పడిపోయే జీవితాన్ని నిలబెట్టే వసంత నవరాత్రులు.. ఇలా చేస్తే అమ్మవారి అనుగ్రహం తథ్యం..!

 

పడిపోయే జీవితాన్ని నిలబెట్టే వసంత నవరాత్రులు.. ఇలా చేస్తే అమ్మవారి అనుగ్రహం తథ్యం..!

భారతదేశంలో నవరాత్రులు అనగానే చాలామందికి ఆశ్వయుజ మాసంలో వచ్చే శరన్నవరాత్రులు గుర్తుకు వస్తాయి. అయితే.. శరన్నవరాత్రులు కాకుండా ఇంకా మూడు నవరాత్రులు ఉన్నాయి. అంటే ఒక ఏడాదిలో మొత్తం నాలుగు నవరాత్రులు ఉంటాయి. వీటిలో రెండు బహిర్గతంగా జరుపుకునేవి కాగా మరొక రెండు నవరాత్రులను గుప్తంగా జరుపుకోవాలని చెబుతారు పండితులు.  వీటిలో శరన్నవరాత్రుల లాగా అందరినీ పిలిచి జరుపుకునే నవరాత్రులే వసంత నవరాత్రులు.. వీటినే చైత్ర నవరాత్రులు అని కూడా పిలుస్తారు. చైత్ర నవరాత్రులు చైత్రమాసం పాడ్యమి నుండి మొదలై నవమి వరకు ఉంటాయి.  చైత్ర మాస నవమి రోజే.. శ్రీరామ నవమి కూడా జరుపుకుంటారు. దీంతో ఈ నవరాత్రులను చైత్ర నవరాత్రులు అని మాత్రమే కాకుండా రామనవరాత్రులు అని కూడా పిలుస్తారు. అయితే.. చైత్ర నవరాత్రుల విశిష్టత ఏమిటి?  చైత్ర నవరాత్రులలో అమ్మవారిని ఎలా ఆరాధిస్తే ఆ అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది?  పూర్తీగా తెలుసుకుంటే..

వసంత నవరాత్రులు..

తెలుగు పంచాంగం ప్రకారం మొదలయ్యే కొత్త సంవత్సరంలో వచ్చే మొదటి నవరాత్రులే వసంత నవరాత్రులు లేదా చైత్ర నవరాత్రులు.. దీంతో పాటు ఆశ్వయుజ మాసంలో వచ్చే శరన్నవరాత్రులు కూడా ఉంటాయి.  ఈ రెండింటిని యమదంష్ట్రలు అని అంటారు.  అంటే ఈ రెండు యముడి కోరలు ఈ రెండు నవరాత్రులు అని చెబుతారు.  ఈ నవరాత్రులలో అమ్మవారిని పూజించడం వల్ల చాలా గొప్ప ఫలితం ఉంటుంది.

అమ్మవారి ఆరాధన..

చైత్ర మాసం పాడ్యమి నుండి నవమి వరకు అమ్మవారిని నవరాత్రులలో ఆరాధిస్తారు.  ఈ నవరాత్రులలో శక్తి మేరకు అమ్మవారి ఆరాధన జరుగుతుంది.

చాలామంది నవరాత్రులు చేసుకోవడం అంటే చాలా కష్టతరం అని అనుకుంటారు. కానీ.. అమ్మవారికి మనస్ఫూర్తిగా, పూర్తీ భక్తితో చేసే ఎంత చిన్న ఆరాధన అయినా ఎంతో ప్రీతి కలిగిస్తుంది.

ప్యాడమి నుండి నవమి వరకు అమ్మవారిని ప్రతిరోజు నిష్టగా ఆరాధించే వారు ఉంటారు. అమ్మవారికి పీఠాన్ని, కలశాన్ని ఏర్పాటు చేసి తొమ్మిది రోజులు దీక్షగా చేసే వారు ఉంటారు.  ఇలా చేయడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. కొందరు శ్రీచక్రాన్ని స్థాపించి కూడా  పూజలు  చేస్తారు. కానీ ఇది చాలా నిష్టగా చేయాల్సినది. అందుకే పండితులు ఎంత ఆడంబరంగా చేస్తామని కాకుండా ఎంత భక్తిగా చేస్తామనే దాని మీదనే అమ్మవారి అనుగ్రహం ఆధారపడి ఉంటుంది అని చెబుతున్నారు.

నవరాత్రులలో ప్రతి రోజూ అమ్మవారికి ఏదో ఒక  నైవేద్యం సమర్పించడం చాలా మంచిది.  మరీ ముఖ్యంగా నవరాత్రుల ఆరాధన సాయంత్రం సమయంలోనే చేస్తారు.  సాయంత్రం ఆరు గంటల నుండి 8 గంటల మధ్య సమయం చాలా శ్రేష్టమని చెబుతారు.

అమ్మవారిని ఆర్భాటంగా,  ఆడంబరాలతో పూజించలేకపోతే చాలా సాధారణంగా పూజించి కూడా అమ్మ అనుగ్రహం పొందవచ్చు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం లలిత సహస్రనామం పారాయణ చేసుకోవచ్చు.  కుదరని వారు సాయంత్రం మాత్రమే అయినా చేసుకోవచ్చు.  మరీ ముఖ్యంగా లలిత సహస్రనామ పారాయణ చేస్తూ అమ్మవారి విగ్రహానికి, అమ్మ స్వరూపమైన సరస్వతి, లక్ష్మీదేవి స్వరూపాలకు అయినా సరే.. కుంకుమ  అర్చన చేసుకోవడం చాలా మంచిది. ఈ కుంకుమను ప్రతి రోజూ మహిళలు ధరిస్తూ ఉంటే, వారి ఆరోగ్యమే కాకుండా భర్తల ఆయుష్షు కూడా ఎంతో బాగుంటుందని చెబుతారు.

నైవేద్యం..

అమ్మవారికి నైవేద్యం పెట్టే విషయంలో చాలా మంది చాలా గందరగోళ పడుతూ ఉంటారు. కానీ.. అమ్మవారికి పులిహోర,  దద్దోజనం,  పాయసం,  క్షీరాన్నం.. ఇలా ఏదో ఒకటి నైవేద్యం పెట్టవచ్చు. ఏదీ కుదరక పోతే కేవలం అన్నం వండి అందులో పాలు,  బెల్లం ముక్క,  కాసింత నెయ్యి వేసి అయినా నైవేద్యం పెట్టేయవచ్చని పండితులు చెబుతున్నారు. ఇవన్నీ లేకపోయినా కేవలం ఉట్టి అన్నం పెట్టినా ఆ అమ్మవారు స్వీకరిస్తారట.  అది కూడా వండేంత సమయం లేదు అనుకుంటే ఏదో ఒక పండు,  బెల్లం యాలకులు వేసి చేసిన పానకం అమ్మకు నైవేద్యంగా పెట్టేయవచ్చు.  ముఖ్యంగా భక్తిపూర్వకంగా లలిత సహస్రనామం చదువుకోవడం,  ఏదో ఒకటి భక్తిపూర్వకంగా అమ్మకు నివేదించడమే  ఆ అమ్మ అనుగ్రహానికి దగ్గర చేస్తుంది.  ఈ విషయాన్ని  లలిత సహస్రనామాలలోనే చెప్పారు.

"భక్తి ప్రియా, భక్తి గమ్యా,  భక్తి వశ్యా, భయాపహా"

పై వాక్యం లలితా సహస్రనామాలలో 42వ శ్లోకంలో వస్తుంది. దీని ప్రకారం అమ్మవారు భక్తికి ప్రీతి చెందుతుంది,  భక్తికి గమిస్తుంది,  భక్తికి వశమవుతుంది అని చెప్పుకోవచ్చు.  కాబట్టి అమ్మవారిని ఈ వసంత నవరాత్రులలో ఆరాధించేటప్పుడు ఎంత గొప్పగా ఉపచారాలు చేస్తున్నాం అనేదానికంటే ఎంత భక్తిగా ఏమి ఉపచారాలు చేస్తున్నాం అనేదే ముఖ్యం.

                                       *రూపశ్రీ.