సంవత్సరంలో కేవలం నెల రోజులు మాత్రమే తెరిచి ఉంటే శివాలయం!

 

సంవత్సరంలో కేవలం నెల రోజులు మాత్రమే తెరిచి ఉంటే శివాలయం!


 భారతదేశం ఎన్నో మర్మమైన దేవాలయాలకు నిలయం, వాటి సంప్రదాయాలు , ఆచారాలు ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తాయి. కొన్ని ఆలయాలు రహస్యంతో కూడుకుని ఉంటాయి,  మరికొన్ని ఆలయాలు ఏడాదిలో కేవలం కొన్ని రోజులు మాత్రమే  తెరవబడతాయి.  అలాంటి ఆలయాలలో కేరళలోని కన్నూర్ జిల్లాలో ఉన్న కొట్టియూర్ శివాలయం కూడా ఒకటి.  దక్షిణ భారతదేశంలో ఈ ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయాన్ని దక్షిణ భారతదేశపు కాశీ అని కూడా పిలుస్తారు. ఏడాదిలో కేవలం నెల రోజులు మాత్రమే ఈ ఆలయాన్ని   తెరిచి ఉంచుతారు.  ఈ ఆలయం గురించి మరింత వివరంగా తెలుసుకుంటే..

కొట్టియూర్ శివాలయం..

 ఉత్తర కేరళలోని పురాతన పుణ్యక్షేత్రమైన కొట్టియూర్ శివాలయం  ప్రశాంతమైన కొండలు , అడవుల మధ్య నెలకొని ఉంది. అక్కరె కొట్టియూర్ మరియు ఇక్కరె కొట్టియూర్ అనే రెండు దేవాలయాలు బావళి నదికి చెరో ఒడ్డున నిర్మించబడ్డాయి.

కేవలం నెల రోజులే..

మే-జూన్ నెలల్లో వచ్చే వైశాఖ ఉత్సవం సందర్భంగా అక్కరె కొట్టియూర్ ఆలయం కేవలం 28 రోజులు మాత్రమే తెరిచి ఉంటుంది , మిగిలిన సంవత్సరమంతా మూసివేయబడి ఉంటుంది. ఈ కాలంలో ఇక్కరె కొట్టియూర్ ఆలయం మూసివేయబడి ఉంటుంది.


పురాణ కథ..

ఈ ఆలయానికి సంబంధించిన పురాణ గాథ ప్రకారం, బ్రహ్మ కుమారుడైన దక్ష ప్రజాపతి తన కుమార్తె సతీదేవికి శివునితో జరిగిన వివాహం పట్ల అసంతృప్తి చెంది, సతీదేవికి గానీ, శివునికి గానీ తెలియకుండా ఈ ప్రదేశంలో యజ్ఞం చేయాలని నిర్ణయించుకున్నాడు. తన తండ్రి ఉద్దేశం తెలియని సతీదేవి యజ్ఞానికి హాజరు అయ్యింది. కానీ దక్షుడు చేసిన అవమానానికి   సతీదేవి చాలా బాధపడింది.

తండ్రి మాటలకు మనస్తాపం చెంది, అవమానానికి గురైన అతను తన యోగ శక్తులను ఉపయోగించి ఆత్మార్పణ చేసుకుంది. ఈ సంఘటనతో  ఆగ్రహించిన శివుడు, వీరభద్రుని సృష్టించి దక్షుని శిరచ్ఛేదం చేశాడు.

విష్ణుమూర్తి, బ్రహ్మదేవుడు ఇద్దరూ కలిసి పరమేశ్వరుడిని  శాంతపరిచిన తరువాత, శివుడు దక్షుని తల స్థానంలో మేక తలను అమర్చాడు. అందువల్ల, ఈ ప్రదేశం బ్రహ్మ, విష్ణు , పరమేశ్వరులనే  త్రిమూర్తుల దివ్య సాన్నిధ్యం ఉన్న స్థలంగా పరిగణించబడుతుంది .

ఇతర దేవాలయాల మాదిరిగానే ఇక్కరె కొట్టియూర్ కూడా కొన్ని ఆలయ సముదాయం. అయితే ఒక చెరువు మధ్యలో ఉన్న అక్కరె కొట్టియూర్ ఆలయంలో, నదీ రాళ్లతో చేసిన ఎత్తైన వేదికపై ఎలాంటి నిర్మాణం లేకుండా స్వయంభువుగా వెలసిన శివలింగం కూడా ఉంది. వైశాఖ ఉత్సవాల సమయంలో, ఇక్కడున్న  అడవి 28 రోజుల పాటు అద్భుతమైన శివాలయంగా రూపాంతరం చెందుతుంది. ఇక్కడ గోడలు, పైకప్పులు లేదా లోహ నిర్మాణాలు ఏవీ ఉండవు, కేవలం ఒక బహిరంగ ఆలయం మాత్రమే ఉంటుంది.

ఏడాదిలో 28 రోజులే..

శివునికి అంకితం చేయబడిన ఈ ప్రత్యేక ఆలయం సంవత్సరంలో 11 నెలల పాటు మూసి ఉంటుంది.  వైశాఖ మాసంలో మాత్రమే దర్శనం కోసం తెరిచి ఉంటుంది. ఆలయ తాత్కాలిక నిర్మాణం కోసం  అడవి నుండి వెదురు , చెట్ల ఆకులను ఉపయోగిస్తారు. ఆలయాన్ని సందర్శించే యాత్రికులు తమతో పాటు ఓరపో అనే ఒక ప్రత్యేక వస్తువును తీసుకువెళతారు. ఇవి నరికిన వెదురుతో తయారు చేయబడిన వస్తువులు, ఇవి చూడటానికి భృగు మహర్షి శిల లాగా  ఉంటాయి.

వైశాఖ ఉత్సవం ముగిసిన తర్వాత వెదురు తడకలు,  పందిళ్లు అన్నీ తొలగిస్తారు. పరమేశ్వరుడు నెలకొని ఉన్న  ఈ పవిత్ర స్థలాన్ని దట్టమైన అడవి తిరిగి తన ఆధీనంలోకి తీసుకుంటుంది. ఆలయం 11 నెలల పాటు మరోసారి ప్రకృతిలో కలిసిపోతుంది.

                                           *రూపశ్రీ.