తెరాస పట్ల వైకాపా వైఖరి మారుతోందా?
posted on Feb 3, 2015 10:56AM
.jpg)
ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణా ప్రభుత్వానికి, తెరాసను వెనకేసుకు వచ్చే సాక్షి మీడియాలో ఈ మధ్య వాటికి వ్యతిరేకంగా వార్తలు, విశ్లేషణలు రావడం చూస్తుంటేతెరాస పట్ల వైకపా వైఖరిలో క్రమంగా మార్పు వస్తోందా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. రాష్ట్ర విభజనకు ముందు ఆంద్ర ప్రయోజనాలు కాపాడుకోవాలి అంటూ గొంతు చించుకొన్న వైకాపా, ఎన్నికల తరువాత తెలంగాణా ప్రభుత్వం ఆంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్ని విమర్శలు చేస్తున్నా, యుద్ధాలు చేస్తున్నా ఏనాడూ నోరువిప్పిన దాఖలాలు లేవు. పోలవరం, ఫాస్ట్ పధకం, నీళ్ళు, విద్యుత్ వంటి అనేక అంశాల మీద రెండు ప్రభుత్వాల మధ్యన యుద్ధం జరుగుతుంటే ఏనాడు కూడా వైకపా ఆంద్ర ప్రయోజనాల గురించి మాట్లాడలేదు. కానీ ఆంద్ర ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి చంద్రబాబుపై యుద్ధం ప్రకటించింది కూడా.
కానీ ఈమధ్యన సాక్షి మీడియా ద్వారా తెరాసను, తెలంగాణా ప్రభుత్వాన్ని విమర్శిస్తోంది. కేసీఆర్ సచివాలయాన్ని ఎర్రగడ్డకు తరలించాలనే నిర్ణయంపై సాక్షి మీడియాలో ఒక చర్చ నిర్వహించడం ద్వారా కేసీఆర్ పై బాణాలు సందించింది. కాంగ్రెస్ నేతలు, ప్రతిపక్షాలు, ఎర్రగడ్డ ఆసుపత్రి ఉద్యోగులు అందరూ కేసీఆర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ చేస్తున్న ప్రకటనలు, నిరసన ర్యాలీల గురించి వార్తలు ప్రచురిస్తోంది. ఇదంతా చూస్తుంటే వైకాపా తెరాసకు దూరం జరుగుతున్నట్లు కనిపిస్తోంది. కానీ బహుశః జి.హెచ్.యం.సి. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే పనిగట్టుకొని కేసీఆర్ మరియు ఆయన ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తోందేమో? ఆవిధంగా హైదరాబాద్ జంట నగరాలలో స్థిరపడిన ఆంద్రప్రజలను ఆకట్టుకోవచ్చని భావిస్తోందేమో? అని రాజకీయ విశ్లేషకులు అనుమానిస్తున్నారు.