వినడం కూడా ఒక కళే!

ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ నానారకాల సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను వేరొకరికి చెప్పుకుంటే చాలు, సగం తీరిపోతాయని వారి నమ్మకం. ఆఖరికి వైద్యుడి దగ్గరకు వెళ్లిన రోగి కూడా, తన మనసులో ఉన్న బాధని వైద్యునితో చెప్పుకునే అవకాశం వస్తే... సగం రోగం నుంచి ఉపశమనం పొందినంతగా తృప్తి చెందుతాడు. కానీ ఇతరుల బాధని పట్టించుకునే నాథుడు ఎవడు! అంత తీరికా, ఓపికా ఈ ప్రపంచంలో ఎవరికి ఉన్నాయి. అందుకనే అందరూ మాట్లాడటానికి ఇచ్చిన ప్రాముఖ్యతని, వినడానికి ఇవ్వడం లేదు. ఇతరుల మనసుని గెలవాలన్నా, సామాజిక సంబంధాలను మెరుగుపరుచుకోవాలన్నా... వినడం అనే కళలో ఆరితేరాలంటున్నారు వ్యక్తిత్వ వికాస నిపుణులు. అందుకోసం వారు కొన్ని చిట్కాలను కూడా అందిస్తున్నారు. అవేమిటంటే...

 

 

తగిన వాతావరణాన్ని కల్పించండి

చాలామంది ఇళ్లలోకి వెళ్లినప్పుడు... వాళ్లు ఒకపక్క మనతో మాట్లాడుతూనే ఉంటారు, మరో పక్క టీవీనో దినపత్రికో చూస్తూనే ఉంటారు. ఇలాంటి సందర్భాలు చాలా చికాకుని కలిగిస్తాయి. ఒక వ్యక్తి చెప్పే మాటలని వినాలీ అంటే దానికి తగిన వాతావరణాన్ని సృష్టించాలి. రణగొణధ్వనుల మధ్యా, టీవీ శబ్దాల మధ్యా, నలుగురూ మెసిలే చోటా సంభాషణ సీదాసాదాగా సాగిపోతుందే కానీ మనసులో ఉన్న మాటలు నిస్సంకోచంగా వెల్లడి కావు.

 

 

శరీర భాష

వినడం అంటే శూన్యంలో చూస్తూ ఉండిపోవడం కాదు. మాట్లాడే వ్యక్తికి మీరు ఆసక్తిగా వింటున్నారన్న భావన కలగాలి. అతని కళ్లలోకి సూటిగా చూస్తూ ఉండటం. మధ్యమధ్యలో తలని ఆడిస్తూ ఉంటడం, మెడని కాస్త ముందుకి వంచడం... వంటి సంకేతాల ద్వారా మీరు అవతలి వ్యక్తిని ఆలకిస్తున్నారన్న భావనని కల్పించగలగాలి.

 

 

ప్రోత్సహించండి

మీ వైపు నుంచి ఎలాంటి స్పందనా లేకపోతే అవతలివారు మాట్లాడేందుకు పెద్దగా ఇష్టపడరు. కాబట్టి మధ్యమధ్యలో వారి నుంచి మరింత సమాచారాన్నీ, మరింత స్పష్టతనీ రాబట్టేందుకు ప్రయత్నించండి. అవునా, అలాగా, నిజమే వంటి పదాలను వాడటం ద్వారా ‘నీ ఉద్దేశం ఏమిటి?’, ‘నువ్వేం చేద్దామని అనుకుంటున్నావు?’ వంటి ప్రశ్నల ద్వారా అవతలి వ్యక్తి తన మనసులో ఉన్న భావాలను పూర్తిగా వెల్లడించేందుకు అవకాశాన్ని ఇవ్వండి.

 

అడ్డుకోవద్దు

ఇతరులు చెబుతున్న విషయం మీద మనకు విరుద్ధమైన అభిప్రాయాలు ఉండవచ్చు. అవతలి మనిషి చెప్పే విషయం మీద మనకే ఎక్కువ అవగాహన, తెలివి ఉన్నాయి అనిపించడమూ సహజమే! కానీ ఎదుటివారికి తన మనసులోని మాటని పూర్తిగా చెప్పే అవకాశాన్ని కల్పించాలి. అలా కాకుండా చీటికీమాటికీ అడ్డుకోవడం వల్ల మీకు అతని అభిప్రాయాల పట్ల ఏమాత్రం గౌరవం లేదన్న విషయం తేలిపోతుంది. ‘వినడం’ అన్న స్థానంలో ‘వాదన’ చోటుచేసుకుంటుంది.

 

కేవలం వినండి

ఎదుటి వ్యక్తి మాటలను వింటూనే, మనం వాటి గురించి అప్పటికప్పుడు ఏదో ఒక అభిప్రాయానికి వచ్చేస్తూ ఉంటాము. అంటే వినడమూ, విశ్లేషణా ఏకకాలంలో జరిగిపోతూ ఉంటాయి. కొంతసేపటి తరువాత మనం ఏర్పరుచుకున్న అభిప్రాయానికి అనుగుణంగానే అతని పట్ల మన దృక్పథమూ మారిపోతుంది. ఇది నిజంగా తొందరపాటే అవుతుంది. అందుకే ముందు కాస్త స్థిమితంగా అవతలి వ్యక్తి చెప్పే మాటలన్నీ వినాలి, ఆ తరువాత వాటిని విశ్లేషించుకుకోవాలి, చివరికి ఒకటికి రెండుసార్లు ఆలోచించి అతను చెప్పిన విషయం మీద ఒక అవగాహనకు రావాలి.

 

అన్నింటికీ మించి ఎదుటి వ్యక్తికి కూడా మనలాగే భిన్నమైన వ్యక్తిత్వం, విభిన్నమైన అభిప్రాయాలు ఉండే అర్హత ఉందని భావించిననాడు... ఒక సాటి మనిషిగా అతని విలువని గుర్తించినప్పుడు, అతని మాటలను కూడా శ్రద్ధగా ఆలకించాలని అనిపిస్తుంది. మన ఆలోచనే గొప్ప, మన వ్యక్తిత్వమే ఉన్నతం అనుకునే అహంకారంలో ఎవ్వరి మాటలూ వినిపించవు. వినిపించినా మనసులోకి చేరవు.

 

- నిర్జర.