సైన్యం సైలెంట్‌గా మారిపోతోంది! ఆర్మీ చీఫ్ రావత్ ఆటా మొదలెట్టారు!

 

 

ఏ దేశానికైనా అత్యంత అవసరమైన ఇద్దరే ఇద్దరు పౌరులు… జవాన్, కిసాన్! ఆ ఇద్దరిలో కూడా ఎవరు ఇంకా చాలా ముఖ్యం? ఖచ్చితంగా ఇప్పుడున్న ఆధునిక అణు బాంబుల యుగంలో జవానే కీలకం! ఇది కొంత మందికి నచ్చకపోవచ్చు… ఆర్మీకి విపరీతంగా ఖర్చు పెడుతున్నారని వాపోయే మేధావులు కూడా వుంటారు.. కాని, అవన్నీ కేవలం మాటలే. నిజంగా ప్రపంచ పటంలోని ప్రస్తుత పరిస్థితి చూస్తే … సైన్యం లేకుంటే దేశమే లేదు. ఒక వైపు పాక్, మరో వైపు చైనా, ఇంకో వైపు దేశం లోపల మావోయిస్టులు, ప్రకృతి విపత్తులు… ఇన్ని సుడిగుండాల నేపథ్యంలో ఇండియాకి సోల్జర్స్ కంటే ముఖ్యం ఇంకెవరో చెప్పండి?

 

ఆర్మీ వల్లే ఏ దైశమైనా బతికి బట్టకట్టేది. భారతదేశమూ అంతే! కాని, అప్పుడప్పుడూ, అక్కడక్కడా సైనికులు కూడా తప్పులు చేస్తుంటారు. అరాచకాలకు పాల్పడవచ్చు కూడా. కాని, వారి వల్ల కలిగే లాభంతో పొలిస్తే ఇబ్బంది చాలా స్వల్పం. అయినా కొందరు ఆర్మీని టార్గెట్ చేయటం అభ్యుదయవాదం అనుకుంటారు. మొన్నటికి మొన్న ఓ కేరళ మంత్రి ఆర్మీ వారు వచ్చి ఆడవాళ్లని కి్డ్నాప్ చేసి రేప్ చేస్తారంటూ నోటికి వచ్చినట్టు వాగేశాడు. కన్నయ్యా కుమార్ లాంటి జేఎన్ యూ విద్యార్థి కూడా చదువబ్బని వారు సైన్యంలో చేరతారంటూ అవమానకరంగా మాట్లాడు. ఇలాంటి వారు మన దేశంలో బోలెడు!

 

ఆర్మీని ఆడిపోసుకునే బాపతు వర్గం వారు ఆ మధ్య ఒక కాశ్మీరీని జీపుకి కట్టేస్తే నానా గొడవ చేశారు. అది నిజానికి మానవహక్కుల ఉల్లంఘనే అయినా మేజర్ నితిన్ గొగోయ్ ఎందుకు అలా చేయాల్సి వచ్చింది? ఈ ప్రశ్న వేసుకునే ఓపిక లేదు కొందరు మేధావులకి! రాళ్లు రువ్వే కాశ్మీరీ అరాచాక ముఠాల బారి నుంచీ పోలింగ్ సిబ్బందిని కాపాడాల్సిన బాధ్యత ఆర్మీ మేజర్ పై పడింది. అప్పుడు ఆయన కాశ్మీరీ రాళ్లు రువ్వే యువత బారి నుంచీ వాళ్లలో ఒకర్నే జీపుకి కట్టేసి దాడి నివారించాడు. పోలింగ్ సిబ్బందిని క్షేమంగా బయటకు తీసుకొచ్చాడు. ఇలాంటి కారణంగా సదరు సంఘటన వెనుక వుంది కాబట్టే భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ … మేజర్ గొగోయ్ ని ప్రశంసా పత్రంతో సత్కరించారు!

 

మోదీ ఏరికోరి ఆర్మీ చీఫ్ గా నియమించిన బిపిన్ రావత్ నిశ్శబ్ధంగా భారత సైన్యాన్ని సమూలంగా మార్చేసే చర్యలు చేపడుతున్నారు. అందులో మొదటిది కాశ్మీరీని జీపుకి కట్టేసిన మేజర్ కి అవార్డ్ ఇవ్వటం! మామూలుగా అయితే అలాంటి సాహసం చేసిన ఆర్మీ అధికారిని భారత సైన్యం శాఖా పరమైన చర్యలకి గురి చేస్తుంది. ఎందుకంటే, మానవ హక్కుల ఉల్లంఘన అంటూ అంతెత్తున లేచి ఆర్మీ ప్రత్యేక అధికారాలు తొలంగించాలంటూ సెలవిచ్చే వారికి కేంద్ర ప్రభుత్వం బయపడుతుంది కాబట్టి! ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. మోదీ సర్కార్ ఆర్మీ చీఫ్ కు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్టే కనిపిస్తోంది

 

ఇక ఇండియాన్ ఆర్మీ చీఫ్ ఈ మధ్య కాలంలో తీసుకున్న మరో నిర్ణయం సైన్యానికి, సర్కార్ కి మధ్య వుండే పేమెంట్ గొడవలకు స్వస్తి పలకటం! గతంలో ఎప్పుడు చూసినా ఆర్మీ అధికారులు, భారత ప్రభుత్వ అధికారులకి మధ్య ఆర్దిక విషయాల్లో అభిప్రాయ భేదాలు వుండేవి. ఆర్మీ అధికారుల్లో తమకు రావాల్సిన జీతాభత్యాల గురించి అసంతృప్తి వుండేది. బిపిన్ రావత్ తన అధికారులు కొందరు ఒప్పుకోకున్నా ప్రభుత్వంతో ఒక ఒప్పందానికి వచ్చేశారు. దాని ప్రకారం ఇకపైన సైన్యం మొత్తానికి కొత్తగా నిర్ణయించిన జీతాలు చేతికందనున్నాయి. ఇది కుటుంబాలకు దూరంగా దేశం కోసం పని చేసే ఆర్మీ వారికి ఎంతో మేలు చేసే అంశం…

 

మన ఆర్మీ బాస్ తీసుకున్న మరో మంచి నిర్ణయం … యుద్ధం చేయటంలో ఎంతో శిక్షణ పొందిన జవాన్లని సహాయకులుగా వాడటాన్ని నివారించటం. గన్నులు పట్టుకుని దేశ సేవ చేయాల్సిన సిబ్బందిని అధికారుల ఇళ్లలో వివిధ సేవలకి వినియోగించుకోవటం ఎప్పట్నుంచో వస్తోంది.  ఆ పద్ధతికి బదులుగా బిపిన్ రావత్ కొంత మంది సాధారణ పౌరుల్ని సహాయకులుగా నియమించాలని నిర్ణయించారు. అప్పుడు కఠినమైన ట్రైనింగ్ తీసుకున్న సోల్జర్స్ యుద్ధానికి సిద్ధంగా వుండగలుగుతారు!

 

 నెల నెలకి, వారం వారానికి పాక్ ఆగడాలు మితిమీరుతున్న వేళ సైన్యానికి నైతిక, ఆర్దిక స్థైర్యం కలిగించే చర్యలు ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ చేపట్టడం నిజంగా అభినందనీయం. సంతోకరం.