రాముడు గెలిచింది అందుకనే!

 

ఒక మనిషి మంచివాడు అని చెప్పడానికి అతణ్ని రాముడితో పోలుస్తారు. ఒక మనిషి అహంకారి అని సూచించడానికి అతణ్ని రావణాసురునితో పోలుస్తారు. రాముని దేవునిగా మనం పూజించవచ్చేమో! కానీ అతణ్ని ఆభిమానించేది మాత్రం ఆయన వ్యక్తిత్వాన్ని చూసే! రావణాసురుడు అసురుడు అన్న విషయాన్ని మనం గమనించకపోవచ్చు. కానీ ఆయనకు భయపడేది, అతనిలోని అహంకారాన్ని చూసే. రాముడు విజేతగా నిలిచినా, రావణుడు పరాజయం పాలైనా వారివారి గుణాలను బట్టే కానీ అంశను అనుసరించి కాదు.

 

 

ఆచార్యులను అనుసరిస్తూ...
రాముడికి చిన్ననాటి నుంచే పరీక్షలు మొదలయ్యాయి. వశిష్టులవారి వద్ద ఇలా రామలక్ష్మణులు తమ విద్యను పూర్తిచేసుకున్నారో లేదో, అలా విశ్వామిత్రుడు వచ్చి వారిని తన వెంట అడవులకు పంపమని అడిగాడు. తాను చేస్తున్న యాగాలకు రక్షణగా రాముని తోడు కావాలంటూ పట్టుపట్టాడు విశ్వామిత్రుడు. గురువుల మాట మీద గౌరవంతో ముక్కుపచ్చలారని రాముడు అలా మొదటిసారి అడవుల బాట పట్టాడు. అడవిలో రామునికి తనకు తెలిసిన అస్త్ర రహస్యాలన్నింటినీ అందించాడు విశ్వామిత్రుడు. గురువుని అనుసరించినందుకు రామునికి దక్కిన ప్రతిఫలం అది! అలా విశ్వామిత్రుని యాగశాలలకు కిమ్మనకుండా కాపలాగా వచ్చినందుకు, రామునిలో అటు జ్ఞానమూ, ఇటు అనుభవమూ రెండూ కూడా బలపడ్డాయి.

 

 

పెద్దలను గౌరవిస్తూ...
విశ్వామిత్రుని యాగం ముగిసిన తరువాత అయోధ్యకు తిరిగివచ్చే దారిలో రామునికి సీతాస్వయంవరం తటస్థించింది. అక్కడ మహామహులను కాదని శివధనస్సుని ఎక్కుపెట్టి సీతమ్మ చేయి పట్టాడు రాముడు. తన గురువైన శివుని ధనుస్సుని విరిచిన రాముని మీద కోపంతో ఊగిపోతూ అక్కడికి చేరుకుంటాడు పరశురాముడు. పరశురాముడు పరుషంగా ఎన్నిమాటలన్నా పరమశాంతంగా వాటిని భరిస్తాడు రాముడు. పరశురాముని కోపంలో కారణం ఉంది కాబట్టే, మారు మాటలాడకుండా నిల్చుంటాడు రాముడు. చివరికి చేతనైతే తనవద్దనున్న విష్ణుచాపాన్ని కూడా ఎక్కుపెట్టి చూపమని అడుగుతాడు పరశురాముడు. ఆ ధనుస్సుని కూడా రాముడు ఎక్కుపెట్టిన తరువాతే, అతను విష్ణుమూర్తి అవతారమన్న విషయం అర్థమవుతుంది పరశురామునికి. ఇలా పెద్దవారి పట్ల అణకువ, సందర్భోచితమైన ప్రవర్తన రాముని అవతారంలో అడుగడుగునా కనిపిస్తాయి.

 

 

తల్లిదండ్రుల మాట జవదాటక...
సీతా స్వయంవరం ముగిసి, సతీసమేతంగా అయోధ్యకు చేరుకున్న రాముడు కొన్నాళ్లైనా సుఖంగా ఉన్నాడో లేడో... రాముని అడవులకు పంపమంటూ అతని సవతి తల్లి కైకేయి దశరథుని శాసించింది. మరికొద్ది రోజులలో తనకు పట్టాభిషేకం జరగబోతుండగా, ఏకంగా అడవులకు వెళ్లాల్సి రావడం ఏమిటని రాముడు సంకోచించలేదు.

తండ్రిని ఎదిరించలేదు, సవతి తల్లి కదా అని దూషించలేదు. మారుమాట్లాడకుండా నార వస్త్రాలతో అడవులకేగాడు. ఎందుకంటే రాముడు ధర్మాన్ని నమ్మాడు. సమాజం ఒక రీతిలో సాగేందుకు ఏర్పరుచుకున్న నియమమే ధర్మం. అది కాలాన్ని బట్టి ఎంతోకొంత మారుతూ ఉండవచ్చు. తన కాలంలో ఉన్న ధర్మాన్ని రాముడు మనసావాచా అనుసరించాడు.

ధర్మాన్ని తాను పరిరక్షిస్తే, ధర్మం తనను కాపాడుతుందని విశ్వసించాడు. ఆ నమ్మకమే ఆయన విజయానికి కారణమైంది. ప్రకృతిలో ప్రతి జీవి ఆయన నమ్మకానికి తోడునిచ్చేందుకు సిద్ధపడింది. అల్లరికి మారుపేరైన కోతుల దగ్గర్నుంచీ, అల్పజీవులైన ఉడతల దాకా రామునికి సాయపడ్డాయి. లంకను దాటేందుకు సముద్రంలో రాళ్లు తేలాయి, రాముని మీద సంధించిన మోయాపాయాలన్నీ చిన్నబోయాయి. దీనికంతటికీ ధర్మం పట్ల రాముడు చూపిన నమ్మకమే అని వేరే చెప్పాలా. అందుకే ‘రామో విగ్రహవాన్ ధర్మః’ అన్నారు. అంటే రూపం దాల్చిన ధర్మమే రాముడు అని అర్థం. అదే అతని విజయ రహస్యం.

 

 

మరి రావణుడో!
రామునికంటే రావణుడు  పెద్దవాడు, అనుభవజ్ఞుడు. మానవుల చేతిలో తప్ప మృత్యువు రాదన్న వరం ఉన్నవాడు. కుబేరుడు నిర్మించిన లంకా నగరంలో సకలవైభోగాలూ అనుభవిస్తున్నవాడు. అందుకే గొప్ప ఇంటిని చూస్తే దాన్ని ‘లంకంత కొంప’తో పోలుస్తాము. మండోదరిలాంటి మహాపతివ్రత రావణుని భార్య; విశ్వజిత్తు వంటి చేతికందిన ఏడుగురు సమర్థులు అతని కొడుకులు; విభీషణుడు, కుంభకర్ణుడులాంటి పరాక్రమవంతులు అతని సోదరులు; శివుని ఆశీస్సులు; వేదాలను అభ్యసించి సాధించిన అపార జ్ఞానం... ఇవేవీ రావణుని రక్షించలేకపోయాయి. పరస్త్రీ వ్యామోహం, ఆ వ్యామోహాన్ని సమర్థించుకునే అహంకారం అతని వినాశనానికి దారితీశాయి. అడవుల బాట పట్టిన రాముడు, కోతిమూక సాయంతో రావణుని ఓడించాడు. రాముడు తన జీవితకాలంలో స్నేహితులను పోగేసుకుంటే వెళ్తే, రావణుడు తన సోదరుడైన విభీషణుని సైతం శత్రువుగా మార్చుకున్నాడు. రాముని దర్శించిన అహల్యవంటివారంతా శాపవిమోచనం పొందితే, రావణుడు మాత్రం ఒక్కొక్కొరి నుంచి శాపాలను పోగుచేసుకుంటూ సాగాడు. ఆ శాపాలు, శతృత్వాలే చివరికి రావణుడి కొంప ముంచాయి. ధర్మం దాటి పరస్త్రీని చేపట్టిన రావణుని అంతమొందించేందుకు సాయపడ్డాయి.

 

- నిర్జర.