మేమున్నామనీ.. మీకేం కాదనీ....


ఆత్మహత్య... ఈమధ్యకాలంలో మనం తరచూ వింటున్నాం ఆ మాటని. చదువుకున్నవారు, ఉద్యోగం చేస్తున్నవారు, చివరికి పిల్లలు కూడా  ఆత్మహత్యలకి పాల్పడటం చూస్తున్నాం. ఒకోసారి కుటుంబం, కుటుంబం మొత్తం ఆత్మహత్య  చేసుకోవటం వింటుంటే బాధనిపిస్తుంది. ఎందుకని ఇలా జరుగుతోంది? చుట్టూ కావలసిన వాళ్ళు ఎంతో మంది వుండీ ఎందుకంత ఒంటరితనం? మనసులో బాధ పక్కవారితో పంచుకోవటానికి ఎందుకంత ఆలోచన? ఇలాంటి ప్రశ్నలకి మానసిక నిపుణులు చెబుతున్న సమాధానం ఒక్కటే.

చుట్టూ ఎంతమంది వున్నా వారితో మనసులో మాట చెప్పుకునేంత దగ్గరితనం లేకపోవటం ఓ కారణం. బాధ అనిపించగానే ఎవరికి చెప్పుకోవాలో తెలియక... ఆ సమస్యని ఎదుర్కోవటం ఎలాగో తెలియక జీవితాన్ని చాలిస్తున్నారు. అదే ఆ సమయంలో ఓ ఓదార్పు మాట వారికి అందితే  చాలు ఎన్నో ఆత్మహత్యలు జరగవు. నిజానికి వారి మాటలని ఓపికగా వినేవారు కావాలి ఆ సమయంలో. సమస్యకి పరిష్కారం కన్నా... ఆ సమస్యని ఎదుర్కునే ధైర్యం నూరిపోసేవారు కావాలి. అలా జరగాలంటే అసలు ఆత్మహత్య చేసుకోవాలనుకునేవారు ఎవరితో ఒకరితో మాట్లాడాలి.

అయితే తనని అర్థం చేసుకోరనో లేదా మరింకేదో ఆలోచనతో వారు చుట్టు పక్కల వారితో మాట్లాడటానికి ఇష్టపడరు .అలాంటి సమయంలో వారికి అందుబాటులో ఉండేందుకు కొన్ని సంస్థలు హెల్ప్ లైన్ సేవలని అందిస్తున్నాయి.

మన దేశంలో ప్రతి నగరంలో ఇలాంటి సంస్థలు పనిచేస్తున్నాయి. అక్కడకి నేరుగా వెళ్ళచ్చు లేదా వాళ్ళ హెల్ప్ లైన్ నంబర్లకి ఫోన్ చేసి మాట్లాడచ్చు. వారితో మాట్లాడిన మాటలన్నీ చాలా రహస్యంగా ఉంచబడతాయి. మన హైదరాబాద్‌లో కూడా అలా సేవలు అందిస్తున్న కొన్ని సంస్థల గురించి తెలుసు కుందాం. ఆ వివరాలు.. ఫోన్ నెంబర్లు తెలిసిన వారందరితో పంచుకుంటే... ఎప్పుడు ఎవరికి మనిషి తోడు అవసరమో తెలియదు కాబట్టి వారికీ సహాయ పడినవారు అవుతారు.

SEVA ... అనే సంస్థ ఫ్రీ కౌన్సిలింగ్ అందిస్తోంది. అక్కడకి నేరుగా వెళ్ళచ్చు.. లేదా వారి ఫోన్ నెంబరుకి ఫోన్ చేయచ్చు. వారి ఫోన్ నెంబర్  09441778290..  ల్యాండ్ లైన్  నెంబర్  (040) 27504682.  అలాగే ఫోన్ ద్వారా కూడా కౌన్సిలింగ్ అందించే మరో సంస్థ రోషిని  040 - 66202000, 040 - 66202001  .. వారి mail  -   roshnihelp@gmail.com


 ఇక మరో హెల్ప్ లైన్ నెంబర్ 7893078930 .. ఈ హెల్ప్ లైన్ సర్వీస్‌ని అందిస్తున్నది 1 లైవ్ సంస్థ.

మనసులో కలిగిన బాధని ఎవరితో ఒకరితో పంచుకుంటే ఆ నిమిషంలో కలిగే ఆవేశం చల్లారుతుంది. ఆత్మహత్య వంటి నిర్ణయాలు తీసుకోరు అప్పుడు. ఈ సంస్థలు ఆ భరోసానే అందిస్తున్నాయి.

-రమ ఇరగవరపు