెమ్మదించి దానికంటూ ఒక లయ ఉన్నట్లు అనిపిస్తుంది. శ్రీరంగంలో ఆలయ ప్రాంగణంలోని శాంతి, ప్రశాంతత ఈ ప్రపంచంలో ఉండే ప్రతి కష్టాన్ని, సమస్యను దూరం చేయగలదని నమ్ముతారు.
సోమనాథ ఆలయం.. సౌరాష్ట్ర..
సౌరాష్ట్రలోని సోమనాథ ఆలయానికి చాలా చరిత్ర ఉంది. ఈ దేవాలయం ఎంత శక్తివంతమైనదో చరిత్రే చెబుతుంది. ఈ ఆలయం ఒకటి రెండు సార్లు కాదు, లెక్కలేనన్ని సార్లు ధ్వంసమై పునర్నిర్మించబడింది, ప్రతిసారీ మునుపటి కంటే మరింత బలంగా, దృఢంగా ఆవిర్భవించింది. సోమనాథ్ యొక్క ఈ పునరుద్ధరణ శక్తి, నష్టాన్ని నివారించడం మాత్రమే కాదు, తట్టుకుని నిలబడటం, తిరిగి పుంజుకోవడం, భద్రతను ఇవ్వడం వంటి నమ్మకాలను ప్రజలలో నాటగలిగింది. ఈ ఆలయం నగరానికి రక్షణ వలయంలా నిలుస్తుందని చెబుతారు.
స్వర్ణ దేవాలయం, అమృత్ సర్..
పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఉన్న స్వర్ణ దేవాలయం కేవలం ఒక ప్రార్థనా స్థలం మాత్రమే కాదు, యావత్ సమాజం శాంతిని, సాంత్వనను పొందగల ప్రదేశం కూడా. స్వర్ణ దేవాలయంలోకి ప్రవేశించగానే, అన్ని వర్గాల ప్రజలు చుట్టుముట్టినట్లుగా అనిపిస్తుంది. ఇక్కడి దర్శనం తర్వాత ఒంటరితనం అనే భావన పోతుంది. వసుధకై కుటుంబంలో, ఎంతో మంది ఆప్తుల మధ్య భద్రంగా ఉన్న భావన కలుగుతుంది.
*రూపశ్రీ.