కేంద్ర మంత్రులతో వరుస భేటీలు.. హస్తినలో చంద్రబాబు బిజీబిజీ

ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్షణం తీరిక లేని షెడ్యూల్‌తో బిజీబిజీగా గడుపుతున్నారు.  వరుసగా కేంద్ర మంత్రులతో భేటీ అవుతూ రాష్ట్ర ప్రయోజనాల సాధనకు క‌ృషి చేస్తున్నారు. కృష్ణానదీ తీరంలో వాటర్ స్పోర్ట్స్ శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు విస్తృత అవకాశాలున్నాయని కేంద్రమంత్రికి సీఎం చంద్రబాబు వివరించారు. క్రీడలకు సంబంధించి వివిధ మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి ప్రాజెక్టులపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వివిధ ప్రతిపాదనలను మంత్రిత్వశాఖకు పంపినట్టు కేంద్రమంత్రికి సీఎం తెలిపారు. ఢిల్లీలో బుధవారం (జులై 16) రెండో రోజు పర్యటనలో ఉన్న చంద్రబాబు  కేంద్ర యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయతో భేటీ అయ్యారు. ఏపీలో స్టేడియంల నిర్మాణం, క్రీడా ప్రాంగణాల అభివృద్ధికి రూ. 341 కోట్లు కేటాయింపుల అంశంపై చర్చించారు. అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో బ్యాడ్మింటన్ శిక్షణా కేంద్రం ఏర్పాటుకు సహకారం అందించాలని కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో క్రీడాభివృద్ది కోసం చేపట్టాల్సిన ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాల కల్పనపై కేంద్ర మంత్రితో సీఎం చర్చించారు. అమరావతిలో జాతీయ జల క్రీడల శిక్షణాహబ్ ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కృష్ణానదీ తీరంలో వాటర్ స్పోర్ట్స్ శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు విస్తృత అవకాశాలున్నాయని సీఎం వివరించారు. క్రీడలకు సంబంధించి వివిధ మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి ప్రాజెక్టులపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వివిధ ప్రతిపాదనలను మంత్రిత్వశాఖకు పంపినట్టు కేంద్రమంత్రికి సీఎం తెలిపారు. నాగార్జునా యూనివర్సిటీ, కాకినాడలలో నేషనల్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ల ఏర్పాటుకు ప్రతిపాదించినట్టు వెల్లడించారు. తిరుపతి, రాజమహేంద్రవరం, కాకినాడ, నరసరావుపేటలలో ఖేలో ఇండియా కింద మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులను పూర్తి చేయాలని పేర్కొన్నారు. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం అభివృద్ధికి రూ.27 కోట్లు, గుంటూరు బీఆర్ స్టేడియంలో మల్టీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటుకు రూ.170 కోట్లు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో క్రీడల అభివృద్ధికి రూ.341 కోట్లు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. జిల్లాల్లో ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించేందుకు అదనంగా ఖేలో ఇండియా కేంద్రాలు మంజూరు చేయాలని కోరారు. రాయలసీమలోని తిరుపతిలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా శిక్షణ కేంద్రం ఏర్పాటును పరిశీలించాలని ముఖ్యమంత్రి కోరారు. 2024-29 స్పోర్ట్స్ పాలసీలో భాగంగా ఏపీలో స్పోర్ట్స్ ఎకో సిస్టం అభివృద్దికి చర్యలు చేపట్టినట్టు సీఎం వెల్లడించారు. ఖేలో ఇండియా మార్షల్ ఆర్ట్స్ గేమ్స్ 2025ను ఏపీలో నిర్వహించేందుకు అవకాశం ఇవ్వడంపై కేంద్ర మంత్రి మాండవీయకు ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలియచేశారు. విజయవాడ, విశాఖ తదితర నగరాల్లో అత్యుత్తమ క్రీడా వేదికలపై నిర్వహిస్తామని సీఎం స్పష్టం చేశారు. ఖేలో ఇండియా మార్షల్ ఆర్ట్స్ గేమ్స్ నిర్వహణకు రూ.25 కోట్లు విడుదల చేయాలని కేంద్ర మంత్రిని మన్సుఖ్ మాండవీయను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు.
Publish Date: Jul 16, 2025 4:21PM

పంత్, బుమ్రా ఫిట్‌నెస్‌పై అనుమానాలు.. క్రికెట్ అభిమానుల్లో టెన్షన్

రిషభ్ పంత్, జస్ప్రీత్ బుమ్రా ఇంగ్లాండ్‌తో జరగనున్న నాలుగో టెస్ట్‌కు దూరమవుతారన్న ప్రచారం భారత్ క్రికెట్ అభిమానులను కలకవరపరుస్తోంది. ఇండియా- ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్‌లో మూడు, నాలుగు టెస్ట్ మ్యాచ్‌లకు మధ్యలో దాదాపు పది రోజుల విరామం వచ్చింది. నాలుగో టెస్ట్ మ్యాచ్ మంఛెస్టర్‌లో జులై 23వ తేదీ నుంచి ప్రారంభం కాబోతోంది. ఆ మ్యాచ్‌లో గెలిస్తేనే టీమిండియా రేస్‌లో నిలిచే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లండ్ 2-1తో ఆధిక్యంలో ఉంది. లార్డ్స్‌లో జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్‌లో ఓటమి పాలైన టీమిండియా ప్రస్తుతం నాలుగో టెస్ట్ మ్యాచ్ గెలవడంపై దృష్టి సారించింది. ఇప్పటికే ఈ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లండ్ 2-1తో ఆధిక్యంలో ఉండటంతో నాలుగో మ్యాచ్‌లో గెలిస్తేనే టీమిండియా రేసులో నిలుస్తుంది. అయితే నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా కీలక ఆటగాళ్లు రిషభ్ పంత్, జస్ప్రీత్ బుమ్రా ఆడతారా అనేది అనుమానంగా మారింది. వర్క్‌లోడ్ కారణంగా స్టార్ పేసర్ బుమ్రా నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో ఆడబోయేది లేదని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై మాజీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో బుమ్రా కచ్చితంగా ఆడాలని, లేకపోతే ఆ మ్యాచ్‌లో పరిస్థితి టీమిండియాకు అనుకూలంగా ఉండదని చెబుతున్నారు. దీంతో బుమ్రాను ఆడించే విషయంలో జట్టు మేనేజ్‌మెంట్ పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది. ఇక, మూడో టెస్ట్ మ్యాచ్‌లో గాయపడిన రిషభ్ పంత్ కూడా నాలుగో మ్యాచ్‌కు డౌట్‌గానే కనిపిస్తున్నాడు. పంత్ చేతి వేలికి గాయమైన సంగతి తెలిసిందే. దీంతో మూడో టెస్ట్ మ్యాచ్‌లో పంత్ కీపింగ్ కూడా చేయలేకపోయాడు. ఈ నేపథ్యంలో నాలుగో టెస్ట్ మ్యాచ్‌కు పంత్ అందుబాటులో ఉంటాడా అనేది అనుమానంగా మారింది. అయితే పంత్ వేలికి పెద్ద గాయం కాలేదని, కాస్త విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని సమాచారం. ఒకవేళ వీరిద్దరూ దూరమైతే మాత్రం జట్టుకు మాత్రం తీరని లోటే. కాగా, వరుసగా విఫలమవుతున్న కరుణ్ నాయర్‌ను పక్కన పెట్టి నాలుగో టెస్ట్‌లో సాయి సుదర్శన్‌ను తీసుకునే అవకాశం ఉందంటున్నారు.
Publish Date: Jul 16, 2025 4:08PM

జీవన్‌‌రెడ్డిని ఫాంహౌస్ నుంచి గెంటేసిన కేసీఆర్... అందుకేనా?

గెటవుట్  ఫ్రమ్ మై ఫామ్‌హౌస్.. నా బిడ్డ ఓటమికి కారణం నువ్వే అని మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిపై గులాబీబాస్ ఫైర్ అయ్యారన్న విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందుకే జీవన్‌రెడ్డి ఫామ్ హౌస్ కి చాలా రోజులుగా దూరంగా ఉంటున్నారట. కవిత ఎంపీగా పోటీ చేసినప్పుడు తనకు ఎమ్మెల్యేలు సహకరించలేదని బహిరంగంగా చెప్పిన మాట ఇప్పుడు బీఆర్ఎస్‌లో చర్చనీయాంశంగా మారింది. కవితకు సన్నిహితంగా ఉంటూ, కేసీఆర్‌కి నమ్మిన బంటుగా వ్యవహరించిన జీవన్‌రెడ్డి నిజామాబాద్ జిల్లాలో కవిత ఆధిపత్యాన్ని ఒప్పుకోలేక ఆమె ఓటమికి పావులు కదపారని కవిత వర్గం భావిస్తోందంట.  గులాబీ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబానికి వీర విధేయుడు అని తనకు తాను ప్రచారం చేసుకునే నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మాజీ  ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని కేసీఆర్ తన ఫాంహౌస్ నుంచి  గెట్ అవుట్ అంటూ బయటకు గెంటేసినట్లు  జోరుగా ప్రచారం సాగుతోంది. అ మాజీ ఎమ్మెల్యే అధికార కాంగ్రెస్ పార్టీకి కోవర్టుగా మారి వెలగబెట్టిన వ్యవహారాలపై చర్చించుకుంటూ బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలే కాదు కేసీఆర్ సైతం విస్తు పోయినట్టు సమాచారం. కేసీఆర్ చరిష్మా, కవిత ప్రచారాలతో వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన సదరు నేత అధికారాన్ని విచ్చలవిడిగా దుర్వినియోగం చేశారని ఇప్పటికే అన్ని వర్గాల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది.  తాజాగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. జీవన్ రెడ్డి ఎంపీగా కవిత ఓటమిలోనూ కీలకపాత్ర పోషించారని ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా కేసీఆర్ కన్నెర్ర చేసి ఫాంహౌస్ నుంచి బయటకు వెళ్లగొట్టిన మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఎంపీ ఎన్నికల్లో కవిత ఓటమి పాలు కావడంలో కీలకపాత్ర పోషించినట్లు నాటి నుంచి చర్చ జరుగుతోంది. కవిత ఓటమి తర్వాత ఆయన తన మందిమగధులతో హైదరాబాద్, గోవా, దుబాయ్ లలో దావతులు చేసుకున్నట్లు జీవన్‌రెడ్డి అనుచరులే అంటున్నారంట. కవిత ఓటమి వెనుక జిల్లాకు చెందిన మరికొందరు మాజీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారన్న టాక్ వినిపిస్తోంది. మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అక్రమ వ్యవహారాలు,  అతడిని ఫామ్ హౌస్ నుంచి గెంటేసిన దానిపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది. అధికారంలో ఉన్న సమయంలో అడ్డూ అదుపూ లేకుండా దోచుకుని,  రాజ్యాంగేతరశక్తిగా వ్యవహరిస్తూ విచ్చలవిడిగా భూదందాలు, దౌర్జన్యాలకు పాల్పడిన అతడిని నియోజకవర్గ ప్రజలు గత ఎన్నికల్లో మూడో స్థానానికి పరిమితం చేశారు. ఇప్పటికీ ఆయన నియోజకవర్గంలో తిరగలేని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఓటమి తర్వాత జీవన్‌రెడ్డి ఏదో చుట్టపు చూపుగా, అది కూడా ఎవరికీ తెలియకుండా అర్మూర్ వచ్చిపోతున్నారంట.  అది కూడా తన ఆస్తుల సంరక్షణ కోసమే అంటున్నారు.అధికారంలో ఉన్న సమయంలో జీవన్‌రెడ్డి అడ్డగోలు వ్యవహారాలు నడిపి  ఓటమి తర్వాత పార్టీని గాలికి వదిలేశారంట. కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయని గత కొంతకాలంగా కవిత ఆరోపణలు చేస్తున్నారు. ఆ లిస్టులో మాజీ ఎమ్మెల్యేలు షకీల్, జీవన్‌రెడ్డిలు కూడా ఉన్నారంటున్నారు. సిఎంఆర్ బియ్యం కుంభకోణంలో షకీల్ తప్పించుకుని తిరుగుతుండగా,  మూడో స్థానంలో ఓటమిపాలైన మరో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నియోజకవర్గంలో కనిపించకపోవడంపై  కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు  రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలతో లోపాయికారీ ఒప్పందాలు కుదుర్చుకున్న మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి సొంత పార్టీ వ్యవహరాల్లో తనకేమి సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తున్నాడని పార్టీ శ్రేణులు గుర్రుగా ఉన్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపేందుకు కనీసం ప్రెస్ మీట్ సైతం పెట్టలేదని,  దాంతోపాటు అనేక అంశాలు  కేసీఆర్ దృష్టికి రావడంతో ఆయన జీవన్‌రెడ్డిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారంట.  మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి  నిత్యం కేసీఆర్‌తో ఫామ్ హౌస్ లో ఉంటూనే పార్టీ అంతర్గత విషయాలు వ్యవహారాలన్నింటినీ ఎప్పటికప్పుడు కొందరు సన్నిహితులకు, ఇతర పార్టీలో ఉన్న వారికి వాట్సాప్ ద్వారా చేరవేసినట్లు కేసిఆర్, కేటీఆర్ నోటీస్ చేశారంట. అందుకే కేసీఆర్ అతడిని ఫామ్ హౌస్ నుంచి గెటవుట్ అని పంపించారని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పార్టీ   అంతర్గత వ్యవహారాలన్నీ పూసగుచ్చినట్టు ప్రత్యర్ధి పార్టీ నాయకులకు చేరవేశారని జీవన్‌రెడ్డిపై కార్యకర్తలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  అధికారంలో ఉన్న సమయంలో నియోజవర్గంలో,  హైదరాబాదులో విచ్చలవిడిగా భూ అక్రమణులకు పాల్పడ్డారని,  బెదిరింపులు, దౌర్జన్యాలు చేశారని అలాంటి వ్యక్తిని భవిష్యత్తులో దరిదాపుల్లోకి రానివ్వొద్దని పలువురు కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.
Publish Date: Jul 16, 2025 3:57PM

రాజకీయాలకు దూరమైన అశోక్‌గజపతి.. అభిమానుల భావోద్వేగాలు

ముందు నుంచి తెలుగుదేశం పార్టీతోనే పయనించిన అశోక్‌గజపతిరాజుకు పొలిటికల్ రిటైర్‌మెంట్ తర్వాత సముచిత గౌరవం లభించింది. ఆయన గవర్నర్‌ అయినందుకు సంతోషం.. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారని తెలిసి బాధ.. ఒకేసారి ఆయన అభిమానులలో కలిగిన భావోద్వేగాలివి. అశోక్‌ గజపతిరాజు గోవా గవర్నర్‌గా నియమితులైన విషయం తెలిసి టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. తాను ఏ స్థాయిలో ఉన్నా.. ఎలాంటి అత్యున్నత పదవులు చేపట్టినా విజయనగరం గడ్డను మరువనంటూ ఆయన చేసిన ప్రకటనపై జిల్లా ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీతో అశోక్‌గజపతిరాజుది విడదీయరాని బంధం. 1982 మార్చి 28న నందమూరి తారకరామారావు హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌ వేదికగా తెలుగుదేశం పార్టీని ప్రకటించారు. అప్పుడు ఎన్టీఆర్‌ వెంట ఉన్నది అశోక్‌గజపతిరాజు. ఆయన పార్టీ వ్యవస్థాపక సభ్యుడు కూడా. 43 ఏళ్ల సుదీర్ఘ టీడీపీ ప్రస్థానంలో అశోక్‌ ఎన్నడూ పార్టీ గీత దాటలేదు. ఆయనకు పార్టీ అన్నీ ఇచ్చింది. ఆయన సైతం పార్టీ కోసం చిత్తశుద్ధితో పని చేశారు. వాస్తవానికి సామాజికవర్గపరంగా రాజకీయాలు నడుస్తాయి. విజయనగరం జిల్లాలో ఆ పరిస్థితి రాలేదు. రెండు బలమైన సామాజికవర్గాలను సమన్వయం చేసుకుంటూ ఆయన ముందుకు సాగారు. అశోక్‌ తండ్రి పీవీజీ రాజు ఎంపీగా ఉండేవారు. సోదరుడు ఆనందగజపతిరాజు విశాఖ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా గెలిచారు. అశోక్‌ తొలిసారిగా 1978లో జనతా పార్టీ తరపున అసెంబ్లీకి పోటీ చేసి గెలిచారు. జాతీయ కాంగ్రెస్‌, ఇందిరా కాంగ్రెస్‌, స్వతంత్ర, జనతా పార్టీలు పోటీ చేయగా చతుర్ముఖ పోటీలో అశోక్‌ గజపతిరాజునే విజయం వరించింది. అనంతరం ఎన్టీఆర్‌ పిలుపు మేరకు అశోక్‌ టీడీపీలో చేరారు. 1983 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా విజయనగరం నుంచి పోటీచేసి గెలిచారు. ఆయన సోదరుడు ఆనందగజపతిరాజు విశాఖ జిల్లా భీమిలి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. తొలిసారిగా అశోక్‌ ఎన్టీఆర్‌ కేబినెట్‌లో వాణిజ్య పన్నుల శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. 1985 ఎన్నికల్లో తిరిగి టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించి వాణిజ్యపన్నుల శాఖ మంత్రిగా పనిచేశారు.  1989 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన ఆయన విజయం సాధించారు కానీ రాష్ట్రంలో టీడీపీ ఓడిపోయింది. అయినా ఐదేళ్ల పాటు ప్రతిపక్ష పాత్రలో తన వాణి వినిపించారు. అశోకగజపతి రాజు 1994లో గెలిచిన అశోక్‌ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా, 1995లో ఆర్థిక శాఖ మంత్రిగా కూడా వ్యవహరించారు. 2004లో మాత్రం టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన అశోక్‌పై కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో దిగిన కోలగట్ల వీరభద్రస్వామి విజయం సాధించారు. 2009 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి అదే కోలగట్ల వీరభద్రస్వామిపై గెలుపొందారు అశోక్‌. 2014 ఎన్నికల్లో అధినేత చంద్రబాబు సూచన మేరకు విజయనగరం ఎంపీగా పోటీచేసి గెలిచారు. మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో కీలకమైన పౌరవిమానయానశాఖ మంత్రిగా పదవి చేపట్టారు. 2018లో టీడీపీ.. ఎన్డీఏ నుంచి బయటకు రావడంతో కేంద్ర మంత్రి పదవికి అశోకగజపతి రాజు  రాజీనామా చేశారు. 2019 ఎన్నికల్లో మరోసారి ఎంపీగా పోటీచేసి ఓడిపోయారు. 2024 ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్నారు. కుమార్తె అదితి గజపతిరాజు విజయనగరం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. జిల్లా అభివృద్ధిలో అశోక్‌ పాత్ర ఉంది. ఆయన మంత్రిగా ఉన్నప్పుడే కలెక్టరేట్‌ నిర్మాణం జరిగింది. బొబ్బిలి గ్రోత్‌ సెంటర్‌ ప్రాజెక్టు ఏర్పాటు ఆయన చొరవే. 1995లో ఎన్టీఆర్‌ ప్రజల వద్దకు పాలన కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఆ సమయంలో అశోక్‌ విన్నపంతో రాష్ట్ర మంత్రివర్గంతో పాటు యంత్రాంగం జిల్లాకు వచ్చింది. బహిరంగ ప్రదేశంలోనే శాఖల వారీగా సమస్యలను, విన్నపాలను ప్రజల నుంచి తీసుకున్నారు. విజయనగరంలో సంతకాల వంతెనగా పిలిచే ఎత్తురాళ్ల బ్రిడ్జి అశోక్‌ చొరవతోనే నిర్మితమైంది. నగరంలో ట్రాఫిక్‌ సమస్య పరిష్కారం కోసం 8వేల మంది  సంతకాలతో కేంద్రానికి పంపడంతో ప్రభుత్వం స్పందించింది. విజయనగరంలో ఎత్తైన బ్రిడ్జి నిర్మాణం జరిగింది. అశోక్‌ గజపతిరాజు విజయనగరం మండలం ద్వారపూడిని దత్తత తీసుకున్నారు. ఆ గ్రామం రూపురేకలనే మార్చేశారు. మరో వైపు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు విజయనగరం లోక్‌సభ పరిధిలో అక్షరాస్యతను పెంపొందించేందుకు చిట్టిగురువులు కార్యక్రమాన్ని ప్రారంభించారు. అది విజయ వంతంమైంది. తాను నిర్వర్తించిన పౌర విమానయాన శాఖతో జిల్లాకు ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారు. అదే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం. 2014లో పౌర విమానాయాన శాఖ బాధ్యతలు చేపట్టిన అశోక్‌.. విభజన హామీల్లో భాగంగా ఏపీకి అంతర్జాతీయ విమానాశ్రయం తెచ్చారు. అప్పటి సీఎం చంద్రబాబును ఒప్పించి భోగాపురానికి విమానాశ్రయాన్ని కేటాయించేలా చేశారు. జాతీయ రహదారులు, వ్యవసాయం, తాగునీటి కోసం వేలాది కోట్లు మంజూరు చేయించిన ఘనత ఆయనదే. అందుకే ఆయన రాజకీయ ప్రస్థానం ముగిసిందన్న నిజాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అదే సమయంలో గవర్నర్ గిరీ దక్కడంపై ఆనందంతో భావోద్వేగాలకు గురవుతున్నారు.
Publish Date: Jul 16, 2025 3:18PM

చిరు పిటిషన్.. జీహెచ్ఎంసీకి హైకోర్టు అక్షింతలు!

మెగాస్టార్ పిటిషన్ ను విచారించిన తెలంగాణ హైకోర్టు గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)కి అక్షింతలు వేసింది. ఇంతకీ చిరంజీవి ఎందుకు హైకోర్టుకెక్కారు.. హైకోర్టు జీహెచ్ఎంసీకి అక్షింతలు వేసింది అన్న వివరాలలోకి వెడితే.. చిరంజీవి జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో రెన్నోవేషన్ పనులు చేపట్టారు. అందులో భాగంగా రిటైన్ వాల్ నిర్మించారు.  ఇంటి పునరుద్ధరణలో భాగంగా తాను చేపట్టిన నిర్మాణాలను క్రమబద్ధీకరించాలని చిరంజీవి జిహెచ్ఎంసి కి దరఖాస్తు చేసుకున్నారు.  గత నెల 5న చిరంజీవి జీహెచ్ఎంసీకి తన ఇంటి పునరుద్ధరణలో భాగంగా చేపట్టిన నిర్మాణాలను క్రమబద్ధీకరించాలని దరఖాస్తు చేసుకుంటే.. దానినై జీహెచ్ఎంసీనుంచి ఎటువంటి స్పందనా లేదు. దీంతో చిరంజీవి  జిహెచ్ఎంసి తీరుపై కోర్టుకెక్కారు.  చిరు తరఫున వాదించిన న్యాయవాదు.. చిరంజీవి ఇంటికి సంబంధించి 2002లోనే జిప్లస్2 నిర్మాణానికి అనుమతులు తీసుకున్నామనీ, ఇప్పుడు పునరుద్ధరణ పనులు మాత్రమే చేపట్టామని వివరించారు. ఇందులో భాగంగా చేపట్టిన నిర్మాణాలను పరిశీలంచి క్రమబద్ధికరించాలని జీహెచ్ఎంసీకి దరఖాస్తు చేసినా పట్టించుకోవడం లేదని తెలిపారు.  దీనిపై జీహెచ్ఎంసీ తరఫు న్యాయవాది.. చిరంజీవి దరఖాస్తు అందిందనీ,  చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని  కోర్టుకు తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత న్యాయమూర్తి జిహెచ్ఎంసి కి పిటిషనర్ దరఖాస్తు పైన చట్ట ప్రకారం ఉత్తర్వులు ఇవ్వాలని ఆదేశిస్తూ విచారణను ముగించారు.  ఈ సందర్భంగా జీహెచ్ఎంసీపై కోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. అనుమ‌తులు ఇచ్చేందుకు ఎంత గ‌డువు కావాల‌ని ప్ర‌శ్నించింది. అక్ర‌మ నిర్మాణాల‌కు అధికారులు వత్తాసు ప‌లుకుతున్నార‌న్న ఫిర్యాదులు వ‌స్తున్నాయ‌ని పేర్కొన్న కోర్టు.. స‌క్ర‌మ నిర్మాణాల‌కు  అనుమ‌తులు ఇవ్వ‌లేరా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. 
Publish Date: Jul 16, 2025 12:28PM

ఫైబర్ నెట్ సమూల ప్రక్షాళనపై బాబు దృష్టి.. జీవీరెడ్డే రైట్!

జగన్ హయాంలో  ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ లొ  పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగం, అవినీతి జరిగిందన్న ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. వైసీపీ కార్యకర్తలను పెద్ద సంఖ్యలో ఫైబర్ నెట్ లో  నియమించి వేతనాలు చెల్లించడమే కాకుండా, ఫైబర్ నెట్ ను వైసీపీ కార్యకర్తలు, నాయకులకు రాజకీయ ఆశ్రయ కేంద్రంగా మార్చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఫైబర్ నెట్ ద్వారా జగన్ సొంత మీడియా ఉద్యోగులకు సైతం వేతనాలు వెళ్లాయన్న ఆరోపణలు ఉన్నాయి. మొత్తంగా సైబర్ నెట్ ను అడ్డు పెట్టుకుని రాష్ట్ర ఖజానాకు కోట్ల రూపాయలు గండి కొట్టారని అప్పట్లో తెలుగుదేశం, జనసేనలు ఆరోపించాయి. సరే ఆంధ్రప్రదేశ్ లో 2024 ఎన్నికలలో తెలుగుదేశం కూటమి అద్భుత విజయం సాధించి అధికార పగ్గాలు చేసట్టింది.  కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత సైబర్ నెట్ ప్రక్షాళనే ధ్యేయంగా చంద్రబాబు తెలుగుదేశం అధికార ప్రతినిథి జీవీ రెడ్డిని చైర్మన్ గా నియమించారు. విద్యావంతుడు, న్యాయవాది అయిన జీవీ రెడ్డి ఫైబర్ నెట్ కమిషనర్ గా బాధ్యతలు చేపడుతూనే ప్రక్షాళక చర్యలకు ఉపక్రమించారు.  అయితే.. ఫైబర్ నెట్ లో సీనియర్ ఐఏఎస్ అధికారి జీవీరెడ్డి ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఇష్టారీతిగా వ్యవహరించడంతో  జీవీరెడ్డి నేరుగా సీఎం చంద్రబాబుకు విషయాన్ని వివరిస్తూ ఫిర్యాదు చేశారు. దీనిపై సీఎం ఒకింత సంయమనంతో వ్యవహరించాలని సూచించడంతో సహనం కోల్పోయిన తన పదవికి రాజీనామా చేసి వైదొలిగారు. తెలుగుదేశం పార్టీకి సైతం రాజీనామా చేసి రాజకీయాల నుంచే వైదొలిగారు.   అయితే ఇటీవల సీఎం చంద్రబాబు ఫైబర్ నెట్ పై నిర్వహించిన సమీక్షలో నాడు జీవీరెడ్డి చెప్పిన విషయాలన్నీ అక్షరసత్యాలన్న విషయం వెలుగులోకి వచ్చింది.  గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఫైబర్ నెట్ కేవలం  130 మంది సిబ్బందితో  చాలా ఎఫెక్టివ్ గా పని చేసింది. అదే వైసీపీ హయాంలో ఉద్యోగుల సంఖ్య పది రెట్లకు పైగా పెరిగింది.  ఈ పెరిగిన నియామకాల్లో అత్యధికులు వైసీపీ విధేయులే ఉన్నారన్న విషయం కూడా చంద్రబాబు సమీక్షలో వెలుగు చూసింది.  అంత భారీగా సిబ్బంది పెరిగినా వైసీపీ హయాంలో ఫైబర్ నేట్ సాధించింది శూన్యం. పైగా ఆ శాఖ పని తీరు తిరోగమనం దిశగా సాగింది. అంతకు ముందు వైసీపీ హయాంలో  ఫైబర్ నెట్ యాక్టివ్ కనెక్షన్ల సంఖ్య ఎనిమిది లక్షలు ఉంటే.. జగన్ హయాంలో ఇది నాలుగు లక్షలకు అంటే సగానికి పడిపోయింది.   వాస్తవానికి జీవీరెడ్డి  ఫైబర్ నెట్ చైర్మన్ గా ఉన్న స్వల్పకాలంలో గుర్తించి సరి చేయడానికి ప్రయ త్నించిన విషయం కూడా ఇదే. ఆయన అదనపు సిబ్బందిని, కార్యాలయానికి రాకుండా పేస్కేళ్లలో ఉన్న వారిని తొలగించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినా.. ఫలితం లేకపోయింది. ఇప్పడు ఇదే విషయం చంద్రబాబు సమీక్షలో వెలుగు చూసింది. దీంతో ఆయన ఇప్పుడు ఫైబర్ నెట్ ప్రక్షాళనకు సీరియస్ గా నడుంబిగించారని తెలుస్తోంది. ఫైబర్ నెట్ సమూల ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.  
Publish Date: Jul 16, 2025 11:40AM

మిథున్ రెడ్డిపై లుకౌట్ నోటీసులు

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో వైసీపీ సీనియర్ నాయకుడు, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమైనట్లే కనిపిస్తోంది. ఏ క్షణంలోనైనా ఆయనను అరెస్టు చేసే అవకాశం ఉందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. మద్యం కుంభకోణం కేసులో ఏ4గా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డి ఈ కేసులో తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిలు ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో దాఖలు చేసుకున్న యాంటిసిపేటరీ బెయిలు పిటిషన్ ను మంగళవారం (జులై 15) హైకోర్టు డిస్మిస్ చేసిన సంగతి తెలిసిందే. కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్నందున ముందస్తు బెయిలు మంజూరు చేయలేమని కోర్టు పేర్కొంది. దీంతో ఆయనకు అరెస్టు నుంచి ఎటువంటి రక్షణా లేకుండా పోయింది. ఇప్పటికే సుప్రీం కోర్టు బెయిలు విషయాన్ని హైకోర్టులోనే తేల్చుకోవాలని పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సిట్ అధికారులు మిథున్ రెడ్డిపై లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు. ఆయన విదేశాలకు వెళ్లే అవకాశం లేకుండా ఈ లుక్ ఔట్ నోటీసులు జారీ అయ్యాయి. అలాగే మిథున్ రెడ్డి కదలికలపై కూడా సిట్ నిఘా పెట్టింది.  దీంతో మిథున్ రెడ్డిని ఏ క్షణమైనా అరెస్టు చేసే అవకావాలున్నాయని అంటున్నారు. ఈ కేసులో ఇప్పటికే  రాజ్ కేసిరెడ్డి, మాజీ సీఎం కార్యదర్శి ధనుంజయ్‌రెడ్డి, మాజీ ఓఎస్డీగా కృష్ణమోహన్‌రెడ్డి, భారతి సిమెంట్స్‌ శాశ్వత డైరెక్టర్‌, చార్టర్డ్‌ అకౌంటెంట్‌ బాలాజీ గోవిందప్ప, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి తదితరులను సిట్ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. వీరంతా ఇప్పుడు రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. ఇక ఇప్పుడు మిథున్ రెడ్డిని కూడా అరెస్టు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.  
Publish Date: Jul 16, 2025 10:58AM

నరేంద్ర మోదీ వారసుడు గడ్కరీ!

రాష్ట్రీయ సయం సేవక్ సంఘ్  అధినేత మోహన్ భగవత్..  ఇంచుమించుగా వారం రోజుల కిందట ఇంకా స్పష్టంగా చెప్పాలంటే జూలై 9న  ప్రధానమంత్రి  రిటైర్మెంట్  గురించి, సూచన ప్రాయంగా చేసిన వ్యాఖ్య రాజకీయ సంచలనంగా మారింది. నిజానికి..  ఆర్ఎస్ఎస్ అధినేత, ప్రదాని మోదీని ఉద్దేశించే  రిటైర్మెంట్ ప్రస్తావన తెచ్చారా, లేక అన్యాపదేశంగా ఆ ప్రస్తావన తీసుకొచ్చారా అనే విషయంలో స్పష్టత లేకపోయినా  మోహన్ భగవత్ వ్యాఖ్య రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.   ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు  భగవత్  వ్యాఖ్యలను మోదీని విమర్శించేందుకు చక్కగా ఉపయోగించుకుంటున్నారు. అయితే..  పార్టీ  అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాత్రం ,రాజకీయ నాయకులకు రిటైర్మెంట్ అనేది ఉండదని, ఉండరాదని అంటున్నారు. కాగా..  తాజాగా, కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే బేలూరు గోపాలకృష్ణ ఇంకో ముందడుగు వేశారు. నరేంద్ర మోడీ 75 ఏళ్లు నిండిన తర్వాత పదవీ విరమణ చేస్తే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని ప్రధానమంత్రిగా చేయాలని   ప్రతిపాదించారు.   దేశానికి తదుపరి ప్రధానమంత్రి గడ్కరీ కావాలి.. ఎందుకంటే గడ్కరీ సామాన్యులకు అండగా ఉన్నారు. రహదారులు మౌలిక సదుపాయాల పరంగా దేశాభివృద్ధికి గడ్కరీ గట్టి పునాదులు వేశారు అని గోపాలకృష్ణ చెప్పుకొచ్చారు. అలాగే, ధనిక, పేదల మధ్య పెరుగుతున్న అంతరం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ గడ్కరీ చేసిన ప్రకటనను పరిగణనలోకి తీసుకుంటే..  ఆయనకు దేశాభివృద్ధికి సంబంధించి ఒక భావన ఉందని, అలాంటి వ్యక్తిని ప్రధానమంత్రిని  చేయాలని అన్నారు. 75 ఏళ్లు నిండిన వారు రాజీనామా చేయాల్సి ఉంటుందని మోహన్ భగవత్ సూచించారు.  కాబట్టి గడ్కరీకి సమయం ఆసన్నమైందని తానూ  భావిస్తున్నట్లు గోపాల  అన్నారు. అంతే కాదు..  ఆయన ఇక్కడ కర్ణాటక మాజే ముఖ్యమంత్రి యెడియూరప్పను, 75 సంవత్సరాలు నిండగానే  రాజీనా చేయించిన విషయాన్ని గుర్తు చేసారు. ఆయనకో రూలు మోడీకి ఓ రూలు ఏమిటని కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రశ్నించారు.
Publish Date: Jul 16, 2025 7:58AM

మహిళా లోకానికి ఆదర్శం డ్రైవర్ సంద్యా రాణి!

ముదితల్ నేర్వగరాని విద్య గలదే ముద్దార నేర్పించినన్..  అన్నారు  చిలకమర్తి వారు.  ప్రసన్నయాదవం  పద్యకావ్యంలో... నాలుగు పాదాల చంపకమాల పద్యంలో ఇది నాలుగో పాదం. తెలుగు భాషఫై కొద్దిపాటి మక్కువ, కొంచెంగా ప్రవేశం ఉన్న ఎవరికైనా ఈ పద్య పాదం తరచూ గుర్తుకు వస్తూనే ఉంటుంది. ముఖ్యంగా..  డ్రైవర్   సంధ్యారాణి వంటి వారి కథలు విన్నపుడు చిలకమర్తి వారి పద్యం  చటుక్కున వచ్చి నాలుక పై వాలుతుంది. కొద్దిగా ప్రేమగా నేర్పిస్తే ఆడ లేడీస్ అన్ని విద్యలు ఇట్టే  నేర్చుకుంటారని, ఈ పద్య పాదం అర్థం. సరే. ఆ విషయాన్ని అలా ఉంచి అసలు విషయంలోకి వస్తే..  ఒరిస్సా ప్రభుత్వం తొలిసారిగా  ఒక మహిళను ప్రభుత్వ వాహన డ్రైవర్ గా నియమించింది. ఈ వార్త ఒరిస్సాలోనే కాదు, దేశ వ్యాప్తంగా, ముఖ్యంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.   నిజానికి  కారు డ్రైవింగ్ అన్నది  ముదితలకు రాని విద్య కాదు.  మహిళలు నేర్వని విద్యా కాదు.  హైదరాబాద్ వంటి మహానగారాల్లో వందల మంది.. కాదు  వేల మంది మహిళలు, కార్లు నడుపుతున్నారు. సెల్ఫ్ డ్రైవింగ్ లో పురుషులను దాటి దూసుకు పోతున్నారు. సొంత కార్లే కాదు.. క్యాబులూ నడుపుతున్నారు. నిజానికి.. మహిళలు సొంత కార్లు క్యాబులు కాదు, ఏకంగా యుద్ధ విమానాలనే నడుపుతున్నారు. పహల్గావ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం జరిపిన ఆపరేషన్ సిందూర్ లో భాగంగా మన వైమానిక దళం పాకిస్థాన్ లోని ఉగ్ర స్థావరాలను, నేలమట్టం చేసిన ఆపరేషన్ లో  విమెన్ పైలెట్స్  చేసి చూపిన సాహస విజయం ప్రపంచాన్నే విస్మయ పరిచింది.  ఇలా భారతీ మహిళలు అన్నిరంగాలలోకి చొచ్చుకు పోతున్నపుడు, ఒక మహిళ ప్రభుత్వ కారు డ్రైవర్  కొలువు పొందడంలో విశేషం ఏముందని అనిపించవచ్చును. కానీ  ఉంది... ఎందుకంటే, ఒరిస్సా ప్రభుత్వంలో ప్రప్రధమ డ్రైవర్  సంధ్యారాణి. అంతే కాదు ఆమెకు ఇది వరకూ ప్రైవేట్ స్కూల్ బస్ వంటి భారీ వాహనాలను నడిపిన అనుభవం కూడా ఉంది.  అదొకటి  అయితే, సంధ్యారాణికి మొదటి నుంచి డ్రైవింగ్ పట్ల మక్కువ ఉండేది. విద్యార్థిగా ఉన్నరోజుల్లోనే బైక్ నడపడం నేర్చుకున్నారు. వివాహం తర్వాత కారు కూడా నేర్చుకోవాలని తన భర్తకు తెలిపారు. అలా మెల్లిగా కారును డ్రైవ్ చేయడం నేర్చుకున్నారు. ఆ తర్వాత సంధ్యారాణి భర్త నానో కారు ఆమెకు బహుమతిగా ఇచ్చారు. దీంతో ఆమె, తన స్నేహితులను రాష్ట్రంలోని వివిధ టూరిస్ట్ ప్రాంతాలకు కారులో తీసుకెళ్లేవారు. అలా డ్రైవింగ్ అనుభవంతో పాటు ఆత్మవిశ్వాసం కూడా పెరిగింది. తర్వాత ఆమెకు పెద్ద వాహనాలు నడపాలని కోరిక కలిగింది. భర్త, బంధువుల సహకారంతో రాష్ట్ర రవాణా సంస్థ ఆధ్వర్యంలో కటక్ ఛాటియాలోని హెవీ మోటార్ వెహికిల్ శిక్షణ కేంద్రంలో డ్రైవింగ్ నేర్చుకొని లైసెన్స్ పొందారు. శిక్షణ అనంతరం 2023లో విదేశాలలో ఉద్యోగానికి ఎంపికయ్యారు. కానీ కొన్ని కారణాల వల్ల వెళ్లలేకపోయారు. ఆ తర్వాత వివిధ ప్రైవేటు స్కూల్ బస్సులు నడిపారు. రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లో డ్రైవర్ పోస్ట్లకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. దాని గురించి తెలుసుకున్న సంధ్యారాణి దరఖాస్తు చేసుకున్నారు. 2025 జూన్ లో ఒడిశా వాణిజ్యం, రవాణా, గృహనిర్మాణం, పట్టణాభివృద్ధి ప్రధాన కార్యదర్శి ఉషా పాధీకి అధికారిక డ్రైవర్‌గా సంధ్యారాణి నియమితులయ్యారు.  ఒక విధంగా ఇది మహిళా సాధికారిత దిశగా మరో ముందడుగు అని చెప్పాలి. నిజానికి చిన్ననాటి చిరు కోరికను  స్వయం కృషితో వృత్తిగా మలచుకున్న సంధ్యారాణి మహిళలకే కాదు.. అందరికీ ఆదర్శమే. అలాగే  ఒరిస్సా ఉప ముఖ్యమంత్రి ప్రవతి పరిదా అన్నట్లుగా.. ఆమె నియామకం మహిళా సాధికారత, సాంప్రదాయేతర వృత్తులలో చేర్చడం వైపు బలమైన అడుగు. అలాగే..  ఇది ఆరంభం మాత్రమే .. ముందు ముందు ప్రతి  సంవత్సరం 500మంది మహిళలకు డ్రైవింగ్ లో ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని ఒరిస్సా ప్రభుత్వం నిర్ణయించింది. అలా ఆమె వేసిన ముందడుగు..  మహిళా లోకానికి మరో ఉపాధి మార్గాన్ని చూపింది. అందుకే  డ్రైవర్ రాణి .. సంద్యారాణి  మహిళా లోకానికి ఒక ఆదర్శం.
Publish Date: Jul 16, 2025 7:47AM

మాజీ ప్రధాని పీవీపై చంద్రబాబు ప్రశంసలు

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పై ఏపీ సీఎం చంద్రబాబు ప్రశంసలు కురిపించారు. 'లైఫ్‌ అండ్‌ లెగసీ ఆఫ్‌ పీవీ' అంశంపై సీఎం ఢిల్లీలో ప్రసంగించిన చంద్రబాబు . అనేక పార్టీలను ఒప్పించి పీవీ ఆర్థిక సంస్కరణలు తెచ్చారన్నారు. దేశంలో లైసెన్స్‌ రాజ్‌ విధానానికి స్వస్తి చెప్పారని, పెట్టుబడిదారులు సులభంగా వచ్చేలా చర్యలు తీసుకుని దేశంలో పారిశ్రామిక పురోగతికి బాటలు వేసిన సంస్కరణలకు ఆద్యుడు పీవీ అని కొనియాడారు. పీవీ తీసుకున్న చర్యల వల్లే ఐటీ విప్లవం వచ్చిందన్న ఆయన.. . పీవీ తెచ్చిన సంస్కరణలను వాజ్‌పేయీ కొనసాగించారని గుర్తు చేశారు. వాజ్‌పేయీ హయాంలో హైవేలు, ఎయిర్‌పోర్టులు, పోర్టులు వచ్చాయన్న చంద్రబాబు.. 2014లో మోడీ కూడా అనేక సంస్కరణలు తెచ్చారని చెప్పారు. మోదీ హయాంలో భారత్‌ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతోందని, సబ్‌ కా సాథ్‌.. సబ్‌ కా వికాస్‌.. సబ్‌ కా విశ్వాస్‌పేరుతో ముందుకెళ్తున్నాం.. ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచామన్నారు.  మంగళవారు (జులై 15) ఉదయం ఢిల్లీకి వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు.. రెండు రోజుల పాటు అక్కడే ఉంటారు. పలు వురు కేంద్రమంత్రులతో భేటీ అవుతారు. నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే సారస్వత్‌తో పాటు.. ఢిల్లీ మెట్రో ఎండీతో భేటీ కానున్నారు సీఎం చంద్రబాబు. ఏపీకి సంబంధించిన పలు అంశాలపై చర్చించబోతున్నారు. వీటితోపాటు, ఢిల్లీలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
Publish Date: Jul 16, 2025 7:34AM

టెస్ట్ చరిత్రలో విండీస్ చెత్త రికార్డు.. 27 పరుగులకే ఆలౌట్

టెస్ట్ క్రికెట్ చరిత్రలో వెస్టిండీస్ చెత్త రికార్డ్ నమోదు చేసింది. అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్లో విండీస్ రెండో అత్యల్ప స్కోరు చేస్తే... ఆస్ట్రేలియా టీమ్ సరికొత్త చరిత్ర సృష్టించింది. వెస్టిండీస్‌ను కేవలం 27 పరుగులకే ఆలౌట్ చేసింది. ఇది టెస్ట్‌ల్లో రెండో అత్యల్ప స్కోరు. జమైకాలోని కింగ్‌స్టన్‌ వేదికగా మూడో టెస్ట్‌ లో 175 పరుగులతో కంగారూ జట్టు విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ను 3-0 తేడాతో ఆసీస్ క్లీన్‌ స్వీప్ చేసింది.  కెరీర్‌లో వందో టెస్ట్‌ మ్యాచ్‌ ఆడుతున్న మిచెల్ స్టార్క్ భీకర బౌలింగ్‌తో విండీస్‌ బ్యాట్స్‌మెన్లను బెంబేలెత్తించాడు. స్టార్క్ 6 వికెట్లు తీయగా.. బొలాండ్ 3 (హ్యాట్రిక్), హేజిల్‌వుడ్ ఒక వికెట్ తీశారు. ఆసీస్ బౌలర్ల  దెబ్బకు ఏకంగా ఏడుగురు వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ డకౌట్ అయ్యారు. గ్రేవిస్ అత్యధికంగా 11 పరుగులు చేయగా.. మైకేల్ లూయిస్, అల్జారీ జోసఫ్ తలో 4 పరుగులు చేశారు.  స్పార్క్ తన మొదటి ఓవర్‌లో మూడు వికెట్లు తీశాడు. మొత్తం  15 బంతుల వ్యవధిలో 5 వికెట్లు పడగొట్టి విండీస్ పతనాన్ని శాసించాడు. ఆ క్రమంలో టెస్ట్ క్రికెట్ చరిత్రలో అతి తక్కువ బంతుల్లో 5 వికెట్టు సాధించిన బౌలర్‌గా స్టార్క్ రికార్డు సృష్టించాడు. రెండో ఇన్నింగ్స్‌లో కంగారూలను 121 పరుగులకు ఆలౌట్ చేసి సంబరపడిన విండీస్‌కు ఆ ఆనందం ఎంతో సేపు నిలబడలేదు. విండీస్ బ్యాటర్లలో ఏడుగురు డకౌట్ అయ్యారు. టెస్ట్ చరిత్రలో 1955లో ఇంగ్లాండ్‌పై 26 పరుగులకే అలౌట్ అయిన న్యూజిలాండ్ అత్యల్ప స్కోర్లలో మొదటి స్థానంలో కొనసాగుతోంది. మళ్లీ ఇంత కాలానికి విండీస్ ఆ చెత్త రికార్డుకు చేరువై రెండో అతి చెత్త ఇన్నింగ్ ఆడింది. మన భారత్ 2020లో ఆస్ట్రేలియాపై 36 పరుగులకు ఆలౌట్ అయి ఆ చెత్త రికార్డుల్లో 8వ స్థానంలో ఉంది.
Publish Date: Jul 16, 2025 7:16AM

1900 తర్వాత మళ్లీ ఒలింపిక్స్‌లో క్రికెట్ మ్యాచ్‌లు

లాస్‌ ఏంజెలెస్ వేదికగా 2028లో జరగనున్న ఒలింపిక్స్‌లో క్రికెట్‌కు కూడా చోటు దక్కింది. చివరిసారిగా 1900 ఒలింపిక్స్‌లో మాత్రమే క్రికెట్ ఆడారు. ఈ క్రీడా సంరంభంలో భాగంగా 2028 జులై 12 నుంచి క్రికెట్ మ్యాచులు మొదలు అవుతాయి. గ్రూప్ దశలో ప్రతి టీమ్ రెండు టీ20 మ్యాచులు ఆడనుంది. జులై 20, 29 తేదీల్లో మెడల్ మ్యాచులను ఏర్పాటు చేశారు. జులై 14, 21 తేదీల్లో మాత్రం క్రీడాకారులకు విశ్రాంతిని ఇచ్చేందుకు ఎలాంటి మ్యాచ్‌లు నిర్వహించరు. రోజుకు రెండు గ్రూప్ దశ మ్యాచులు జరిగేలా షెడ్యూల్‌ను విడుదల చేశారు. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 9.00 గంటలకు మొదటి మ్యాచ్, సాయంత్రం 6.30 గంటలకు రెండో మ్యాచ్ నిర్వహిస్తారు. కాలిఫోర్నియాలోని పోమోనా నగరంలోగల ఫెయిర్‌గ్రౌండ్స్ స్టేడియంలో ఈ మ్యాచ్ లు జరగనున్నాయి . అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం, పురుషులు, మహిళల విభాగాల్లో ఆరు టీమ్స్ చొప్పున తలపడనున్నాయి. ఒక్కో జట్టు కోసం 15 మంది సభ్యుల స్క్వాడ్‌ను ఎంపిక చేస్తారు. క్రికెట్‌కు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆదరణ దృష్ట్యా నిర్వాహకులు ఈ క్రీడను ఒలింపిక్స్‌లో చేర్చారు. అమెరికాలో కూడా క్రికెట్‌కు క్రమంగా ఆదరణ పెరుగుతోంది. గత ఏడాది జరిగిన టీ20 వరల్డ్ కప్ టోర్నీకి యూఎస్ఏ, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యమిచ్చాయి. అప్పట్లో మూడు వేదికల్లో మ్యాచులను నిర్వహించారు. ఇక 2028లో జరగనున్న ఒలింపిక్స్‌లో క్రికెట్‌తో పాటు ఫ్లాగ్ ఫుట్ బాల్, బేస్‌బాల్, లక్రాస్‌, స్క్వాష్ క్రీడలకు చోటు దక్కింది.  ప్యారిస్ వేదికగా 1900లో జరిగిన ఒలింపిక్స్‌లో చివరిసారిగా క్రికెట్ మ్యాచులు జరిగాయి. అప్పట్లో ఫ్రాన్స్, గ్రేట్ బ్రిటన్‌లు మాత్రమే తలపడగా యూకేను విజయం వరించింది. టెస్ట్, వన్డేల్లాంటి దీర్ఘ ఫార్మాట్‌ల నిర్వహణకు తగినంత సమయం లేకపోవడమే ఒలింపిక్స్‌లో క్రికెట్‌ స్థానం కోల్పోవడానికి ఒక కారణమని విశ్లేషకులు చెబుతారు. స్టేడియంలు, ఇతర మౌలిక వసతుల లేమి కూడా ఈ పరిస్థితికి కారణం. ఇక క్రికెట్ కేవలం దక్షిణాసియా దేశాలకే పరిమితమైన క్రీడ అన్న భావన కూడా ప్రతిబంధకంగా మారింది. ఒలింపిక్స్ కమిటీలో క్రికెట్ ఆడే దేశాలకు మొదట్లో ప్రాతినిధ్యం తక్కువగా ఉండటం కూడా ఓ కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఒలింపిక్స్‌లో నిత్యం సత్తా చాటే అమెరికా, చైనా ల్లాంటి దేశాల్లో క్రికెట్‌కు ఆదరణ తక్కువే. అయితే, టీ20 ఫార్మాట్ రాకతో పరిస్థితి మారింది.  ఈ నేపథ్యంలో 2028లో జరగనున్న ఒలింపిక్స్‌లో క్రికెట్‌కు కూడా చోటు కల్పిస్తూ ఒలింపిక్స్ కమిటీ ముంబైలో జరిగిన 141వ సమావేశాల్లో నిర్ణయించింది.
Publish Date: Jul 16, 2025 7:07AM

కేరళ నర్స్ ప్రియకు ఉరి నుంచి ఊరట!

ఆశలన్నీ ఆవిరై పోయిన సందర్భంలో.. కేరళ నర్స్‌ నిమిష ప్రియకు ఊరట లభిచింది. మరో కొన్ని గంటల్లో ఉరి కంబం ఎక్కవలసిన ఆమెకు, యెమెన్‌ ప్రభుత్వం ఉరి శిక్షను వాయిదా వేసి, మరో ఆశకు ప్రాణం పోసింది.  నిజానికి మరి కొద్ది గంటల్లో అంటే బుధవారం (జులై 16) అమలు కావాల్సిన ఆమె ఉరిశిక్షను యెమెన్‌ ప్రభుత్వం వాయిదా వేసింది. ఈ మేరకు విదేశాంగ శాఖ ఓ ప్రకటన చేసింది. ఆమె మరణశిక్షను తప్పించడానికి యెమెన్‌ జైలు అధికారులతోపాటు ప్రాసిక్యూషన్‌ కార్యాలయంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపింది.  ఈ కేసులో బాధితురాలికి సాయం చేసేందుకు భారత్ ప్రభుత్వం మొదటి నుంచి తనవంతు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. నిమిష, బాధిత కుటుంబాల మధ్య పరస్పర అంగీకారం వచ్చేలా చేసి  కేసును పరిష్కరించుకునేలా మరింత సమయం ఇవ్వాలని కోరాం. ఈ విషయంలో స్థానిక జైలు అధికారులు, ప్రాసిక్యూటర్‌ ఆఫీసుతో నిరంతరం జరిపిన సంప్రదింపులు ఫలించాయి. మరణశిక్ష అమలును వాయిదా వేసేందుకు యెమెన్‌ అధికారులు అంగీకారం తెలిపారని విదేశాంగ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఇక ఈ కేసులో బ్లడ్ మనీ తీసుకునేలా బాధిత కుటుంబాన్ని ఒప్పించేందుకు మత గురువు కాంతాపురం ఏపీ అబూబకర్‌ ముస్లియార్‌ సంప్రదింపులు జరపుతున్నారు. ఆ చర్చలు కూడా సానుకూలంగా జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. బాధిత కుటుంబానికి ఒక మిలియన్‌ డాలర్ల అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.8.6కోట్ల  క్షమాధనాన్ని ఇచ్చేందుకు నిమిష ప్రియ కుటుంబం సిద్దంగా ఉంది. ఇందుకు బాధిత కుటుంబం అంగీకరిస్తే నిమిష ప్రియకు మరణశిక్ష తప్పే అవకాశం ఉంది.   అసలింతకీ ఏమిటీ కేసు అంటే.. కేరళ పాలక్కాడ్‌ జిల్లాకు చెందిన నిమిష నర్సు కోర్సు పూర్తి చేసిన తర్వాత 2008లో యెమెన్‌ వెళ్లి అక్కడే ఉద్యోగంలో చేరారు. 2011లో థామస్‌ను వివాహం చేసుకున్న ఆమె అక్కడే ఓ క్లినిక్‌ తెరవాలనుకొన్నారు.ఆ దేశ నిబంధనల ప్రకారం స్థానిక తలాల్‌ అదిబ్‌ మెహది అనే వ్యక్తిని నిమిష, థామస్‌ జంట తమ వ్యాపార భాగస్వామిగా చేసుకుంది. వారు అల్‌అమన్‌ మెడికల్‌ కౌన్సిల్‌ సెంటర్‌ను ప్రారంభించారు. కొన్నేళ్ల తర్వాత ఆమె భర్త, కుమార్తె కేరళకు వచ్చేశారు. నిమిష యెమెన్‌లోనే ఉంటూ సెంటర్‌ను కొనసాగించారు. ఈ సమయంలో మెహది- నిమిష ప్రియను తన భార్యగా పేర్కొంటూ వేధింపులకు గురిచేస్తూ ఆమె పాస్‌పోర్టు లాక్కొన్నాడు. అతడిపై 2016లో ప్రియ పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోకపోయేసరికి, 2017లో మెహదికి మత్తు మందు ఇచ్చి అతడి వద్ద ఉన్న తన పాస్‌పోర్టును స్వాధీనం చేసుకోవాలని ఆమె భావించింది. మోతాదు ఎక్కువవడంతో అతడు చనిపోయాడు. ఆ తర్వాత మృతదేహాన్ని ఓ వాటర్‌ ట్యాంక్‌లో పడేసింది. అక్కడి నుంచి సౌదీకి పారిపోతుండగా ఆమెను అరెస్టు చేశారు. ఈ కేసులో 2020లో ఆమె ఉరిశిక్ష విధించగా, 2023లో చివరి అప్పీల్‌ను యెమెన్‌ ప్రభుత్వం తిరస్కరించింది. ప్రస్తుతం నిమిష ప్రియ యెమెన్‌ రాజధానిలోని సనా జైలులో ఉంది.
Publish Date: Jul 16, 2025 6:46AM

మూడు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు.. సమరానికి సిద్దమవుతున్న పార్టీలు

తెలంగాణలో పంచాయతీ పాలకవర్గాల గడువు ముగిసి సంవత్సరన్నరపైగా అవుతుండటం, పరిషత్‌ల గడువు ముగిసి సంవత్సరం పూర్తవుతుండటంతో ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారనే సందేహాలు అందరిలో నెలకొన్నాయి. ప్రస్తుతం స్థానిక సంస్థలు ప్రత్యేక అధికారుల పాలనలో ఉండి, నిధులు రాక అభివృద్ధి కుంటుపడింది. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కేబినెట్‌ తీర్మానం చేయడంతో అందరి దృష్టి స్థానిక సంస్థలపై పడింది. కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల సమయంలోనే బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చింది. అందులో భాగంగానే రిజర్వేషన్లు 50 శాతానికి లోబడి ఉండాలనే కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు ఆలస్యమవుతూ వచ్చింది. అయితే తమిళనాడు వంటి రాష్ర్టాల్లో ప్రత్యేక ఆర్డినెన్స్‌ ద్వారా 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఇస్తుండటంతో ఇప్పుడు అదే పద్ధతిని రాష్ట్ర ప్రభుత్వం అవలంబిచాలని భావిస్తోంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన విధివిధానాలు ఖరారవుతున్నట్లు తెలుస్తుండగా, రేపో.. మాపో ఆర్డినెన్స్‌ వచ్చే అవకాశం ఉంది. హైకోర్టు ఇప్పటికే ఎన్నికలను పూర్తి చేయడానికి మూడు నెలల గడువు ఇవ్వగా.. ఆలోపే పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. ప్రస్తుతానికి పంచాయతీలకంటే ముందు పరిషత్‌ ఎన్నికలే నిర్వహిస్తారనే సంకేతాలు వెలువడుతున్నాయి. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. ఇప్పటికే ఓటర్‌ జాబితా సిద్ధం కాగా.. కావాల్సిన బ్యాలెట్‌ బాక్సులు, సామగ్రి, ప్రింటింగ్‌ కూడా అధికారులు పూర్తిచేసి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నారు. గడిచిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అప్పుడు బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉండగా.. మెజారిటీ స్థానాలను ఆ పార్టీనే దక్కించుకుంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఆ పార్టీకి సింహభాగం స్థానాలు దక్కాయి. వేరే పార్టీల్లో గెలిచిన వారు సైతం అప్పట్లో బీఆర్‌ఎస్‌లో చేరారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కొంతమంది బీఆర్‌ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరినప్పటికీ..  ఇంకా బీఆర్‌ఎస్‌లో తాజా మాజీ ప్రజాప్రతినిధుల శాతం అధికంగానే ఉంది. గ్రామాల్లో ఇంకా ఆ పార్టీ కేడర్‌ బలంగా ఉండగా, అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో గెలిచిన ఊపుతో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ కేడర్‌ను బలోపేతం చేసుకోవడం వంటి పరిణామాలతో పోటీ హోరాహోరీగా ఉండనుంది. బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చామనే అంశంతో కాంగ్రెస్‌ ముందుకు వెళ్లనుంది. గ్రామాలు, పట్టణాల్లో ఇటీవలి కాలంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలను ఎక్కువ సంఖ్యలో నిర్మించడం, సన్న బియ్యం పథకం వంటి అంశాలు తమకు కలిసి వస్తాయని ఆ పార్టీ భావిస్తోంది. అలాగే బీఆర్‌ఎస్‌ తమకున్న కేడర్‌, గతంలో చేసిన పనులు, ప్రభుత్వ వ్యతిరేకత కలిసి వస్తుందని అభిప్రాయపడుతోంది. ఇప్పటికే ఆయా పార్టీల ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు తరచూ పార్టీ సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు. బీసీ రిజర్వేషన్లు అమలయ్యే పక్షంలో తమ వ్యూహాలను మార్చుకునే అవకాశం ఉంది. ఇక గతంలో ఎన్నడూ లేనంతగా బీజేపీ కూడా స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి పెట్టింది. ప్రత్యామ్నాయ పార్టీగా ఎదగడానికి స్థానిక సంస్థల ఎన్నికలు గేట్‌వేగా ఉంటాయని ఆ పార్టీ నాయకత్వం అనుకుంటోంది. పార్లమెంట్‌ ఎన్నికల్లో వచ్చిన ఓటు బ్యాంకును సద్వినియోగం చేసుకుని.. సరైన అభ్యర్థులను నిలిపితే ఫలితం ఉంటుందని నాయకులు అభిప్రాయపడుతున్నారు. అయితే పంచాయతీలను పార్టీ గుర్తుపై కాకుండా ఇతర గుర్తులపై గెలుచుకోవాల్సి ఉంటుంది. పరిషత్‌ ఎన్నికల్లో మాత్రం పార్టీ గుర్తులు ఉంటాయి. కాబట్టి కాంగ్రెస్‌ పార్టీ ముందుగా పరిషత్‌ ఎన్నికలను నిర్వహించి, ప్రభుత్వ పని తీరుకు గెలుపు అని చెప్పాలని భావిస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్‌ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని భావిస్తుండగా.. గతంలో రిజర్వేషన్లు తక్కువగా ఉన్న సమయంలోనూ బీసీలు జనరల్‌ స్థానాల్లో ఎక్కువ సీట్లు గెలుచుకున్నారు. ఒకవేళ బీసీలకు చట్టబద్ధంగా రిజర్వేషన్లు ఇవ్వలేని పక్షంలో పార్టీ పరంగా 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కాంగ్రెస్‌ గతంలో భావించింది. దానిపై కొంత విమర్శలు రావడంతో ఎలాగైనా చట్టబద్ధత కల్పించాలని భావిస్తోంది. ఈ విషయమై ఇప్పటికే కేబినెట్‌ తీర్మానం చేసింది. దాంతో ఆశావహులు అప్పుడే పల్లెల్లో ముమ్మరంగా ప్రచారం మొదలుపెట్టేస్తున్నారు. మరి ఈ ట్రయాంగిల్ ఫైట్లో అధికార పక్షం విపక్షాలకు ఎలా చెక్ పెడుతుందో చూడాలి.
Publish Date: Jul 15, 2025 6:05PM