అమరావతిలో వైసీపీ దాదాగిరీ.. రైతు కాలిపై నుంచి దూసుకెళ్లిన ఎంపీ సురేష్ కారు

అమరావతి నుంచి ఏపీ రాజదాని తరలింపునకు వ్యతిరేకంగా మహిళా జేఏసీ నేతలు చేపట్టిన బస్సు యాత్ర ఉద్రిక్తలకు దారి తీసింది. లేమల్లె 14వ నంబరు మైలురాయి దాటాక బస్సు యాత్రను అడ్డుకున్న వైసీపీ నేతలు కారం ప్యాకెట్లు విసరడంతో మహిళా నేతలు భయభ్రాంతులయ్యారు. అదే సమయంలో అమరావతిలోని అమరలింగేశ్వర స్వామి దర్శనానికి వెళ్లి తిరిగి వెళుతున్న బాపట్ల ఎంపీ నందిగం సురేష్ కారును మహిళలు అడ్డుకున్నారు. కాసేపు వాగ్వాదం తర్వాత రైతులు ఎంతకీ అడ్డు తప్పుకోకపోవవడంతో సురేష్ డ్రైవర్ కారును ముందుకు పోనిచ్చాడు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన హనుమంతు అనే రైతు కాలు మీదుగా కారు దూసుకెళ్లడంతో అతను గాయాలపాలయ్యాడు. పక్కనున్న రైతులు వెంటనే అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లారు.

బాపట్ల ఎంపీ నందిగం సురేష్ కారు రైతు కాలి మీద నుంచి దూసుకెళ్లిన ఘటనపై అమరావతి రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే ఎంపీ సురేష్ ను వివిధ ప్రాంతాల‌్లో అడ్డుకున్నందుకు వందకు పైగా రైతులు, మహిళలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. వీరిలో చాలా మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కూడా కేసులు నమోదయ్యాయి.. అక్రమంగా నమోదు చేసిన ఈ కేసులను ఎత్తివేయాలంటూ ఇప్పటికే టీడీపీ సహా విపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. తాజాగా అమరావతిలో ఎంపీ కారు రైతు కాలిపై నుంచి దూసుకెళ్లిన ఘటనలో పోలీసులు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.