తిరుపతిలో వైసీపీ పోటీ చేయదట
posted on Jan 22, 2015 3:15PM

తిరుపతి ఎమ్మెల్యే వెంకట రమణ మరణంతో ఆ స్థానానికి ఉప ఎన్నికల జరగబోతున్న విషయం తెలిసిందే. ఈ స్థానం నుంచి వెంకట రమణ భార్య సుగుణమ్మ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎంపికయ్యారు. ఈ స్థానం నుంచి వేరే ఎవరూ పోటీ చేయని పక్షంలో ఆమె ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం వుంది. ఈ నేపథ్యంలో తమ పార్టీ ఈ స్థానం నుంచి పోటీ చేయబోవడం లేదని వైసీపీ నాయకుడు, తిరుపతి మాజీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి ప్రకటించారు. తెలుగుదేశం నాయకులు యనమల రామకృష్ణుడు తదితరులు ఈ స్థానం నుంచి అభ్యర్థిని పోటీలో నిలుపరాదని తమ పార్టీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డిని కోరిన నేపథ్యంలో తాము పోటీ చేయకూడాని నిర్ణయించుకున్నామని కరుణాకర్ రెడ్డి తెలిపారు. ఇదిలా వుండగా, ఈ స్థానం నుంచి పోటీ చేయాలా వద్దా అనే మీమాంసలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టు తెలిసింది. అలాగే వంశ పారంపర్య పాలనను తాము వ్యతిరేకిస్తున్నామంటూ లోక్ సత్తా ఎన్నికల బరిలో అభ్యర్థిని నిలిపుతామని ప్రకటించింది. అలాగే ఇద్దరు ఇండిపెండెంట్లు ఇప్పటికే నామినేషన్ వేశారు. వీరందరినీ ఒప్పించి తిరుపతి స్థానాన్ని ఏకగ్రీవం చేయడం కోసం తెలుగుదేశం నాయకులు రంగంలోకి దిగారు.