ప్రయత్నిస్తూనే ఉండాలి!

 

భగవద్గీతతో విజయవంతమైన కెరీర్‌ – 3 

ప్రయత్నిస్తూనే ఉండాలి!

సుఖదుఖాలు, లాభనష్టాలు, జయాపజయాలు వీటన్నింటినీ బేరీజు వేసుకుంటూ మీనమేషాలు లెక్కపెట్టుకోకుండా యుద్ధానికి సిద్ధపడమంటాడు కృష్ణుడు.

సుఖదుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ |

తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమువాప్స్యసి ||

సాధించాలి అనే నిశ్చయం వదిలేసి ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటే బుద్ధి పరిపరి విధాలుగా పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తాడు. ఎందుకంటే నిశ్చయం సరిగ్గా లేకపోతేనే ఫలితం గురించి అనుమానం మొదలవుతుంది. అందుకే ఫలితం గురించి ఆలోచించకుండా పని చేయమంటూ గీతలో పదేపదే వినిపిస్తుంది. భగవద్గీతా బోధ వరకూ కూడా తత్వచింతనలో రేఖామాత్రంగా కనిపించిన కర్మయోగాన్ని ఈ మాటలు బలపరిచాయి. కేవలం భక్తి, జ్ఞాన మార్గాలకు మాత్రమే కాదు… రోజువారీ జీవితాన్ని మరింత ప్రభావంగా, పరిపక్వంగా గడిపేందుకు ఆధ్యాత్మికత ఉపయోగపడుతుందని నిరూపించాయి. గీతలోని రెండో అధ్యాయం సాంఖ్యయోగం నుంచే ఈ భావన ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.

‘కర్మణ్యే వాధికారస్తే మాఫలేషు కదాచన’ అనే మాట ప్రముఖ గీత శ్లోకంగా నిలిచింది. ఇదే భావాన్ని వ్యక్తపరిచే మరెన్నో శ్లోకాలూ కనిపిస్తాయి. ప్రయత్నం మన చేతుల్లోనే ఉంటుంది. దాన్ని నూటికి నూరు శాతం లోటు లేకుండా పూర్తి చేయడమూ మన చేతుల్లోనే ఉంది. దాన్ని పక్కన పెట్టి ఫలితం గురించి ఆలోచిస్తూ కూర్చుంటే లేనిపోని అనుమానాలు రావడం, మనసు చలించడం తప్ప ఉపయోగం లేదు. కెరీర్‌ లో ఒక కోర్సును ఎంచుకున్న తర్వాత, పరీక్షలు రాసిన తర్వాత, ఇంటర్వ్యూ వరకు వెళ్లిన తర్వాత, ఉద్యోగంలో చేరిన తర్వాత… ఇలా ఆ తర్వాత ఏం జరుగుతుందా అనే మాట ఊహాజనితం. బాగా చదవాలి, శ్రద్ధగా రాయాలి అన్నవి మాత్రమే మనం ప్రభావం చేయదగిన విషయాలు. వాటి మీద దృష్టి పెట్టి నూరు శాతం ప్రయత్నించాలి.

గీత పూర్వజన్మవాసనలకు, విధిరాతకు ఎంత ప్రాధాన్యం ఇస్తుందో మన ప్రయత్నానికీ, మన కర్మకు కూడా అంతే ప్రాధాన్యత ఇస్తుంది. అందుకే గొప్పగొప్ప వైజ్ఞానికుల మనసును సైతం గెలుచుకుంది. అంతరిక్షంలో సుదీర్ఘకాలం స్పేస్‌ వాక్‌ చేసిన మహిళగా సునీత విలియమ్స్‌ గొప్పతనం తెలిసిందే. భారతీయ మూలాలు ఉన్న సునీత, వ్యోమనౌకలో తనతో పాటు గీతను కూడా తీసుకువెళ్లడం విశేషం. ‘నీ గురించీ, నీ జీవితం గురించీ, నీ చుట్టూ ఉన్న ప్రపంచం గురించీ సరికొత్తగా చూపించే సాధనం గీత’ అంటారు సునీత విలియమ్స్‌! మన కెరీర్‌ కు ఆ భగవద్గీత ఎలా ఉపయోగపడుతుందో చెప్పే మరిన్ని విషయాలు తదుపరి వ్యాసంలో…

- నిర్జర.