ఎవరి జీవితమూ వృథా కాదు

 

అది ఒక కొండ మీద ఉన్న గ్రామం. ఆ గ్రామంలో నీరు కరువుగా ఉండేది. గ్రామంలో ఉన్న పేదలు కాస్తోకూస్తో ఉన్న నీటితో సరిపెట్టుకుంటుంటే, ధనికులు మాత్రం కొండ దిగువన ఉన్న చెరువు నుంచి నీటిని కావడితో తెప్పించుకునేవారు. అలా ఓ పెద్దాయన తన యజమాని కోసం రోజూ కావడితో నీటిని మోసుకు వెళ్లేవాడు. కాలం ఇలా గడుస్తూ ఉండగా...  ఒకరోజు కావడిలో ఉన్న రెండు కుండలలో ఒకదానికి పగులు వచ్చింది. కానీ దాన్ని పెద్దాయన అవతలికి పడేయకుండా, ఎప్పటిలాగా దానిలో నీటిని నింపి కొండమీదకు తీసుకువెళ్లసాగాడు. రోజూ ఆ కుండ నిండా నీటిని నింపడం, కొండ మీద ఉన్న యజమాని ఇంటికి చేరుకునేసరికి దానిలో ఉన్న సగం నీరు వృథాగా నేలపాలవడం జరుగుతూనే ఉండేది.

 

‘నీ వల్ల ఉపయోగం కంటే నష్టమే ఎక్కువ!’ అని ఒక రోజు పగులు ఉన్న కుండని ఆడిపోసుకుంది మంచి కుండ. దానికి ఏం సమాధానం చెప్పాలో పగిలిన కుండకి అర్థం కాలేదు. ‘నిజంగానే తనకి ఉన్న పగులు వల్ల ఆ పెద్దాయన శ్రమంతా వృధా అయిపోతోంది కదా’ అనుకుంది. ఆ రోజు మొదలు- మంచి కుండ, పగులు ఉన్న కుండని రోజూ దెప్పిపొడవడం.. పగులు ఉన్న కుండ మారుమాట్లాడలేక దిగాలుగా ఉండిపోవడం జరుగుతూనే వస్తోంది.

 

‘నన్ను అవతల పడేయండి. నా వల్ల మీ శ్రమంతా వృథా అయిపోతోంది. యజమానికి తగినంత నీరుని కూడా ఇవ్వలేకపోతున్నారు,’ అంటూ తనని మోస్తున్న పెద్దాయనతో ఒక రోజు మొరపెట్టుకొంది పగులు ఉన్న కుండ. కుండ నేరుగా తనతో మాట్లాడటం చూసి పెద్దాయన ఒక్క క్షణం ఆశ్చర్యపోయాడు. అటు మీదట చిరునవ్వుతో... ‘నిన్ను అవతల పడేయటం మాట అటుంచు. ముందు నీ దిగులుని పోగొట్టే ఉపాయం ఒకటి చెబుతా విను. ఇవాళ కొండ మీదకి ఎక్కే దారిలో అటూఇటూ విరగబూసిన పూలను కాస్త గమనించు. వాటి అందం చూసి నీ మనసులో ఉన్న ఆందోళన అంతా మాయమైపోవడం ఖాయం!’ అన్నాడు.

 

పగులు ఉన్న కుండ ఆ రోజు నిజంగానే దారికి ఇరువైపులా ఉన్నా పూలబాటను గమనించింది. నిజంగానే ఆ అందమైన రంగురంగుల పూలని చూసి దాని మనసులో దిగులు మాయమైంది. సాయంత్రం కాగానే పెద్దాయన పగిలిన కుండతో- ‘నేను చెప్పినట్లుగా దారిలో ఉన్న పూల చెట్లను గమనించావా?’ అని అడిగాడు. దానికి పగిలిన కుండ - ‘ఓ! గమనించాను. కానీ నా సంగతేంటి? మీరు నన్ను ఎప్పుడు అవతల పడేస్తున్నారు?’ అని అడిగింది.

 

‘నిన్ను అవతల పడేసే ప్రశ్నే లేదు! ఎందుకంటే ఆ దారిలో ఉన్న పూలచెట్లన్నీ నీ చలవే. కాస్త కాస్తగా నీ నుంచి జారే నీటితో ఆ దారంతా అందమైన పూల మొక్కలు పెరిగాయి. అవి ఇప్పుడు ఆ బాటన పోయే ప్రతివారికీ సంతోషాన్ని కలిగిస్తున్నాయి. మరి ముందు ముందు కూడా ఆ మొక్కలకి నీళ్లు అవసరం కదా! నిన్నెలా వదులుకోగలను. పొద్దుగూకులా కష్టపడే నా మనసుకి తృప్తిని అందించేంది ఆ పూల మొక్కలే సుమా!’ అంటూ చెప్పుకొచ్చాడు పెద్దాయన. ఆ మాటలకి పగిలిన కుండ మనసులో ఉన్న కాస్తో కూస్తో దిగులు కాస్తా ఆవిరైపోయింది. ప్రపంచంలో ఎవరి జీవితమూ నిరుపయోగం కాదనీ, తమ లోటుపాట్లను గుర్తించినట్లే సామర్థ్యాలను కూడా గుర్తుంచుకోవాలనీ తెలిసివచ్చింది.

(ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా)

..Nirjara