వాళ్లంతా కట్నాలను తిరిగి ఇచ్చేశారు... ఎందుకంటే!

కట్నం తీసుకోవడం శిక్షార్హం అని ప్రభుత్వం తెగ ప్రకటనలు చేస్తుంటుంది. కట్నం అడిగేవాడు గాడిదతో సమానం అంటూ టీవీలు చెడ తిడుతుంటాయి. కానీ కట్నం తీసుకునే ఆచారంలో మాత్రం ఎలాంటి మార్పూ లేదు. మునుపటిలా కట్నం తేలేదని కిరసనాయిలు పోసి తగటబెట్టేసిన వార్తలు వినిపించకపోవచ్చు. కానీ వేధింపులు మాత్రం యథాతథంగానే సాగుతున్నాయి. ఇలాంటి ఆచారానికి ముగింపు పలుకుతున్నాడు ఓ యోధుడు....

జార్ఖండ్లోని పొఖారీ గ్రామానికి చెందిన హాజీ ముంతాజ్ అలీకి కట్నం అంటే మా చెడ్డ చిరాకు. ఆ కట్నం కారణంగానే తన తోటి ముస్లిం కుటుంబాలు ఛిద్రమైపోతున్నాయన్నది అతని అభిప్రాయం. కానీ మిగతావారిలాగా ముంతాజ్ అలీ ఈ దురాచారం గురించి బాధపడుతూ కూర్చోలేదు. కట్నం తీసుకోవడం ఎంత అనాగరికమో, దాని వల్ల పేద కుటుంబాలు ఎలా నాశనం అయిపోతున్నాయో, యువత ఎలా అత్యాశలో కూరుకుపోతోందో ఊరిలో ఇంటింటికీ వెళ్లి చెప్పసాగాడు.

2016 ఏప్రిల్లో ముంతాజ్ అలీ మొదలుపెట్టిన ప్రచారం నెలలు గడిచేసరికి సత్ఫలితాలను ఇవ్వసాగింది. తాము కట్నం తీసుకోమంటూ తోటి ముస్లిం కుటుంబాలన్నీ ముంతాజ్ అలీకి మాట ఇచ్చాయి. అంతేకాదు! ఇప్పటికే కట్నం తీసుకున్నవారైతే తాము తీసుకున్న కట్నాన్ని ఆడపిల్లల కుటుంబానికి తిరిగి ఇచ్చేందుకు సిద్ధపడ్డారు. అలా ఒకరు కాదు, ఇద్దరు కాదు... ఏకంగా 800 కుటుబాల వారు ఆరుకోట్ల రూపాయల కట్నాన్ని తిరిగి ఇచ్చేశారు.

కట్నానికి వ్యతిరేకంగా పోరాడుతున్న ముంతాజ్ అలీ పోరాటం రానురానూ ఓ ఉద్యమం స్థాయికి చేరుకుతంది. జార్ఖండ్లోని లాతేహర్, పాలము జిల్లాలలోని ముస్లిం కుటుంబాలు ఇప్పుడు కట్నం అంటేనే మండిపడుతున్నారు. ఆఖరికి పెళ్లిళ్లు చేయించే మతగురువులు (మౌల్వీలు) కూడా కట్నం తీసుకునేవారి పెళ్లిళ్లు చేయించం అంటూ ప్రతిజ్ఞ చేశారు. తన ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేసేందుకు దల్తోన్గంజ్ అనే ఊరిలో ఈ నెల 7వ తేదీన ఓ పెద్ద సభను ఏర్పాటు చేస్తున్నారు ముంతాజ్ అలీ.

మతం ఏదైనా కానీ... కట్నం ఇచ్చే ఆచారం వెనుక ఒకప్పటి ఉద్దేశం వేరు. ప్రస్తుతం మాత్రం అది ఆడపిల్లల జీవితాలని తలకిందులుగా మార్చేస్తోంది. అలాంటి పరిస్థితిని చక్కదిద్దేందుకు నడుం కట్టుకున్నారు ముంతాజ్ అలీ. అతను ఆశయం అసాధ్యం కాదని 800 కుటుంబాలు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఒక్క ముంతాజ్ అలీ ఒంటరిగా ఇంత సాధిస్తే... గంటల కొద్దీ కబుర్లు చెప్పే మన సమాజ సేవకులు ఇంకెంత సాధించాలి!

- నిర్జర.