యువతకు చైతన్య స్ఫూర్తి స్వామి వివేకానంద



భారతీయ యువతకు స్ఫూర్తి ప్రదాతగా నిలిచిన స్వామి వివేకానంద జయంతి నేడు. 1863, జనవరి 12వ తేదీన కలకత్తా నగరంలో జన్మించారు. విశ్వనాథ్ దత్తా, భువనేశ్వరి దేవి ఆయన తల్లిదండ్రులు. స్వామి వివేకానందగా నామాంతరం చెందకముందు ఆయన పేరు నరేంద్రనాథ్ దత్తా. ఇంట్లో అందరూ ఆయన్ని ముద్దుగా ‘నరేన్’ అని పిలిచేవారు. నరేంద్రుడు పుట్టేనాటికే ఆయన కుటుంబం సమాజంలో ఆర్థికంగా, పేరు ప్రతిష్టల పరంగా ఎంతో ఉన్నత స్థానంలో ఉండేవారు. విద్యలోను, దానంలోను, స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను కోరుకునేవారిగా వారి కుటుంబాని సమాజంలో మంచి పేరు వుండేది. ఎంతోకాలంగా సంతానానికి నోచుకోని నరేంద్రుడి తల్లిదండ్రులు కాశీలోని వీరేశ్వర శివుడికి పూజలు చేయించిన తర్వాత, ఆ స్వామి వరప్రసాదం వల్లే నరేంద్రుడు జన్మించారని భావిస్తారు. నరేంద్రుడి తల్లికి శంకరుడు కలలో కనిపించి నేను నీకు కుమారుడిగా జన్మిస్తానని చెప్పారని కూడా అంటారు. ఏది ఏమైనప్పటికీ నరేంద్రుడు చురుకైన కుర్రాడిగా దినదిన ప్రవర్ధమానం అవుతూ వుండేవాడు.


బాల్యంలో నరేంద్రనాథ్ ఎంతో అల్లరి పిల్లవాడిగా వుండేవాడు. ఉత్సాహంగా వుండేవాడు. అదే సమయంలో అతనికి ఆధ్యాత్మిక  అంశాల మీద కూడా ఎంతో మక్కువ వుండేది. రాముడు, సీత, శివుడు తదితర దైవ స్వరూపాలను పూజిస్తూ, ధ్యానిస్తూ ఆడుకునేవాడు. ధ్యానం అనేది నరేంద్రుడికి అన్నిటికంటే ఇష్టమైన ఆట. సాధువులు, సత్పురుషులను దర్శించి, వారిని సేవించడం అంటే ఆయనకు  అమిత ఆసక్తిగా వుండేది. అలా నరేంద్రుడు ఒక శక్తివంతమైన యువకుడిగా ఎదిగాడు. యువ నరేంద్రుడు సింహంలాంటి రూపానికి తోడు అమితమైన సరితూగే ధైర్యాన్ని కలిగివుండేవాడు. మంచి వస్తాదు వంటి శరీరనిర్మాణాన్ని, సుస్వరమైన గొంతును, ప్రకాశమానమైన బుద్ధిని కలిగివుండేవాడు. సాముగరిడీలు, తత్త్వశాస్త్రం, సంగీతం తదితర అంశాలలో అపారమైన ప్రతిభను ప్రదర్శించేవాడు. దేశీయ విధానాలతోపాటు పాశ్చాత్య తత్త్వాన్ని కూడా నరేంద్రుడు అవగతం చేసుకున్నాడు.


ఈ సమయంలో నరేంద్రుడికి ఒక పెద్ద ప్రశ్న మనసులో తోచింది. అది ‘దేవుడు ఉన్నాడా‌? ఆయన్ని నేను చూడగలనా‌?’ ఈ ప్రశ్నకు సమాధానం అన్వేషిస్తూ నరేంద్రుడు ఎన్నో ప్రదేశాలకు తిరిగాడు. ఎంతోమందిని కలిశాడు. చివరికి ఆయన ప్రశ్నకు సద్గురువు తారసపడగానే సమాధానం దొరికింది. ఆ సద్గురువు ఎవరో కాదు.. రామకృష్ణ పరమహంస.



రామకృష్ణ పరమహంస శిష్యరికంలో నరేంద్రుడు ఆ
ధ్యాత్మికంగా ఎంతో అభివృద్ధిని సాధించాడు. పరమహంస నరేంద్రుడిని సంశయస్థితిలోనుంచి దృఢనిశ్చయానికి, ఆవేదన నుండి ఆధ్యాత్మిక ఆనందానికి అతనిని తీసుకొనిపోయారు. పరమహంస దేహాన్ని చాలించిన తర్వాత నరేంద్రుడు సన్యాసాన్ని స్వీకరించి ‘స్వామి వివేకానంద’గా మారారు. ఆ తర్వాత అనేక ప్రాంతాలలో పర్యటించారు.



అమెరికాలోని చికాతో నగరంలో 1893 సెప్టెంబరు 11వ తేదీన సర్వమత సభలో స్వామి వివేకానంద ‘‘అమెరికాదేశపు సోదర సోదరీమణులారా’’ అంటూ ప్రారంభించి తన చారిత్రాత్మక ప్రసంగం చేసి ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు.  ఆ తర్వాత ప్రపంచం మొత్తం పర్యటించారు. యువతకు స్ఫూర్తిగా నిలిచే ఎన్నో ప్రసంగాలు చేశారు. రామకృష్ణ మఠాన్ని స్థాపించడం ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. స్వామి వివేకానంద చెప్పిన మాటలు విని ఆచరిస్తే  చాలు.. నేటి యువత అభివృద్ధి పథంలోకి దూసుకుపోతుంది. ఎందరికో స్ఫూర్తి ప్రదాతగా నిలిచిన స్వామి వివేకానంద 1902 జులై 4న బేలూరులో కన్నుమూశారు. 39 సంవత్సరాలు మాత్రమే జీవించిన ఆయన పది జన్మలకు సరిపడా కృషి చేశారు. ప్రపంచంలో శాశ్వతంగా నిలిచిపోయిన స్ఫూర్తిని నింపారు.