అమ్మో అమ్మాయిలు 26
చెవిటి ధర్మరాజు తను చెప్పింది వినిపించుకొక సుందర్రావుతో చేతులు కలిపి సుకన్య నిచ్చి వలబంతాన తనకి పెళ్ళి చేయటం. ఆ కలయొక్క షాక్ లోంచి తేరుకొని అబ్బులు నడి చాప మీద కూర్చుని భూతద్దాలు టవల్ తో తుడుస్తూ దీర్ఘంగా ఆలోచిస్తూండగా......... సుడిగాలిలా వ్యాకర్ణ గదిలోకి దూసుకువచ్చాడు.
వచ్చి.. “కొంప మునిగిందిరా అబ్బూ!” అన్నాడు.
“ఎవరి కొంప?” సీరియస్ గా అడిగాడు అబ్బులు భూతద్దాలు తగిలించుకుని అద్దాల్లోంచి వ్యాకర్ణని ఎగాదిగా చూసి.
“నా కొంప" అన్నాడు వ్యాకర్ణ.
“విచారించకు కర్ణా! నీవూ వున్నది. ఒకే కొంపలో. నీ కొంప మునిగినా నా కొంపయూ మునిగినట్లే!. అయినా మనది అద్దె కొంప, ఫర్వాలేదు" అన్నాడు అబ్బులు, అదేం సీరియస్ విషయం కాదన్నట్లు డోంట్ కేర్ అన్నట్లు ఫోజు పెట్టి.
“ఆపదలో వున్న వాడితో తాపీగా మాట్లాడటం తగదురా అబ్బునాధం!”
“నీ కొచ్చిన ఆపదేంటి?”
“కల..... ఆ కలలో పెళ్ళి …... ఆ పెళ్ళి తర్వాత హానీమూన్.. ఆ తర్వాత ఆ విషయం నోరు జారటం.... ఆ తర్వాత యిలా పరుగెత్తుకు రావటం.... ఆపై ఈ గండం ఎలా గడుస్తుందా అని. అని......”
ఈ విషయం విన్న అబ్బులు చాప మీద యింతెత్తున ఎగిరిపడ్డాడు. “ఒరేయ్ కర్ణా! నీకు వచ్చిందిరా కల?” అన్నాడు.
“నీకూ వచ్చిందేమిటి కల?” ఎదురు ప్రశ్న వేశాడు వ్యాకర్ణ.
“వచ్చింది. పెళ్ళి ప్రేమ అబ్బబ్బబ్బా........?” ఇహ చెప్పలేనట్లు కళ్ళు మూసుకున్నాడు అబ్బులు.
“ఛట్! నా కొచ్చిన కల నీకు రావటానికి వీలులేదు. ఇద్దరితో ఎలా పెళ్ళి జరిగింది? ఎలా కుదిరింది? ఎలా... ఎలా అంట?”
“నన్ను కాదు ఆ విషయం అడగాల్సింది, ఆ జిడ్డుని, మామగాడిని, సుకన్యమ్మని,” కసిగా అన్నాడు అబ్బులు.
“వాళ్ళనెందుకు?” అర్థంగాని వ్యాకర్ణ అయోమయంగా అడిగాడు.
“పెళ్ళాడింది పిచ్చి తల్లిని, పెళ్ళి చేసింది యీ పిచ్చి మారాజు కాబట్టి.”
“ఆ..... అయితే నీ కలలోకి వచ్చింది జయచిత్ర కాదా?”
“ఏంటీ, నీ కలలోకి వచ్చింది జయచిత్రా?” ఆపై వచ్చిన కలలు అర్థం చేసుకోవటానికి యిద్దరికీ అయిదు నిముషాలు మించి పట్టలేదు. 'కలలోనే కదరా పెళ్ళయింది ఏం ఫరవాలేదు" అని ధైర్యం చెప్పాడు వ్యాకర్ణ.
“మరి, నీకొచ్చిందీ కలే కదా! కొంపలంటుకున్నట్టు అంట గాభరాగా పరుగెత్తుకొచ్చావ్?” అని అబ్బులడిగాడు.
“కల సంగతి జయచిత్రతో నోరు జారి చెప్పారా అబ్బూ!” అని రాగం తీశాడు వ్యాకర్ణ.
“దిగులు పడకు. ఈ యిల్లు కాకపొతే మరో ఇల్లు. నీ తప్పేముంది. నువ్వేం రమ్మని పిలిచావా? పెళ్ళికాని పిల్ల ఆ పిల్లది తప్పు. బ్రహ్మచారి కల్లోకి రావచ్చా? ఏదన్నా అంటే ఈ మాట ముఖాననేసెయ్యి. ముఖం ఎక్కడ, దాచుకోవాలో తెలియక నీ గుండెల్లో దాచేసుకుంటుంది" అంటూ అబ్బులు తాపీగా చెప్పి తీరుబడిగా లేచి టవలు భుజానేసుకున్నాడు.
అబ్బులి సలహా విని ఆనందించిన వ్యాకర్ణ అబ్బులి బుగ్గలు ముద్దెట్టుకుని "నువ్వాడపిల్లవయితే నిన్నే పెళ్ళాడే వాణ్ణి" అని విచారించి.... “ఎక్కడికిరా అబ్బూ?” అని అడిగాడు.
“బాత్ రూమ్ కి" అన్నాడు అబ్బులు.
'మధ్య దోవలో సుకన్య నాథా అంటూ తగులుకుంటుందేమోరోయ్?” అన్నాడు వ్యాకర్ణ భయపడిపోతూ.
“భయమక్కర లేదు కర్ణా! అబ్బులి కలలోకి సుకన్యని లాక్కొచ్చారు పెద్ద మనుషులు. సుకన్య కలలోకి యీ అబ్బులు గాడు వెళ్ళలేదు. వెళ్ళడు" అని అబ్బులు బాత్ రూమ్ కి బైయలు దేరాడు
“మా సంగతి అలా కాదే. నా కల్లోకి జయచిత్ర వచ్చింది. జయచిత్ర కల్లోకి నే వెళ్ళాను. మాది సీరియస్ కేసు" అనుకున్నాడు వ్యాకర్ణ.