దేశ ప్రజలకు మన్మోహన్ షాక్


 



పదేళ్ళు ప్రధానమంత్రిగా వున్న కాలంలో మహానుభావుడు ఒక్క ముక్కకూడా మాట్లాడకుండా నెట్టుకొచ్చారు. సోనియాగాంధీ చేతిలో కీలుబొమ్మలా గుర్తింపు పొంది, పదవి ఊడిపోయిన తర్వాత చరిత్ర నన్ను అర్థం చేసుకోవాలంటూ బాధపడిపోయారు. అతగాడు మరెవరో కాదు... మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్. ఆయన బుధవారం నాడు దేశ ప్రజలకు షాక్ ఇచ్చారు... ఆ షాక్ ఏంటంటే, భారత ప్రధానిగా ఒక సంవత్సర కాలాన్ని పూర్తి చేసుకున్న నరేంద్ర మోడీని ఆయన ఇంటికి వెళ్ళి మరీ మన్మోహన్ అభినందించారు.  అసలు ఈ పరిణామం ఎవరూ ఊహించనిది. ఈ పరిణామాన్ని ప్రధాని మోడీ కూడా ఊహించి వుండరు. కాంగ్రెస్ పార్టీకి చెందిన మన్మోహన్ సింగ్ ఏంటీ... తమ పార్టీని గద్దె మీద నుంచి దించిన నరేంద్రమోడీని ఇంటికెళ్ళి మరీ అభినందించడమేంటి?

నరేంద్రమోడీ పాలన ఒక ఏడాదిని పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఎన్డీయే ప్రభుత్వం ఏడాదికాలంలో తమ ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రచారం చేసుకుంటూ వుంటే, కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం మోడీ ప్రభుత్వం మీద బురద జల్లే పనిలో బిజీగా వున్నారు. రాహుల్ గాంధీ అయితే, ఏం మాట్లాడుతున్నారో తనకే అర్థం కాని విధంగా మోడీ సర్కారును విమర్శిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ నాయకుడైన మన్మోహన్ సింగ్ మోడీ ఇంటికి వచ్చి అభినందనలు తెలపడం ఏ తరహా రాజకీయమో అర్థం కావడం లేదు. మన్మోహన్ మనస్పూర్తిగా అభినందించడానికి వచ్చారా.. దీని వెనుక ఏదైనా అంతరార్థం వుందా... సోనియాగాంధీ రాజకీయ పాచిక ఏమైనా వుందా  అనే సందేహాలను రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.