స్నేహం చీటీ మళ్ళీ చించేశారా?



టీఆర్ఎస్ నాయకులు ఎప్పుడు ఎవరితో స్నేహం చేస్తారో... ఎప్పుడు ఎవరితో స్నేహం చీటీ చించేస్తారో అర్థం కాని పరిస్థితులు ఏర్పడ్డాయి. మొన్నటి వరకు ఎంఐఎం నాయకులతో ఫ్రెండ్‌షిప్ చేసిన టీఆర్ఎస్ ఇప్పుడు మోడీవైపు మళ్ళింది. మొన్నటి వరకూ మోడీని ఎంతమాత్రం పట్టించుకోని టీఆర్ఎస్ కొద్ది రోజుల క్రితం నుంచి మోడీని మంచి చేసుకునే ప్రయత్నాలు ముమ్మరం చేసింది.  టీఆర్ఎస్ నాయకుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మోడీ పక్కనే నిల్చుని ఫొటో దిగి మురిసిపోతే, కేసీఆర్ కుమార్తె మోడీతో సెల్ఫీ దిగి ముచ్చటపడిపోయింది. మోడీ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు దాన్ని ఎంతమాత్రం పట్టించుకోని కేసీఆర్ మోడీని మంచి చేసుకునే ప్రయత్నాల్లోనే భాగంగానే స్వచ్ఛ తెలంగాణ, స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాలను చేపట్టారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. అలా మరిన్ని అంశాల్లో మోడీని మంచి చేసుకోవాలన్న ప్రయత్నంలో వున్న టీఆర్ఎస్‌ సడన్‌గా ఆ ప్రయత్నాలకు బ్రేక్ వేసినట్టు కనిపిస్తోంది.

మొన్నామధ్య టీఆర్ఎస్ అధినేత కుమార్తె, ఎంపీ కవిత కేంద్ర మంత్రివర్గంలో చేరాల్సిందిగా మోడీ ఆహ్వానిస్తే ఆలోచిస్తానని స్టేట్‌మెంట్ ఇచ్చారు. కేంద్రమంత్రి అవ్వాలని ఉవ్విళ్ళూరుతున్న ఆమె పిలిస్తే ఆలోచిస్తానని అనడం జనానికి ఆశ్చర్యాన్ని కలిగించింది. అయితే బీజేపీ వర్గాలకు మాత్రం ఆగ్రహాన్ని తెప్పించింది. కవితమ్మ అలా అన్నారో లేదో ఇలా బీజేపీ స్పందించింది. టీఆర్ఎస్ తమకు ప్రత్యర్థి పార్టీయేనని, ఆ పార్టీకి కేంద్ర ప్రభుత్వంలో స్థానం కల్పించే ఆలోచన లేదని స్పష్టం చేసింది. దాంతో మొన్నటి వరకూ బీజేపీని పల్లెత్తు మాటకూడా అనకుండా ఓర్పు వహించిన టీఆర్ఎస్ నాయకులు మళ్ళీ గళం విప్పారు. తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఇటీవల మాట్లాడుతూ, ‘మోడీ స్వచ్ఛ భారత్ కార్యక్రమం మధ్యలో ఆగిపోయింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన స్వచ్ఛ హైదరాబాద్ మాత్రం నిరాటంకంగా కొనసాగుతోంది’’ అన్నారు. నిన్నటి వరకూ మోడీ స్ఫూర్తితోనే స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపట్టామని చెబుతూ వచ్చిన టీఆర్ఎస్ నాయకులు ఇలా ప్లేటు తిప్పేశారంటే మోడీతో స్నేహానికి టీఆర్ఎస్ నాయకులు మంగళం పాడినట్టుగానే భావించాలని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.