Prema Pandem part 31
చిన్నగా దగ్గాడు రాంబాబు. సర్వోత్తమరావు తలెత్తి రాంబాబు వంక చూశాడు. “ఏంటోయ్ సంగతి?” అడిగాడు. “నందివర్ధన రావు నా కోసం ఇంకా కబురు పెట్టలేదు” మెల్లగా అన్నాడు రాంబాబు. “కబురు పెట్టలేదా? ఎందుకూ” అర్థం కానట్టు చూస్తూ అడిగాడు సర్వోత్తమరావు. “అంటే ఆత్మానందం జనరల్ మేనేజర్ గారితో మాట్లాడితే... ఆయన నందివర్ధన రావుతో మాట్లాడాలి కదా... ఆయన నందివర్ధనరావుతో మాట్లాడాలి కదా?” భయపడ్తూనే అన్నాడు రాంబాబు సర్వోత్తమరావు ఎక్కుడ విసుక్కుంటాడో అని... సర్వోత్తమరావు విసుక్కోలేదు చిరునవ్వు నవ్వేశాడు. “మనం ఆత్మానందానికి నిన్న రాత్రే కదా చెప్పా. మాట్లాడారులే... మనం చాలా అర్జంటని చెప్పం కదా... ఈ వేళ తప్పకుండా మాట్లాడతానని చెప్పాడు మన జనరల్ మేనేజర్ గారు ఈ వేళే నందివర్ధన రావుని పిలిచి చెప్పవచ్చు ఈ వేళ కాకపోయినా రేపయిఅనా చెప్పవచ్చు. జనరల్ మేనేజర్ అంటే బోల్డంత బిజీగా వుంటాడు. ఆయనకు నీ ఒక్క పనేనా? బోల్డన్ని పనులు ఉంటాయి ఒక రోజు వెయిట్ చేసి చూద్దాం” “అంతే నంటావా?” “అంతే!”
ఇంతలో ప్యూన్ రాంబాబును పిలిచాడు. “సార్! మిమ్మల్ని మేనేజర్ గారు పిలుస్తున్నారు. ఆ మాట వినగానే రాంబాబు మొహం వికసించింది. “నందివర్థన రావు పిలుస్తున్నడంటే” సంతోషంగా అన్నాడు సర్వోత్తమరావుతో. “ఊ... వెళ్లు.... బెస్టాఫ్ లక్” రాంబాబు చెయ్యి పట్టుకుని షేక్ చేస్తూ అన్నాడు సర్వోత్తమరావు. “థాంక్యూ!” రాంబాబు మేనేజర్ క్యాబిన్ లోకి హుషారుగా అడుగుపెట్టాడు. “ఏం సార్... పిలిచారా?” విప్పారిన మొహంతో ప్రశ్నిచాడు రాంబాబు. “కాదు... పిలిపించాను... హ హ హ... ఎలా ఉంది జోక్! అన్నాడు నందివర్థన రావు. “చాలా బాగుంది సార్! సరేగాని ముందు మీ రెండుకు పిలిపించారో త్వరగా చెప్పండి సార్” ఆతృతగా అన్నాడు రాంబాబు. నందివర్ధనరావు రాంబాబు వానక వింతగా చూశాడు. “”నీకు పనిమీద మరీ శ్రద్ధ ఎక్కువైపోయినట్టు వుందే... నేను చెప్పేదాకా ఆగకుండా యమ కంగారు పడిపోతున్నావ్?” రాంబాబు మెలికలు తిరిగాడు.
“ఇదిగో.... ఈ రెండు ఫైల్సూ తీసుకుని సాయంత్రంలోగా పూర్తి చేసి పట్రా” టేబుల్ మీది ఫైల్సుని చూపిస్తూ అన్నాడు నందివర్థన రావు. రాంబాబు ఆ ఫైలు అందుకుని అడిగాడు “అంతేనా సార్?” “అంతే....” సమాధానం చెప్పాడు అతను. “ఇంకేం లేదా సార్?” “లేదు” “అంతే నా ఉద్దేశం నాకు ఇంకా చెప్పాల్సింది ఏమైనా ఉందా అనీ...” అతను సీరియస్ గా చూశాడు. “ఏం? పని ఇచ్చానని వ్యంగ్యంగా మాట్లాడుతున్నావా? తోక కట్ చేస్తానంతే!” “అబ్బే! వ్యంగ్యం ఏమీ కాదు సార్!” కంగారుపడుతూ అన్నాడు రాంబాబు. “నువ్వెళ్ళి ఫైళ్ళు చూడు... ఇంకా ఏమైనా ఉంటే నేను కబురు చేస్తాలే!” “అలాగే సార్!” రాంబాబు క్యాబిన్ లోంచి బయటికి వచ్చాడు. “ఏమైంది?” సర్వోత్తమరావు తన సీట్లోంచి అరిచాడు. రాంబాబు పెదవి విరిచాడు. “ఏమీ చెప్పలేదు. ఈ ఫైల్సు యిచ్చాడు” నీరసంగా జవాబు చెప్పి తన సీటులో కూర్చున్నాడు. సాయంత్రం దాకా అతని దగ్గర్నుండి కబురేమి రాలేదు.