కొత్త రాజధానికి నీళ్ళేవి?

 

 

ప్రస్తుతం హైదరాబాద్ నగరానికి 17.5 టీ.యం.సీ.ల నీళ్ళు ఖర్చవుతున్నట్లు సమాచారం. విజయవాడ, గుంటూరు నగరాలూ రెంటికీ కలిపి ప్రస్తుతం 4.7 టీ.యం.సీ.ల నీళ్ళు ఖర్చవుతున్నాయి. ఇదికాక చుట్టుపక్కల ఊళ్ళను కూడా కలుపుకొంటే మరో రెండు, మూడు టీ.యం.సీ.ల నీళ్ళు ఖర్చవుతున్నాయని తెలుస్తోంది. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంచుమించు 6-7 టీ.యం.సీ.ల నీళ్ళు ఖర్చవుతున్నట్లు స్పష్టమవుతోంది. ఒకవేళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ప్రాంతంలోనే కొత్త రాజధానిని నిర్మిస్తే, ఈ ప్రాంతాలలో జనాభా దాదాపు రెట్టింపు అయ్యే అవకాశం ఉంది గనుక ఆ నిష్పత్తిలోనే నీళ్ళ అవసరం కూడా పెరుగుతుంది. అప్పుడు కనీసం కనీసం 10-12 టీ.యం.సీ.ల నీళ్ళు అవసరం పడవచ్చును. కానీ ఇప్పుడు తెలంగాణా ప్రభుత్వం 4-5 టీ.యం.సీ.ల నీటి విడుదలకే తీవ్ర అభ్యంతరం చెపుతున్నపుడు, కొత్త రాజధానికి అవసరమయిన 10-12 టీ.యం.సీ.ల నీటిని ఎక్కడి నుండి తీసుకువస్తారు? అనే ప్రశ్నకు జవాబు కనుగొనవలసి ఉంది.

 

పులిచింతల ప్రాజెక్టులో 45 టీ.యం.సీ.ల నీళ్ళు నిలువచేసుకొనే అవకాశం ఉన్నప్పటికీ, అవన్నీ పూర్తిగా వ్యవసాయానికే సరిపోతాయి, కనుక వాటిపై ఆధారపడలేము. పోనీ పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఈ సమస్య తీరుతుందనుకొంటే, దానికీ తెలంగాణా, ఒడిష ప్రభుత్వాలు తీవ్ర అభ్యంతరాలు చెపుతున్నాయి. ఒకవేళ వారి అభ్యంతరాలను పట్టించుకోకుండా చాలా వేగంగా పనిచేసినట్లయితే ఈ ప్రాజెక్టు పూర్తవడానికి కనీసం మూడు నుండి ఐదేళ్ళు పట్టవచ్చని నిపుణులు చెపుతున్నారు. అంటే కొత్త రాజధాని నిర్మాణం పూర్తయ్యే వరకు కూడా ఈ ప్రాజక్టు నుండి నీళ్ళు అందవని స్పష్టమవుతోంది.

 

ఇటువంటి పరిస్థితుల్లో కొత్త రాజధానికి నీళ్ళు ఎక్కడి నుండి వస్తాయి? అని ఆలోచిస్తే భూమి గుండ్రంగా ఉన్నట్లు మళ్ళీ కృష్ణానది వైపే చూడవలసి వస్తోంది. అంటే ఒకవేళ విజయవాడ, గుంటూరు మధ్య రాజధాని నిర్మించడం ఖాయం అనుకొంటే, ఈనెల 10న జరిగే కృష్ణా జలసంఘం సమావేశంలో, ఈ సమస్యకు శాశ్విత ప్రాతిపాదికన ఒక పరిష్కారం కనుగొనవలసి ఉంటుంది. అంతే కాకుండా ప్రత్యామ్నాయ మార్గాల కోసం ప్రజలు, నిపుణులు, మేధావుల సలహాలు స్వీకరించడం కూడా మంచిదే.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu