భిన్నత్వంలో ఏకత్వమే దాంపత్యం

Publish Date:Apr 7, 2015

 

అర్థం చేసుకోరూ... అంటూ భార్యాభర్తలకి ఒకరి మీద ఒకరికి బోల్డన్ని కంప్లయింట్స్. ఎందుకలా? తనతో కలసి ఒకే ఇంట్లో ఉండే వ్యక్తిని ఆమాత్రం అర్థం చేసుకోలేరా? అంత కష్టమా అంటే, అంత కష్టమేం కాదు.. చిన్న సీక్రెట్ తెలిస్తే అంటున్నారు నిపుణులు. పొరపాటు ఎక్క డ జరుగుతోందీ అంటే, భర్త తన ఆలోచనల్లోంచి భార్యని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే, భార్య తన ఆలోచనలను బట్టి భర్తని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. అదిగో అక్కడ మొదలవుతుంది మూడో ప్రపంచ యుద్ధం! కన్ఫ్యూజన్‌గా వుందా? సింపుల్‌గా చెప్తా.

 

మామూలుగా మనం ఒక సందర్భంలో ఎలా ఆలోచిస్తాం... ఎలా ప్రతిస్పందిస్తాం అన్నదాన్నిబట్టి ఎదుటి వ్యక్తి ఆలోచనలని ఊహిస్తాం. వాళ్ళ ప్రతిస్పందనని అంచనా వేస్తాం  కదా! అయితే భార్యాభర్తల దగ్గరకి వచ్చేసరికి ఇదే ఇబ్బందులు తెస్తుంది. మగవారి ఆలోచనా విధానానికి, ఒక విషయంపై వారు ప్రతిస్పందించే విధానం ఆడవారి ఆలోచనా విధానంతో ఎక్కడా పోలిక వుండదు. ఇద్దరూ నిజంగానే రెండు భిన్న ధ్రువాలు. ముందు ఈ విషయాన్ని ఒప్పుకుని తీరాలి. ‘‘నేనంత ప్రేమగా తన విషయంలో అన్నీ పట్టించుకుని చేస్తానా... అసలు ఆయన దానికి చిన్న థాంక్స్ కూడా చెప్పడు. తిరిగి నాకోసం అలా చేయాలని కూడా ఆలోచించడు’’ ఇది చాలామంది భార్యల ఆరోపణ. కానీ, భర్తకి ఇదే విషయం ఎలా అర్థమవుతుందంటే,‘‘ప్రతీ విషయంలో కలగచేసుకుంటుంది. అన్నీ తనకి నచ్చినట్టే జరగాలంటుంది. పైగా దానికి ‘ప్రేమ’  అనే ఒక ట్యాగ్ తగిలిస్తుంది. తనకోసం నేను అన్నీ చేయాలంటుంది. కావల్సినంత డబ్బు ఇచ్చాను. నచ్చినట్టు చేసుకోక నేను పక్కనుండి అన్ని కొనాలి అంటుంది.. ఇదేం గోల’’.

 

చూశారా తేడా ఎక్కడుందో- మగవారికి స్వేచ్ఛ ఇష్టం. భార్య ప్రతీ విషయంలో కలగజేసుకోవడాన్ని తనమీద అధికారం చూపిస్తోంది అనుకుంటాడు. కానీ భార్య ఉద్దేశం అదికాదు నిజానికి. తాను అమితంగా ప్రేమిస్తున్నానని, అది అతనికి తెలియజేయడానికి ఇది అతని ప్రతీ విషయంలో అతనికి సహాయపడాలని అనుకుంటుంది. తిరిగి అదే ఆశిస్తుంది కూడా! కానీ, తాను కోరుకునే స్వేచ్ఛ భార్యకి ఇచ్చి - ఆమె దానినెందుకు హర్షించదు అంటాడు భర్త. ఆమెకి కావల్సింది స్వేచ్ఛ కాదు.. ప్రేమ.. అక్కడే వుంది తేడా!

 

ఇక్కడోమాట చెప్పాలి. ‘‘స్వేచ్ఛ’’ అనగానే ‘‘ఆడవాళ్ళకి స్వేచ్ఛా? ఎక్కడుంది’’ అని అడుగుతున్నారా? ‘‘కండీషన్స్ అప్లయ్’’. ఇది స్వేచ్ఛకి ట్యాగ్ లైన్. ఆ విషయం గురించి ఇంకోసారి వివరంగా చెప్పుకుందాం. ప్రస్తుతానికి తెలుసుకోవాలసిన విషయం ఒక్కటే.. మన వైపునుంచి కాదు... ఎదుటి వ్యక్తి వైపు నుంచి ఆలోచించాలి అంటారు చూశారా... అది భార్యాభర్తల విషయంలో వందశాతం ఆచరించి తీరాలి. అప్పుడే ఆ బంధం ఏ కలతలు లేకుండా సాగిపోతుంది. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రేమే. కానీ, ఆ ప్రేమని వ్యక్తం చేయడంలోనే పొరపాటు చేస్తుంటారు అంతే.. తనకి తోచింది ఎదుటి వ్యక్తికి ఇచ్చి సంతోషంగా వుండమంటారు. పోనీ, ఎదుటి వ్యక్తి దానితో సంతృప్తిపడతారా అంటే, తను ఆశించింది తనకి దొరకలేదని బాధపడతారు. ఇదే మథనం... ఇదే మానసిక వేదన... ఇదే ప్రళయాగ్నికి ఆజ్యం పోసేది. ఇద్దరిలో ఏ ఒక్కరికి అవగాహన ఉన్నాచాలు.. సగం సమస్య తీరినట్టే.

 

అందుకే చెప్పేది.. మొదట ఈ ఒక్క విషయాన్ని గ్రహించండి. ఎదుటి వ్యక్తి పూర్తిగా నాలాగా ఆలోచించడు (దు), ఆశించడు (దు) అని. ఈ విషయం అర్థంఅయితే అప్పుడు అసలు ఎదుటి వ్యక్తికి ఏం కావాలి అన్న ఆలోచన మొదలవుతుంది. ఆలోచన మొదలయితేచాలు.. విషయం అదే అర్థమవుతుంది.

-రమ

By
en-us Political News