రావణుడి కంటే ముందు రాముడితో యుద్ధం చేసినవాళ్ళు!!

 

 రావణుడి కంటే ముందు రాముడితో యుద్ధం చేసినవాళ్ళు!!


ఖరుడు బంగారంతో చెయ్యబడ్డ రథం ఎక్కి బయలుదేరాడు. అప్పుడు గాడిద రంగులో ఉన్నటువంటి మేఘాలు ఆకాశంలో వచ్చి ఎర్రటి నీటిని వర్షించాయి. ఆయన రథాన్ని నడుపుతున్న గుర్రాలు చాలా సమతలంగా ఉన్నటువంటి ఆ దారిలో తొట్రుపడి, ముందుకి పడిపోయి, పైకి లేచి నడిచాయి. ఆకాశంలో సూర్యుడి చుట్టూ నలుపు-ఎరుపు రంగుల వలయం ఏర్పడింది. ఒక గ్రద్ద ఎగురుతూ వచ్చి ఆయన ధ్వజం మీద వాలి వెళ్ళిపోయింది. దిక్కులన్నీ అకారణంగా చీకటితో నిండిపోయాయి. నక్కలు నోట్లోనుండి అగ్నిని కక్కుతూ, ఎదురుగా వచ్చి పెద్దగా ఏడిచాయి. ఇన్ని దుశ్శకునాలు ఎదురొచ్చినా, ఆ ఖరుడు వాటిని లెక్కపెట్టకుండా ముందుకి వెళ్ళాడు. ఆ ఖరుడి చుట్టూ 12 మంది రాక్షస సేనానులు నిల్చున్నారు. వాడితోపాటు దూషణుడు, త్రిశిరస్కుడు, ప్రమాధి, స్థూలాక్షుడు, మహాకపాలుడు మొదలైన భయంకరమైన రాక్షసులు కూడా బయలుదేరారు.


అటుపక్క రాముని ఆశ్రమంలో, పక్షులు చిత్రవిచిత్రమైన కూతలు కూస్తున్నాయి. భూమి ఒక్కసారి కంపించింది. అలా కంపించడం వలన బంగారు పిడి కలిగిన ధనస్సు ఎగిరి ఎగిరి పడుతోంది, బాణముల చుట్టూ ధూమం ఆవరించింది. అప్పుడు రాముడు లక్ష్మణుడిని పిలిచి "లక్ష్మణా! నిష్కారణంగా పర్ణశాలలో ఉన్న ధనుస్సు భూమి కంపించేసరికి ఎగిరి ఎగిరి పడుతోంది. అలాగే బాణముల చుట్టూ ధూమం ఆవహిస్తోంది, అంటే గొప్ప యుద్ధం వస్తోందని ధనుర్బాణములు ఆనందపడుతున్నాయి. దూరంగా పక్షి కూస్తోంది అంటే, ఈ యుద్ధంలో జయాపజయాలు దైవనిర్ణయాలు. నా ఎడమ భుజం అదురుతోంది కనుక, ఖచ్ఛితంగా మనం గెలుస్తామని అనుకుంటున్నాను. అందుకని లక్ష్మణా నువ్వు వెంటనే ధనుర్బాణములని పట్టుకొని, సీతని తీసుకొని, ఎవరికీ కనపడకుండా ఉండే గుహలోకి వెళ్ళిపో. నేను యుద్ధం చేస్తాను. నువ్వు నాతో సీతమ్మని తీసుకొని లోపలికి వెళ్ళిపో అనే మాటలు చెప్పకు. నువ్వు యుద్ధం చెయ్యలేవు అని కాదు. నువ్వు ఒక్కడివే వీళ్ళని చంపగలవు, కాని వీళ్ళతో యుద్ధం చెయ్యాలని నేను కోరుకుంటున్నాను. అంతేకాని నిన్ను తక్కువ చేసి చూడడం లేదు. నేను చెప్పింది విని తొందరగా సీతని తీసుకొని వెళ్ళిపో" అన్నాడు.


అప్పుడు సీతమ్మని తీసుకొని లక్ష్మణుడు ఒక పర్వత గుహలోకి వెళ్ళాడు. క్రోధంతో కోదండాన్ని పట్టుకొని ఉన్న రాముడిని చూస్తే, ఆనాడు పినాకిని అనే ధనుస్సుని పట్టుకొని దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేయుటకు నిలబడ్డ రుద్రుడైన శివుడిలా ఉన్నాడని వాల్మీకి మహర్షి చెప్పారు. ఆశ్రమానికి వచ్చిన ఖరుడు తన సైన్యంతో రాముడిని చుట్టుముట్టాడు. మధ్యలో రాముడు ఒక్కడే ఉన్నాడు, రాముడి చుట్టూ 14,000 మంది రాక్షసులు నిలబడ్డారు. అప్పుడు వారు రాముడి మీద బాణాలు, శూలాలు, గదలు మొదలైనవి విసిరారు. వాటి దెబ్బలకి రాముడి ఒళ్ళంతా నెత్తురోడింది. నదీ ప్రవాహం వచ్చి కలిసిపోతునప్పుడు సముద్రం ఎలా సంతోషంగా ఉంటుందో, పెద్ద వర్షం పడుతున్నప్పుడు ఎత్తైన ప్రదేశానికి వెళ్ళి ఆబోతు ఎలా నిలబడుతుందో అలా రాముడు, ఆ బాణ ప్రవాహాన్ని స్వీకరిస్తూ నిలబడ్డాడు. 


రాముడు ఒక్కసారి తన ధనుస్సుని తీసి మండలాకారంగా తిప్పి ఆ రాక్షసుల మీద బాణ ప్రయోగం చేశాడు. ఎప్పుడు ఆ అక్షయబాణ తూణీరంలో నుండి బాణం తీశాడో, ఎప్పుడు ఆ బాణాన్ని తన ధనుస్సుకి సంధించాడో, ఎప్పుడు గురి చూసి ఆ బాణాన్ని విడిచిపెట్టాడో ఎవరూ చూడలేదు. అంత వేగంగా బాణ ప్రయోగం చేశాడు. రాముడు ఏక కాలంలో 13 బాణాలని వింటినారికి తొడిగి విడిచిపెట్టేవాడు. అలా ఆ 14,000 మంది రాక్షసులని రాముడు ఒక్కడే సంహరించాడు.


దూషణుడు ఆగ్రహంతో ఒక పరిఘని పట్టుకొని రాముడి మీదకి వచ్చాడు, అప్పుడు రాముడు వాడి రెండు చేతులు నరికి ఒక దెబ్బ కొట్టాడు. రాముడు కొట్టిన దెబ్బకి ఆ దూషణుడు ఏనుగు పడిపోయినట్టు నేల మీద పడి మరణించాడు. ఇంక ఆ యుద్ధరంగంలో ఖరుడు, త్రిశిరస్కుడు మాత్రమే మిగిలారు. ఖరుడి ఆజ్ఞ మేరకు త్రిశిరస్కుడు యుద్ధానికి వచ్చి రాముడి చేతిలో మరణించాడు.


అప్పుడు ఖరుడు రాముడితో భయంకరమైన యుద్ధం చేశాడు. రాముడు వింటినారిలో బాణం తొడుగుతుంటే, ఆ ఖరుడు అపారమైన వేగంతో తన రథంలో వచ్చి రాముడి పిడికిలి మీద కొట్టాడు. ఆ దెబ్బకి వింటినారి తెగిపోయి ఆ ధనుస్సు విరిగిపోయింది. ఖరుడు అమితమైన వేగంతో రాముడి గుండెల మీద బాణాలని వేసేసరికి, ఆయన కవచం  కింద పడిపోయింది. అప్పుడు రాముడి గుండెల మీద బాణాలతో కొట్టాడు. ఆ దెబ్బలకి పర్వతాల నుండి సెలయేళ్ళు పారినట్టు, రాముడి గుండెల నుండి రక్తం కారింది.


రాముడి పక్కనే ఉన్న అగస్త్య మహర్షి ప్రసాదమైన విష్ణు ధనుస్సుని తీసుకుని ఖరుడితో ఇలా అన్నాడు " మూడులోకములను పరిపాలించగల సమర్ధుడైనా, పాపకర్మలను చేస్తున్నవాడు మాత్రం బతకడు. లోకానికి విరుద్ధమైన పనులు చేస్తూ బతికేవాడికి కొంతకాలం లోకము తలవంచి ఉండవచ్చు, కాని వాళ్ళకి ఒకసారి అవకాశం వస్తే, పదిమందిలో ఒక్కత్తె వెళ్ళిపోతున్న పాము కనబడితే అందరూ కర్రలతో కొట్టి చంపినట్టు, అందరూ కలిసి అటువంటివాడిని చంపేస్తారు. ఎక్కడో పర్ణశాలల్లో కూర్చుని తపస్సు చేసుకునే ఋషుల మీద నీకు ఎందుకు ఆగ్రహం, వాళ్ళని ఎందుకు బాధ పెట్టావు. వాళ్ళని బాధ పెట్టిన ఫలితాన్ని నువ్వు ఇప్పుడు అనుభవిస్తావు. ఏ ఋతువులో ఏ పువ్వు పుయ్యాలో, ఆ ఋతువులో ఆ పువ్వు పూస్తుంది. అలా పాపము యొక్క ఫలితాన్ని ఎప్పుడు ఇవ్వాలో పరమేశ్వరుడికి తెలుసు, ఆయన ఇవ్వడం సిద్ధం చేసిననాడు ఆ ఫలాన్ని అనుభవించాలి. ఏ భూమిని నువ్వు ఇంతకాలం బాధ పెట్టావో, ఆ భూమి ఈనాడు నీ ఒంట్లోనుండి కారే వేడి నెత్తురు తాగుతుంది. నువ్వు ఇంతకాలం చేసిన పాపాలకి ఫలితంగా నీ కుత్తుకని తీసేస్తున్నాను" అని బాణం వదిలాడు. ఖరుడు కూడా మరణించాడు.


                               ◆ వెంకటేష్ పువ్వాడ.