మాట్లాడాలి ...మాట్లాడితే పోయేదేమీ లేదు

 

మాట్లాడుతూనే వుంటాం కదా.. మళ్ళి ప్రత్యేకం గా మాట్లాడమని చెబుతున్నానేంటి అనుకుంటున్నారా.. నిజమే మనం మాట్లాడుతూనే వుంటాం.. కాని మన మనసులోని మాటలని మాత్రం మింగేస్తుంటాం..కేవలం ఎదుటి మనిషిని సంతృప్తి పరిచే మాటలనే మాట్లాడుతూ వుంటాం. దాంతో ఎదుటి వ్యక్తులు తృప్తి పడచ్చేమో కాని మన మనసు మాత్రం మనం మింగేసిన మాటల బరువుతో రోజు రోజు కి కృంగిపోతు వుంటుంది. అలా క్రుంగి పోయి, పోయి కొన్ని రోజులకి అలవాటుపడి పోతుంది ఆ బాధ కి ..ఎంతగా అలవాటు పడుతుంది అంటే అయిన దానికి , కాని దానికి కూడా ముడుచుకు పోతుంటుంది. చివరికి అది కాస్త కోపం గా మారి , ఎప్పుడు , ఎందుకు కోపం వస్తుందో కూడా మనకే తెలియని పరిస్థితి వస్తుంది . మనకే తెలియకుండా మనలో జరిగే సంఘర్షణ... ఇదంతా.


 ఈ మధ్య కాలం లో ఎప్పుడయినా " ఎందుకో నాకీ మధ్య కోపం చాలా వస్తోంది " అనిపించిందా..? లేదా "ఉట్టినే విపరీత మయిన బాధగా వుంది " అనిపించినా... ఒక్కసారి మీతో మీరు మాట్లాడండి. ఎప్పుడెప్పుడు , ఎవరెవరితో , ఏమేం చెప్పాలను కుని కూడా , చెప్పకుండా ఆగిపోయరో గుర్తు చేసుకోండి. అలా చెప్పలేక పోవటం మీకు నచ్చిందా ? లేదా చెబితే బావుండేది అనిపిస్తోందా ? చెబితే బావుండేది అనిపిస్తే మాత్రం .".మీ మనసులోని మాటని స్పష్టం గా చెప్పటం " అలవాటు చేసుకోండి. 


మొదటసారి ఇబ్బందిగా అనిపిస్తుంది , ఇన్ని రోజులు లేనిది ఇప్పుడు మాట్లాడాలంటే అంత సులువెం కాదు , అలా అని కష్టమేం కాదు. ఒక్కసారి ఎదుటి వాళ్ళు ఏం అనుకుంటారో అన్న విషయాన్ని ఆలోచించకుండా మీ భావాలని స్పష్టం గా చెప్పి చూడండి... గాలిలో తేలినట్టు వుంటుంది ., మనసు సంతోషం తో నిండి పోతుంది . అలా అని ఎదుటి వ్యక్తిని బాధించే విధంగా మాట్లాడమని కాదు, కాని మన మనసు నోరు మూయించేస్తూ , ఎదుటి వారికి తల వంచాల్సిన పని లేదు. వ్యక్తిత్వాన్ని కుదవ పెడితేనే బంధాలు నిలబడతాయి అన్న భావం నుంచి స్వేఛ్చ పొంది చూడండి ..అనుబంధాలు ఇంకా బలపడతాయి. 


ఎందుకంటే బంధాలలో చిన్న, చిన్న సర్దుబాటులు అవసరమయినా అది ఒక్క వేపే ఉండకూడదు. దాని వలన అప్పటికి సమస్యల నుంచి తప్పించుకున్నా, ఆ అసంతృప్తి మనసులో సునా మీలని సృష్టిస్తుంది, ఆ సునామీలో అనుబంధాలు కొట్టుకు పోయినా ఆశ్చర్యం లేదు . అలా జరగకూడదు అంటే మాట్లాడటం మొదలు పెట్టాలి. నచ్చినవి ఎంత స్పష్టం గా చెబుతామో, నచ్చనివి కూడా అంతే స్పష్టం గా చెప్పాలి. అర్ధం చేసుకోలేరు అనుకుంటాం కాని ఎదుటి వాళ్ళు చక్కగా అర్ధం చేసుకుంటారు. అందుకే మాట్లాడితే పోయేదేమీ లేదు బాధ తప్ప.  

- రమ