భద్రాద్రి రామయ్య సాక్షిగా ఏపీకే ఆ హక్కంటున్నకేసీఆర్
posted on Apr 15, 2016 6:08PM

రాష్ట్ర విభజన తర్వాత ఉద్యోగుల విభజన..నీరు..విద్యుత్ లాంటి అనేక విషయాల్లో ఏపీతో వాదులాడుతూ వస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ విషయంలో కాస్త మెత్తబడ్డారు. పై నుంచి ఒత్తిడి కానీ, గొడవలు వద్దనుకుంటున్నారో ఏమో గానీ మొత్తానికి ఏపీకి సహకరించాలని కోరుకుంటున్నారు. శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలం శ్రీసీతారామస్వామి వారి కళ్యాణానికి విచ్చేసిన ముఖ్యమంత్రి విలేకరులతో మాట్లాడారు. దుమ్ముగూడెం దగ్గర నుంచి గోదావరి నీటిని వాడుకునే హక్కు ఏపీకి ఉందన్నారు. తెలంగాణ వెయ్యి టీఎంసీలు వాడుకున్నా..ఆంధ్రాకు మరో 1500 టీఎంసీలు ఉంటాయన్నారు. నీటి విషయంలో సమస్యలు రాకుండా పరస్పరం సహకరించుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన ప్రతిపాదనను తాను అంగీకరిస్తున్నట్లు తెలిపారు.
సముద్రంలోకి వృథాగా పోయే నీటిని తెలుగు బిడ్డలు వాడుకోవాలని..అలాగే ముంపు మండలాల సమస్యపై చంద్రబాబుతో మాట్లాడానని ఆయన కూడా సానుకూలంగా స్పందించారని స్పష్టం చేశారు. అటు ఇంత సడన్‌గా కేసీఆర్‌లో ఈ మార్పు ఎందుకు వచ్చిందో అర్థం కాక రాజకీయ పండితులు తలలు పట్టుకుంటున్నారు. ఎక్కడ దొరికితే అక్కడ ఏపీని..చంద్రబాబుని లెఫ్ట్ అండ్ రైట్ ఆడేసుకోవడానికే కేసీఆర్ ప్రాధాన్యతనిస్తారు. తద్వారా తెలంగాణ ప్రజల దృష్టిలో తన ఇమేజ్ తగ్గకుండా చూసుకోవాలనుకుంటారు.
ఓటుకు నోటు కేసుకు ముందు వరకు ఇలాంటి వాతావరణం నడిచినా తర్వాత పరిణామాలన్ని మారిపోయాయి. చంద్రబాబు కేసీఆర్ విషయంలో ఆచితూచి అడుగువేయడం తన మీడియా ద్వారా టీఆర్ఎస్ ఘనకార్యాలకు పబ్లిసిటీ ఇప్పించడం చేశారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సామరస్యంగా ఉండాలని చెబుతూ ఎప్పుడూ ఫస్ట్ స్టెప్ చంద్రబాబే తీసుకుంటూ ఉంటారు. దీనికి చెక్ పెట్టాలనుకున్న కేసీఆర్ అన్నింటా తనదే ముందడుగు కావాలనుకుంటున్నారు. ఏది ఏమైనా తెలుగు ప్రజలకు కావాల్సింది కూడా ఇదే. మరి భద్రాద్రి రామయ్య సాక్షిగా ఇచ్చిన మాటను కేసీఆర్ నిలబెట్టుకుంటారా? లేక తూచ్ అంటారో వేచి చూడాలి.