సీఐఏ అధికారిపై పాక్ విష ప్రయోగం.. తెలిసినా అమెరికా మౌనం..!


 

అగ్రరాజ్యమైన అమెరికా గత కొంతకాలం నుండి పాకిస్థాన్ తో సత్సంబంధాలు కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. కానీ పక్కలో బల్లెం సామెత ప్రకారం.. ఎంత మైత్రిగా ఉన్నా కానీ పాకిస్థాన్ మాత్రం తన పని తాను చేసుకుంటూపోతూనే ఉంది. ప్రపంచ దేశాలను సైతం గడగడలాడించిన ఆల్ ఖైదా చీఫ్ ఒసామాబిన్ లాడెన్ ను అమెరికా మట్టి కరిపించింది. అయితే బిన్ లాడెన్ ను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించింది మాత్రం అమెరికా గూఢచారి సంస్థ సీఐఏ ఏజెంట్ మార్క్ కెల్టన్. ఈయనపై పాక్ విషప్రయోగం చేసినందని వాషింగ్టన్ పోస్ట్ కథనం ప్రచురించింది.

 

ఆల్ ఖైదా చీఫ్ ఒసామాబిన్ లాడెన్ ను 2011 మే 4న చంపిన తరువాత సరిగ్గా రెండు నెలలకు మార్క్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయనను పాక్ నుంచి స్వదేశానికి రప్పించారు. అయితే ఆయన అనారోగ్యానికి గురవ్వడానికి కారణం ఏంటని తెలుసుకోగా. చివరికి ఆయనపై విష ప్రయోగం జరిగిందని తేల్చారు. ఆఖరికి పొత్తికడుపు దగ్గర ఆపరేషన్ చేసి ఆయనను బతికించారు. జరిగింది తెలుసుకున్న మార్క్ మాత్రం గూఢచార సంస్థల్లో పని చేసేవారిపై ఇలాంటి దాడులు సర్వసాధారణమని చెప్పారు. అయితే ఇంతా తెలిసినా అమెరికా మాత్రం ఇలాంటి విషయాన్ని వెల్లడి చేసి ఇబ్బందుల్లో పడే కంటే దీనిపై మౌనంగా ఉండడమే కరెక్ట్ అని భావించి సలైంట్ గా ఉన్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు.