ఈసారయినా వికేంద్రీకరణ జరుగుతుందా?

  రాష్ట్ర విభజనను కలలోనైనా ఊహించని పాలకులు అందరూ హైదరాబాదు మనదేననే భావనతో కేవలం దానినే అభివృద్ధి చేసుకొంటూపోయారు తప్ప మిగిలిన జిల్లాల అభివృద్ధి గురించి పెద్దగా పట్టించుకోలేదు. నానాటికీ హైదరాబాదు దేశంలోనే మేటి నగరాలలో ఒకటిగా ఎదుగుతుంటే అందుకు తెలుగువారు అందరూ గర్వంతో ఉప్పొంగిపోయారు తప్ప ఏనాడు తమ జిల్లాలను హైదరాబాదుతో సమానంగా ఎందుకు అభివృద్ధి చేయడం లేదని ప్రశ్నించలేదు. హైదరాబాదుపై రాష్ట్ర ప్రజలందరూ అంతటి మమకారం పెంచుకొన్నారు. కానీ అందరూ కలిసి అభివృద్ధి చేసుకొన్న హైదరాబాదును రాష్ట్ర విభజన కారణంగా వదులుకోవలసి రావడమేగాక, విభజన తరువాత రాజధాని లేని రాష్ట్రంగా ఆంద్రప్రదేశ్ మిగిలిపోయింది. అంతేకాదు.. హైదరాబాదు మనదేననే భావనతో రాష్ట్రం నలుమూలల నుండి అక్కడకు వచ్చి స్థిరపడినవారందరూ ఇప్పుడు ‘సెకండ్ ‘క్లాస్ సిటిజన్స్’ గా మిగిలిపోయారు.   అందువల్ల అటువంటి ఘోర తప్పిదం ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ పునరావృతం కాకూడదనే ధృడాభిప్రాయం పాలకులలోనే కాక ప్రజలలో కూడా నెలకొందిప్పుడు. ఇకనయినా పాలనను, అభివృద్ధిని వికేంద్రీకరణ చేసి రాష్ట్రంలో 13 జిల్లాలను సమానంగా అభివృద్ధి చెందేలా చేయాలని ప్రజలందరూ కోరుకొంటున్నారు. కానీ ఈ నెల రోజుల కాలంలో మంజూరు చేయబడిన అనేక సంస్థలు, అభివృద్ధి పధకాలు అన్నీ కేవలం కొన్ని ప్రధాన నగరాలు, జిల్లాలకే పరిమితమవుతున్నట్లు కనబడుతోంది. ఇప్పుడే ఈవిధంగా భావించడం తొందరపాటే అనుకొన్నప్పటికీ, కంటికి మాత్రం ఆవిధంగానే కనబడుతున్నాయి. ఆ కారణంగానే మళ్ళీ అదే తప్పు పునారావృతం కాబోతోందా? అనే అనుమానాలు విజయనగరం, శ్రీకాకుళం, కడప, కర్నూలు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు అనంతపురం జిల్లాల వాసులలో కలుగుతున్నాయి. ఇంతకాలం తీవ్ర నిరాదరణకు గురయిన తమ ప్రాంతాలను ఇకనయినా ప్రధాన జిల్లాలు, నగరాలతో సమానంగా అభివృద్ధి చేయాలని అక్కడి ప్రజలు కోరుకొంటున్నారు.   అందువల్ల 13జిల్లాలలో లభ్యమయ్యే స్థానిక వనరులు, అవకాశాలను పూర్తిగా వినియోగించుకొనేవిధంగా అభివృద్ధి పధకాలను, సంస్థలను ఏర్పాటు చేసుకొని రాష్ట్రమంతా ఒకేస్థాయిలో అభివృద్ధి సాధించాలని రాజకీయ నాయకులు, ప్రజలు కోరుకోవాలి తప్ప అన్నీ తమ ప్రాంతానికే దక్కాలని కోరుకోవడం వల్ల రాష్ట్ర ప్రజల మధ్య కూడా విభేదాలు తలెత్తే ప్రమాదం ఉంది. ఏమయినప్పటికీ ఇంకా కేంద్ర, ప్రభుత్వాలు తమ అభివృద్ధి ప్రణాళికలను ఇంకా ఖచ్చితంగా ప్రకటించలేదు గనుక ఈసారి తప్పకుండా అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుందని ఆశిద్దాము.
Publish Date: Jul 12, 2014 10:31PM

కొత్త రాజధానికి నీళ్ళేవి?

    ప్రస్తుతం హైదరాబాద్ నగరానికి 17.5 టీ.యం.సీ.ల నీళ్ళు ఖర్చవుతున్నట్లు సమాచారం. విజయవాడ, గుంటూరు నగరాలూ రెంటికీ కలిపి ప్రస్తుతం 4.7 టీ.యం.సీ.ల నీళ్ళు ఖర్చవుతున్నాయి. ఇదికాక చుట్టుపక్కల ఊళ్ళను కూడా కలుపుకొంటే మరో రెండు, మూడు టీ.యం.సీ.ల నీళ్ళు ఖర్చవుతున్నాయని తెలుస్తోంది. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంచుమించు 6-7 టీ.యం.సీ.ల నీళ్ళు ఖర్చవుతున్నట్లు స్పష్టమవుతోంది. ఒకవేళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ప్రాంతంలోనే కొత్త రాజధానిని నిర్మిస్తే, ఈ ప్రాంతాలలో జనాభా దాదాపు రెట్టింపు అయ్యే అవకాశం ఉంది గనుక ఆ నిష్పత్తిలోనే నీళ్ళ అవసరం కూడా పెరుగుతుంది. అప్పుడు కనీసం కనీసం 10-12 టీ.యం.సీ.ల నీళ్ళు అవసరం పడవచ్చును. కానీ ఇప్పుడు తెలంగాణా ప్రభుత్వం 4-5 టీ.యం.సీ.ల నీటి విడుదలకే తీవ్ర అభ్యంతరం చెపుతున్నపుడు, కొత్త రాజధానికి అవసరమయిన 10-12 టీ.యం.సీ.ల నీటిని ఎక్కడి నుండి తీసుకువస్తారు? అనే ప్రశ్నకు జవాబు కనుగొనవలసి ఉంది.   పులిచింతల ప్రాజెక్టులో 45 టీ.యం.సీ.ల నీళ్ళు నిలువచేసుకొనే అవకాశం ఉన్నప్పటికీ, అవన్నీ పూర్తిగా వ్యవసాయానికే సరిపోతాయి, కనుక వాటిపై ఆధారపడలేము. పోనీ పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఈ సమస్య తీరుతుందనుకొంటే, దానికీ తెలంగాణా, ఒడిష ప్రభుత్వాలు తీవ్ర అభ్యంతరాలు చెపుతున్నాయి. ఒకవేళ వారి అభ్యంతరాలను పట్టించుకోకుండా చాలా వేగంగా పనిచేసినట్లయితే ఈ ప్రాజెక్టు పూర్తవడానికి కనీసం మూడు నుండి ఐదేళ్ళు పట్టవచ్చని నిపుణులు చెపుతున్నారు. అంటే కొత్త రాజధాని నిర్మాణం పూర్తయ్యే వరకు కూడా ఈ ప్రాజక్టు నుండి నీళ్ళు అందవని స్పష్టమవుతోంది.   ఇటువంటి పరిస్థితుల్లో కొత్త రాజధానికి నీళ్ళు ఎక్కడి నుండి వస్తాయి? అని ఆలోచిస్తే భూమి గుండ్రంగా ఉన్నట్లు మళ్ళీ కృష్ణానది వైపే చూడవలసి వస్తోంది. అంటే ఒకవేళ విజయవాడ, గుంటూరు మధ్య రాజధాని నిర్మించడం ఖాయం అనుకొంటే, ఈనెల 10న జరిగే కృష్ణా జలసంఘం సమావేశంలో, ఈ సమస్యకు శాశ్విత ప్రాతిపాదికన ఒక పరిష్కారం కనుగొనవలసి ఉంటుంది. అంతే కాకుండా ప్రత్యామ్నాయ మార్గాల కోసం ప్రజలు, నిపుణులు, మేధావుల సలహాలు స్వీకరించడం కూడా మంచిదే.
Publish Date: Jul 5, 2014 10:47PM

గెయిల్ గ్యాస్: ప్రాణాలు మనవి..లాభాలు వాళ్ళవా?

  తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో మొత్తం శుక్రవారం ఉదయం ఉలిక్కిపడింది. ‘నగరం’ అనే గ్రామం కాస్తా క్షణాల్లో ‘నరకం’లా మారిపోయింది. భారత ప్రభుత్వానికి చెందిన గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా (గెయిల్)కి చెందిన గ్యాస్ పైపులైన్ ఒక్కసారిగా పేలడంతో 14 మంది స్థానికులు మంటల్లో మాడిపోయి మరణించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం వుందని అనుమానిస్తున్నారు. బ్లో ఔట్ తరహాలో 250 మీటర్ల ఎత్తుకు రేగిన మంటల ధాటికి నగరం గ్రామం మొత్తం అతలాకుతలం అయిపోయింది. వందలాది చెట్లు మాడిపోయాయి. పంటపొలాలు పొగచూరిపోయాయి. కోనసీమ ప్రాంతమంతా అనకొండాల తరహాలో గ్రామగ్రామాన వ్యాపించి వున్న గ్యాస్ పైపులైన్లు ఎప్పుడో ఒకసారి తమని మింగేస్తాయని ఈ ప్రాంత ప్రజలు నిరంతరం భయపడుతూనే వుంటారు. వారి భయానికి తగ్గట్టుగానే గ్యాస్ పైప్ లైన్లు తరచుగా బద్దలవుతూ కోనసీమ ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తూ వుంటాయి. ఇప్పుడు జరిగిన ఈ సంఘటన కోనసీమలో గ్యాస్ పైప్ లైన్ల వికృత రూపానికి నిదర్శనంగా నిలుస్తుంది. పాతికేళ్ళ క్రితం వేసిన పైపులు తుప్పుపట్టి పోయాయి. ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట గ్యాస్ లీక్ అవుతూనే వుంది. వాటిని నివారించండి మహాప్రభో అని స్థానిక ప్రజలు ఎంతగా మొత్తుకున్నా అధికారగణం ఎంతమాత్రం పట్టించుకోలేదు. డబ్బు సంపాదన గురించి తప్ప ప్రజల రక్షణ గురించి పట్టించుకోని ‘గెయిల్’ సంస్థ నిర్లక్ష్యం కారణంగా ఇప్పుడు 14 నిండు ప్రాణాలు మాడిపోయాయి. ఒకవైపు రిలయన్స్, మరోవైపు గెయిల్, ఇంకోవైపు ఓఎన్జీసీ.... సంస్థ ఏదైనా కావొచ్చు. ఏ సంస్థకి అయినా డబ్బు సంపాదన మీద వున్న ఆసక్తి కోనసీమ ప్రజల రక్షణ మీద లేకపోవడం దురదృష్టకరం.     కోనసీమలో బ్లో ఔట్లు, గ్యాస్ లీకేజీలు మామూలైపోయాయి. 1993లో వచ్చిన పాశర్లపూడి బ్లో  ఔట్ ప్రపంచంలోనే అతి పెద్ద బ్లో ఔట్‌లలో రెండో స్థానంలో నిలిచింది.  ఎప్పుడైతే కోనసీమలో గ్యాస్ పైపులైన్లు వేశారో అప్పటి నుంచి కోనసీమ ప్రజలు ప్రాణాలు అరచేతుల్లో పట్టుకుని బతుకుతున్నారు. ఎవరెవరో కోట్లకు కోట్లు సంపాదించుకుంటూ వుంటే, కోనసీమ ప్రజలు మాత్రం భయం పడగ నీడలో జీవిస్తున్నారు. కోనసీమ గ్యాస్ పైప్ లైన్ల విషయానికొస్తే, స్థానికుల భయాందోళనలు ఒక కోణమైతే, స్థానిక వనరులను స్థానికులకు ఎంతమాత్రం ఉపయోగపడనివ్వకుండా నిర్దాక్షిణ్యంగా దోచుకువడం మరో కోణం.   ఆంధ్రప్రదేశ్‌లో సహజ వనరులు పుష్కలంగా వున్నాయి. కానీ ఆ వనరులేవీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎంతమాత్రం అందుబాటులో లేవు. ఏ ప్రాంతంలో లభించే వనరులు ఆ ప్రాంతానికే దక్కాలని దేశంలోని అన్ని రాష్ట్రాలూ నినదిస్తున్నాయి, ఉద్యమిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలయితే మా రాష్ట్రంలోని వనరులు మాకేసొంతం అని నిర్మొహమాటంగా ప్రకటించాయి. అయితే ఆంధ్రప్రదేశ్‌ విషయంలో మాత్రం ఇప్పటి వరకు ఆ అవకాశం కనిపించడం లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ కొరతను తీర్చడానికి కోనసీమలోని గ్యాస్ ఎంతో ఉపయోగపడే అవకాశం వుంది. అయితే ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ సమస్య తీర్చడానికి ఇక్కడ ఉత్పత్తి అయ్యే సహజ వాయువును కేటాయించాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా అప్పటి కేంద్ర ప్రభుత్వాలు కనికరించిన పాపాన పోలేదు. ఇక్కడి సహజవాయువుని పైపులైన్ల ద్వారా ఎక్కడికెక్కడికో తరలించుకుని వెలుగులు నింపుకుంటూ, డబ్బు సంపాదించుకుంటూ దర్పం వెలగబెట్టారే తప్ప, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గ్యాసులో వాటా ఇచ్చిన దాఖలాలు లేవు. గత ప్రభుత్వ హయాంలో 2.5 మిలియన్‌ మెట్రిక్‌ స్టాండర్డ్‌ క్యూబిక్‌ మీటర్‌ పర్‌ డే (ఎంఎంఎస్‌సిఎండీ) రీగ్యాసిఫైడ్‌ లిక్విఫైడ్‌ నేచురల్‌ గ్యాస్‌ని సరఫరా చేయడానికి గ్యాస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా అంగీకరించింది అయితే ఇంతవరకు దానికి సంబంధించిన ఫైళ్ళు ముందుకు కదలలేదు. రాష్ట్రం విడిపోవడం,  అటు కేంద్రంలో, ఇటు ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వాలు మారడంతో పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థికంగా వెనుకబాటును ఎదుర్కొంటోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌లో వున్న సహజవనరులను రాష్ట్రం తన అభ్యున్నతి కోసం వినియోగించుకోవాల్సిన అవసరం వుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న గ్యాస్‌ను ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రధానంగా వినియోగించుకునే హక్కును సాధించుకోవాల్సిన అవసరం వుంది. అలాగే కోనసీమలో మరోసారి ‘నగరం’ తరహా దుర్ఘటనలు జరగకుండా ఆపాల్సిన అవసరం కూడా వుంది.
Publish Date: Jun 27, 2014 3:44PM

రాజకీయ నాయకులు త్యాగాలకు సిద్దం కావాలి..!

  ఒకప్పుడు ప్రజలకి ప్రభుత్వంపై అపార నమ్మకం ఉండేది. ప్రభుత్వం తమ ధన, మాన, ప్రాణాలకు పూర్తి భద్రత ఇస్తుందని నమ్మేవారు. కారణం అప్పటి ప్రభుత్వాలను నడిపిన రాజకీయ నేతలు చాలా చిత్తశుద్దితో, నిస్వార్ధంగా పాలన సాగించేవారు. అటువంటి గొప్ప నేతలను స్పూర్తిగా తీసుకొని ప్రస్తుత నేతలు ముందుకు సాగాలి.   ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందు అనేక క్లిష్టమయిన సమస్యలున్నాయి. వాటిని అధిగమించాలంటే, నిబద్దత, దీక్ష దక్షతలతో పాటు ప్రజలలో ప్రభుత్వంపై నమ్మకం ఏర్పడేలా చేయడం కూడా చాలా అవసరం. అప్పుడే వారి నుండి కూడా పూర్తి సహకారం దొరుకుతుంది. రాష్ట్ర ఆర్ధిక స్థితి గురించి నిత్యం ప్రజలకు వివరిస్తూ వారి నుండి సహాయ సహకారాలు అర్ధించడమే కాకుండా, కోట్లకు పడగలెత్తిన నేతలందరూ కూడా స్వయంగా భారీ విరాళాలు ఇచ్చి, తమకు ప్రభుత్వం కల్పిస్తున్న డజన్ల కొద్దీ కార్లతో కూడిన కాన్వాయిలను, బ్లాక్ క్యాట్ కమెండో సెక్యురిటీ వంటి కొన్ని సౌకర్యాలను వదులుకొని, ప్రభుత్వానికి చెల్లించవలసిన ఇంటిపన్నులు, నీటి పన్నులు, కరెంటు బిల్లులు, ఫోన్ బిల్లులు వంటి కోట్లాది రూపాయల బాకీలను వెంటనే చెల్లించి ప్రజలలో నమ్మకం కలిగించవచ్చును. కానీ వారు ఎటువంటి త్యాగాలు చేయకుండా ప్రజాధనంతో విలాసంగా జీవిస్తూ ప్రజలను త్యాగాలు చేయమని, విరాళాలు ఇమ్మని కోరడం సరికాదు.    ప్రజలు తమ నుండి ఏమి ఆశిస్తున్నారో చాలా స్పష్టంగా తెలుసు గనుక అధికారం చేప్పట్టిన నేతలందరూ, నిజాయితీగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయడం మొదలుపెడితే, ప్రజలందరూ కూడా తమ వంతు సహకారం అందించడానికి ఎన్నడూ వెనకాడరు. ప్రజలు, ప్రభుత్వము చేయిచేయి కలిపి నడిస్తే, రాజధాని నిర్మాణం, రాష్ట్ర పునర్నిర్మాణం పెద్ద అసాధ్యమేమీ కాదు.
Publish Date: Jun 27, 2014 1:22PM

అభివృద్ధి వికేంద్రీకరణపై దృష్టి పెట్టాలి..!

  రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మళ్ళీ మొదటి నుండి పునర్నిర్మాణం చేసుకోవలసిన అగత్యం ఏర్పడింది. అందుకు ప్రధాన కారణం ఇంతవరకు రాష్ట్రాన్ని పాలించిన ముఖ్యమంత్రులందరూ కూడా కేవలం హైదరాబాదునే అభివృద్ధి చేసారు తప్ప రాష్ట్రంలో మిగిలిన జిల్లాలను పెద్దగా పట్టించుకోలేదు. వివిధ జిల్లాలకు చెందిన మంత్రులు, యం.యల్.ఏ.లు, యంపీలు కనీసం తమతమ జిల్లాలను నియోజక వర్గాలను అభివృద్ది చేసుకొనేందుకు ఎన్నడూ ప్రయత్నించలేదు. స్వర్గీయ కింజారపు ఎర్రంనాయుడు వంటి ఏ కొద్దిమందో ప్రజాప్రతినిధులు మాత్రం తమ నియోజక వర్గానికి, జిల్లాకు పరిశ్రమలు, మౌలిక వసతులు వంటివి ఏర్పాటు చేసుకొన్నారు. అందువల్ల రాష్ట్ర విభజన తరువాత వైజాగ్, రాజమండ్రి, విజయవాడ మరియు తిరుపతి నాలుగు నగరాలు మాత్రమే ఎంతో కొంత అభివృద్ధి చెందినట్లు కనబడుతున్నాయి తప్ప అభివృద్ధి విషయంలో మిగిలిన ప్రాంతాల గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఈ లోటు రాష్ట్ర విభజన తరువాత మరీ కొట్టవచ్చినట్లు కనడుతుంటే, రాజకీయ నేతలు సైతం తాము చేసిన పొరపాటుకు చింతిస్తున్నారు. అందుకే ఇప్పుడు 13 జిల్లాలకు అభివృద్ధిని సమానంగా వ్యాపింపజేయాలనే ఆలోచన వారిలో కూడా మొదలయింది. మన పొరుగున ఉన్న తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలను చూసినట్లయితే అవి మొదటి నుండి కూడా అభివృద్ధిని వికేంద్రీకరణ చేసినట్లు అర్ధం అవుతుంది. అందుకే వాటికి ఇటువంటి సమస్య ఎదురవలేదు. ఒకవేళ దురదృష్టవశాత్తు ఎదురయినా అవి ఇంత దైన్యస్థితిలో మాత్రం ఉండవని ఖచ్చితంగా చెప్పవచ్చును. తమిళనాడు రాజధాని చెన్నైతో సమానంగా మదురై, సేలం, కోయంబత్తూర్ జిల్లాలు అభివృద్ధి చెందాయి. అవికాక కన్యాకుమారి, తిరుపూర్, వెల్లూరు వంటి జిల్లాలు వివిధ రంగాలలో ఎంతో కొంత అభివృద్ధి సాధించాయి. అందువల్ల అక్కడ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉన్నందున ప్రజలు రాజధాని చెన్నైపై ఆధారపడటం తక్కువ. అదేవిధంగా కర్ణాటకలో బెంగళూరు నగరాన్ని మనదేశ సాఫ్ట్ వేర్ రాజధానిగా అందరూ భావిస్తున్నప్పటికీ, ఆ రాష్ట్రంలో కూడా షిమోగా, బళ్ళారి, కోలార్, దావణగేరే వంటి జిల్లాలకు అభివృద్ధి వ్యాపించి ఉంది. అందువల్ల ఇప్పుడు మన రాష్ట్రం కూడా అదేవిధంగా అభివృద్ధిని అన్ని జిల్లాలకు సమానంగా వ్యాపింపజేయవలసి ఉంది. మన నేతల ప్రయత్నలోపం లేకపోతే కేంద్రప్రభుత్వం కూడా పూర్తి సహకారం అందించేందుకు సిద్దంగా ఉంది గనుక అభివృద్ధి సాధించడం అసాధ్యమేమీ కాదు.
Publish Date: Jun 27, 2014 1:11PM

అన్నదాతలు బాగుంటే అందరూ బాగున్నట్లే

  అన్నదాతలను ప్రభుత్వాలు ఆదుకోవడం అభినందనీయమే. కానీ వారు దశాబ్దాలుగా ఈ అప్పుల చక్రంలో కొట్టుమిట్టాడుతున్నప్పటికీ, వారిని దాని నుండి బయటపడేసేందుకు ఏ ప్రభుత్వమూ సరయిన ప్రణాళిక రచించలేదు. అసలు దేశప్రజలకు అన్నం పెట్టేందుకు అప్పులు చేయవలసిరావడాన్ని ఏ ప్రభుత్వాలు కూడా తమకు అవమానకరంగా భావించకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. రైతులు అప్పులు చేస్తుంటే వాటిని మాఫీ చేయడంకంటే, వారికి ఆ పరిస్తితి రాకుండా వారికి ఇన్ పుట్ సబ్సీడీలు, మార్కెట్ ధరల స్థిరీకరణ, మార్కెట్ యార్డుల ఏర్పాటు, పంటలను నిలవ చేసేందుకు గోదాముల ఏర్పాటు, ఎరువులు, పురుగుల మందులు, వ్యవసాయ పనిముట్లు, నీళ్ళు వంటివి సకాలంలో అందించగలిగితే, ఈ సమస్య నుండి బయటపడవచ్చును.  అందువల్ల ఇప్పటికయినా ప్రభుత్వాలు మేల్కొని వారికి అటువంటి పరిస్థితి ఏర్పడకుండా ఉండేందుకు తగిన చర్యలు చేపట్టినట్లయితే, రైతన్నలే రాష్ట్రాన్ని ఆర్ధిక సమస్యల నుండి గట్టెకించగలరు. 
Publish Date: Jun 26, 2014 8:56PM

నేనుసైతం నా రాష్ట్రం కోసం..

  రాష్ట్ర విభజన విషయంలో గత కేంద్ర ప్రభుత్వం తన స్వంత లాభం కోసం ఏకపక్షంగా వ్యవహరించి, అభివృద్ధిలో వాటాని నిరాకరించి కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇచ్చింది. 1956 తరువాత రాజధానిలో ఏర్పరిచిన, అభివృద్ధి చేసిన అత్యంత విలువైన ఆస్తులు పోయి 1.2 లక్షల కోట్ల అప్పులు, అలాగే దాదాపు 15వేల కోట్ల రూపాయల లోటు బడ్జెట్ సీమాంధ్రకు లభిస్తున్నాయి. అలాగే 20వేల కోట్ల రూపాయల మిగులు ఆదాయం వచ్చే రాజధాని హైదరాబాద్‌ని తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన గత కేంద్ర ప్రభుత్వం ఇన్‌స్టాల్‌మెంట్ లోనుకి కూడా తీరని అప్పుని సీమాంధ్రకి ఇచ్చింది. అయితే జరిగిన దానిని గురించి ఇక ఆలోచించకుండా కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధికి వాస్తవాలు పరిగణనలోకి తీసుకుని అనేక సమస్యలు ఉన్నా ధైర్యంగా ముందడుగు వేస్తూ 'ఆంధ్రప్రదేశ్' రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దుకోవడానికి బాటలు పరుచుకోవాలి. ఈ బాధ్యత మొత్తం కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే మోయలనడం సరికాదు. రాష్ట్రాభివృద్ధిని, తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని కాంక్షించే లక్షలాది ప్రజలు ఈ బాధ్యతలో భాగస్వాములనైప్పుడే మంచి ఫలితాలను సాధించవచ్చును.
Publish Date: Jun 26, 2014 11:59AM