సంపూర్ణ గోలాయణం 82

 

ఇంతలోనే పక్కింటి వాకిట్లో రిక్షా ఆగింది. అందులోంచి దిగాడు కంకిపాడు విశ్వనాధం గారు, శారదమ్మ. ఆ అలికిడికి వాకిట్లోకి వెళ్ళాడు మోహన్. “నాన్నగారూ!” అంటూ దగ్గరికి వెళ్ళాడు.

“ఏవిట్రా మోహనా? అర్జంటుగా రమ్మని టెలిగ్రాం ఇచ్చావు. నీ ఒంట్లో బాగాలేదేమో అని కంగారుగా ఏడుస్తూ కూర్చుంది మీ అమ్మ!” చెప్పుకుపోతూ కొడుకునీ అతని అవతారాన్నీ చూశారు.

“లోపలికి వెళదాం రండి నాన్నా!” ఆయనకీ మరో మాటకి అవకాశం యివ్వకుండా చెయ్యి పట్టుకుని లాక్కుపోయాడు. లోపలికి వచ్చి రాగానే అక్కడి మనుషులనీ, మంచాలనీ, పేషెంట్లనీ, డాక్టర్నీ చూసి మరింత మతిపోయింది ఆయనకి

"ఏమిటీ? ఏమైంది?” అని అడిగారు, అంతా వివరించి చెప్పింది భారతి.

మరుక్షణం ఆయన ముఖం ఎర్రబడి పోయింది కొడుకుని ఛేడామడా తిట్టారు. వర్ధనమ్మ లేచి శారదమ్మ చేతులు పట్టుకుంది "మీరు మమ్మల్ని మన్నించాలి. ఇదంతా మేమే చేయించామని అనుకుంటారేమో. భగవంతుడి సాక్షిగా మాకేం తెలీదు. మీరు నన్ను నమ్మాలి" అంది దీనంగా.

“నమ్ముతాంలెండమ్మా. మీ మీద మాకేం కోపం లేదు. మా వంశోద్ధారకుడు మాతో చెప్పాడు కనుక మీ అమ్మాయి మీతో చెప్పిందని మేము అనుకోవడానికి" అన్నాడు విశ్వనాథం.

“అసలైనా నోట్లో వేలుపెడితే కొరకలేకుండా వుండేవాడివి నీకింత ధైర్యం ఎలా వచ్చిందిరా" అంటూ మళ్ళీ కొడుకు మీద దండెత్తుతారు. ఇదంతా చూస్తున్న చలపతిరావు గారికి చిరాకు వేసింది

"అయ్యా! ఇక్కడ మీరిలా అరుస్తుంటే పేషెంట్లకి డిస్ట్రబెన్స్ గా వుంటుంది. అబ్బా మాట్లాడకుండా కూర్చోండి లేదా మీ అబ్బాయిని అలా లోపలికి తీసుకెళ్ళి అక్కడ మండలించండి" అని వార్నింగ్ యిచ్చాడు. దాంతో ఆయన మాట్లాడకుండా కూర్చున్నారు. ఆయన పక్కన కూర్చుని అంతా చెప్పాడు మోహన్. రాధ అందరికి కాఫీలు యిచ్చింది. గడియారం రెండున్నర కొట్టింది. సూర్యంగారికి మెలకువ వచ్చింది. నెమ్మదిగా కదిలి కళ్ళు విప్పారు. విశ్వనాథంగారు లేచి వచ్చి స్నేహితుడి పక్కన కూర్చున్నారు. ఎదురుగా ఉన్న వ్యక్తి వంక పరిశీలనగా చూశాడు సూర్యం. ఆదరంగా ఆయన చెయ్యి పట్టుకున్నాడు విశ్వనాథం.

“సూర్యం గుర్తుపట్టలేదుట్రా! నేను, విశ్వాన్ని" అన్నాడు

వెంటనే లేచి మిత్రుడిని కౌగిలించుకున్నారు సూర్యంగారు. “ఎన్నాళ్ళకి చూశాన్రా నిన్ను ఎప్పుడొచ్చావు?” అంటూ వుండగా హఠాత్తుగా జరిగిన విషయం గుర్తుకువచ్చింది. తల తిప్పి చుట్టూ చూశారు, కాస్త దూరంలో మంచం మీద పడుకున్న సత్యం వంక చూడగానే వుసూరుమంది ఆయన ప్రాణం. స్టెత్ గుండెమీద పెట్టి టెస్ట్ చేస్తున్న డాక్టర్ ని వారించారు.

“నా విషయం వదిలెయ్యండి డాక్టర్ గారూ! నేను లక్షణంగా వున్నాను. వాడి విషయం చూడండి. బొత్తిగా అనారోగ్యం మనిషి" అన్నాడు.