ట్రింగ్ ట్రింగ్ లోనే జీవితం (ఇంటర్ నేషనల్ టెలికాం డే)


ఇన్నాళ్ళు లేవగానే దేముడి ఫోటో చూసి నిద్ర లేచేవాళ్ళు. కాని కాలం మారటంతో ఇప్పుడు చాలామంది మొబైల్ ని చూస్తూ నిద్ర లేస్తున్నారు. కళ్ళు విప్పగానే సెల్ ఫోన్ చూడకపోతే ప్రపంచం తలకిందులయిపోతుందా అన్నట్టు టెన్షన్ పడతారు చాలా మంది.

 

టెలిఫోన్ ను కనిపెట్టిన గ్రహంబెల్ కూడా ఊహించి ఉండడు, తను కనిపెట్టిన పరికరం ప్రపంచాన్నే శాసిస్తుందని, అది లేకపోతే మనిషికి ఊపిరి అందదని, చిన్న పిల్లల దగ్గర నుంచి మంచం దిగలేని ముసలివాళ్ళని సైతం తన బానిసలను చేసుకుంటుందని.

 

ఒకప్పుడు ఈ ఫోన్ ని కనిపెట్టని రోజుల్లో దూరంగా వేరే ఊరిలో ఉన్న పిల్లల క్షేమ సమాచారం కనుక్కోవాలంటే ఉత్తరం రాసి అది వాళ్ళకి చేరి మల్లి వాళ్ళు రిప్లై రాసి అది మనకి అందేదాకా అసలు విషయాలు తెలిసేవి కావు. టెలిఫోన్ వచ్చాకా అది ఒకరింట్లో ఉన్నా ఆ ఒక్క నెంబర్ ఊరందరి నెంబర్ అయ్యేది. కొన్నాళ్ళకి ల్యాండ్ లైన్ కూడా ప్రతి ఇంట్లో నెససరి ఐటెంగా మారిపోయింది. తర్వాత కాలంలో వచ్చిన సెల్ ఫోన్స్ కొత్తల్లో ఒక స్టేటస్ సింబల్ గా ఉండేవి. ఎవరి దగ్గరైనా సెల్ ఫోన్ ఉందంటే వాళ్ళని గొప్పగా చూసేవాళ్ళు జనాలు. కాని రోజులు గడిచిన కొద్ది సెల్ ఫోన్ ని  కూడా బిచ్చగాడి దగ్గరనుంచి బిజినెస్ మాగ్నెట్ వరకు వాడటం మొదలుపెట్టారు.

 

కాని ఈ సెల్ ఫోన్ మోజులో పడి మన అభివృద్దిని, ఆయుష్యుని మనమే చేతులారా తుంచేసుకుంటున్నాం. సెల్ ఫోన్ చేతిలో ఉంటే ప్రమాదాన్ని కూడా లెక్క చేయకుండా సేల్ఫీల పిచ్చితో ప్రాణాలని వదిలేస్తున్నాం. వాటిలో పాటలు పెట్టుకుని రోడ్డు మీద వెళ్తూ ప్రమాదాలని ఆహ్వానిస్తున్నాం. ఉపయోగించాల్సిన వాటిని సరైన తీరులో ఉపయోగించకుండా దుర్వినియోగం చేస్తున్నాం. శాస్త్రవిజ్ఞానం మనుషుల పురోగతి కోసం కనిపెట్టిన పరికరాలను అభివృద్ధి కోసం ఎలా ఉపయోగించుకోవాలో  తెలియని అయోమయ పరిస్థితిలో వాటిని దుర్వినియోగం చేసుకుంటున్నాం.

 

అత్యవసర సమాచారాన్ని చిటికెలో కొన్ని  వేల మైళ్ళ దూరంలో ఉన్న వారికి సైతం అందించగల టెలి కమ్యూనికేషన్ వ్యవస్థ ఎంతో మందికి ఎన్నో విధాలుగా మేలు చేస్తోంది. బ్యాంకుకి వెళ్ళకుండానే అనేకమైన  డబ్బు లావాదేవీలు క్షణంలో అయిపోతున్నాయి. రిజర్వేషన్  కౌంటర్ కి వెళ్లి గంటలు గంటలు నిలబడక ముందే చిటికెలో ట్రైన్ టికెట్ మన చేతిలో ఉంటోంది. ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా ఇంట్లోనే కూర్చుని తెలుసుకునేంత వీలు కల్పించింది ఈ రంగం. దేశంలో ఎంతో మందికి ఉద్యోగాలు కల్పించటమే కాకుండా దూరతీరాల్లో ఉన్న వాళ్ళని కూడా దగ్గర చేస్తున్న ఈ వ్యవస్థ పురోభివృద్ధి సాదించి మన పురోగతికి చేయూతనివ్వాలని కోరుకుందాం.

- కళ్యాణి