తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు భారీ ఏర్పాట్లు
posted on Jun 1, 2015 9:05PM

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి సంవత్సరం గడచిన సందర్భాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది. వస్తుందా రాదా అని ఊరించిన తెలంగాణ రాష్ట్రం సిద్ధించడంతోపాటు, తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడింది. ఈ సందర్భాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడం ద్వారా టీఆర్ఎస్ తన విజయోత్సాహాన్ని చాటబోతోంది. ఈ సంవత్సర కాలంలో ఏ విషయంలోనూ వెనక్కి తగ్గకుండా ప్రభుత్వాన్ని నడిపిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ఆవిర్భావ వేడుకలను అత్యంత భారీగా నిర్వహించడం ద్వారా యావత్ దేశాన్ని ఆకర్షించే లక్ష్యంతో వున్నారు. హైదరాబాద్‌లో మాత్రమే కాకుండా దేశ రాజధానిలో కూడా తెలంగాణ ఆవిర్భావ వేడుకలను నిర్వహించడానికి ఏర్పాట్లు జరిగాయి. హైదరాబాద్‌లోని గన్‌పార్క్‌లో భారీగా ఆవిర్భావ వేడుకలు జరపబోతున్నారు. అలాగే హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో ఆవిర్భావ వేడుకలను వైభవోపేతంగా నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
మామూలుగానే ఆవిర్భావ వేడుకలను అట్టహాసంగా నిర్వహించాలని టీఆర్ఎస్ ప్రభుత్వం సంకల్పించింది. దీనికితోడు సోమవారం నాడు వెలువడిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలలో టీఆర్ఎస్ తాను కోరుకున్నట్టుగానే ఐదు స్థానాలను గెలుచుకోవడంతో పార్టీ కార్యకర్తలు, నాయకులు ఉత్సాహంతో ఉరకలు వేస్తున్నారు. ఈ ఉత్సాహం కూడా ఈ వేడుకలలో ప్రతిఫలించే అవకాశం వుంది. సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో జరిగే ప్రధాన వేడుకలను అత్యంత భారీగా నిర్వహించనున్నారు. పలువురు కళాకారులు ఇప్పటికే రిహార్సల్స్ పూర్తి చేసుకుని తమ ఉత్సాహాన్ని మంగళవారం నాడు ప్రదర్శించబోతున్నారు. ఇక ధూంధాంలు వుండనే వుంటాయి. ఈ సందర్భంగా ప్రదర్శన కోసం పలు శకటాలను కూడా సిద్ధం చేశారు. రిపబ్లిక్ డే ఏ రకంగా జరుగుతుందో ఆ స్థాయిలో తెలంగాణ ఆవిర్భవ దినోత్సవాన్ని నిర్వహించనున్నారు.