మహాకూటమి అధికారంలోకి వస్తే మహిళా సీఎం.!!
posted on Nov 23, 2018 10:05AM

తెలంగాణలో డిసెంబర్ 7 న ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. అధికారం కోసం టీఆర్ఎస్, మహాకూటమి నువ్వా నేనా అన్నట్టు తలపడుతున్నాయి. టీఆర్ఎస్ సీఎం అభ్యర్థి కేసీఆర్ అని అందరికీ తెలిసిన విషయమే. అయితే ఒకవేళ మహాకూటమి అధికారంలోకి వస్తే సీఎం ఎవరు?. ఇది గత కొద్దిరోజులుగా అందరినీ వేధిస్తున్న ప్రశ్న. మహాకూటమి తరుపున సీఎం రేసులో ఇప్పటికే చాలామంది నేతల పేర్లు వినిపించాయి. అయితే ఇప్పుడు మరో ట్విస్ట్ వచ్చింది. ఏఐసీసీ మహిళా విభాగం అధ్యక్షురాలు సుస్మితాదేవ్ తాజాగా సీఎం అభ్యర్థి గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో అధికారం మహాకూటమిదేనని చెప్పిన సుస్మితాదేవ్.. మహిళను సీఎం చేయాలని పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కోరతానని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని హామీ ఇచ్చారు. కేసీఆర్ పాలనలో తెలంగాణలో మహిళలకు భద్రత కరువైందన్నారు. మహిళలపై అత్యాచారాలు ఎక్కువగా జరుగుతున్న నగరాల్లో ఢిల్లీ తర్వాతి స్థానంలో హైదరాబాద్ ఉందన్నారు. మొత్తానికి కాంగ్రెస్ కి కూటమి అధికారంలోకి వస్తుందని కాన్ఫిడెన్స్ ఎంతుందో.. ప్రజల్లో కూటమి అధికారంలోకి వస్తే సీఎం ఎవరనే కన్ఫ్యూషన్ అంతే ఉంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో.