దేని కోసమైతే టీఆర్ఎస్‌లో చేరారో..అదే దక్కలేదు..!

కేపీ వివేకానంద..2014 ఎన్నికల్లో టీడీపీ తరపున కుత్బుల్లాపూర్ నియోజవర్గానికి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి. అయితే అనూహ్యంగా టీఆర్ఎస్‌ తీర్థం పుచ్చుకుని అందరికి షాకిచ్చారు వివేకా. సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు, పాలనా దక్షత, నియోజకవర్గ అభివృద్ధి కోసమే గులాబీ కండువా కప్పుకుంటున్నట్లు ఆయన ప్రకటించినా దాని వెనుక కారణం వేరే ఉంది. కుత్భుల్లాపూర్ గ్రామంలోని 208, 209, 211, 212 సర్వే నంబర్లో ఎమ్మెల్యే  వివేకానంద భారీ వాణిజ్య సముదాయాన్ని నిర్మించారు. అయితే ఇది అక్రమ కట్టడమని పేర్కొంటూ ఎమ్మెల్యే  బంధువు ప్రతాప్ హైకోర్టులో పిటిషన్ వేశారు.

 

తగిన అనుమతులు తీసుకోకపోవడంతో పాటు నివాస భవనంగా రిజిస్ట్రేషన్ చేయించి ఆ స్థానంలో వాణిజ్య భవనాన్ని నిర్మించారని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. దీని ద్వారా జీహెచ్‌ఎంసీకి చెల్లించాల్సిన రూ. 60 లక్షల ట్యాక్స్‌ ఎగవేసేందుకు పన్నాగం పన్నినట్లు కూడా తెలిపారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం ఎమ్మెల్యే తీరును తప్పుబట్టింది. బాధ్యాతాయుతమైన పదవిలో ఉండి ఆక్రమణలకు పాల్పడితే ఎలా అంటూ నిలదీసింది. అనంతరం కేసు విచారణను వాయిదా వేసింది. ఈ తతంగాన్ని గమనిస్తోన్న టీఆర్ఎస్ అధినేత వివేకాపై ఫోకస్ పెట్టారు.

 

అప్పటికే అనేకమంది టీడీపీ ఎమ్మెల్యేలను భయపెట్టో, బ్రతిమాలో, ప్రలోభపెట్టో తన దారికి తెచ్చుకున్న గులాబీ బాస్.. వివేకానంద విషయంలోనూ అదే స్ట్రాటజీ ఫాలో అయ్యారు. కేసుల భయంతోనో..బిల్డింగ్‌ను కేసీఆర్ కాపాడుతారన్న నమ్మకమో తెలియదు కానీ గత్యంతరం లేక ఆయన టీఆర్ఎస్‌లో చేరారు. కానీ ఊహించని విధంగా వివేకానందకు ఉమ్మడి హైకోర్టు షాకిచ్చింది. గతంలో వాయిదా వేసిన ఈ కేసుపై ఇవాళ తుది తీర్పునిచ్చింది. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే ఆయన కుటుంబసభ్యులు నిర్మించిన కట్టడాలు పూర్తిగా అక్రమ కట్టడాలని వాటిని కూల్చివేయాలని జీహెచ్‌ఎంసీ అధికారులను ఆదేశించింది. ఈ భవనంలో కొనసాగుతున్న విద్యాసంస్థల్ని జూన్1 వ తేదీ నాటికి ఖాళీ చేయాలని, కూల్చివేసిన నివేదికను, ఫోటోలను జూన్ 15 నాటికి హైకోర్టు రిజిస్ట్రార్‌కు సమర్పించాలని జీహెచ్‌ఎంసీ అధికారుల్ని ఆదేశించింది. చివరికి ఏ బిల్డింగ్ కోసమైతే వివేకానంద కారెక్కారో అదే బిల్డింగ్‌ నేడు ఆయనకు దక్కకుండా పోతోంది.