స్మగ్లర్ ముదిరి ప్రొడ్యూసరయ్యాడు



తొండ ముదిరితే ఊసరవెల్లి అవుతుంది.. మరి స్మగ్లర్ ముదిరితే... ఏమైనా కావచ్చు.. ఎంత ఎత్తయినా ఎదగవచ్చు. సదరు స్మగ్లర్ గారికి రాజకీయ నాయకుల అండ కూడా వుంటే... ఎక్కడికో ఎదిగిపోవచ్చు... ఈ సూత్రానికి అనుగుణంగానే మస్తాన్ వలి అనే ఎర్రచందనం స్మగ్లర్ ఎక్కడికో ఎదిగిపోయాడు. కోట్లకు కోట్లు సంపాదించాడు.. ప్రొడ్యూసర్ అయి ఓ సినిమా కూడా తీశాడు. చివరికి పోలీసుల చేతిలోపడ్డాడు... మొన్నామధ్యే మూడు నెలలపాటు జైల్లో గడిపి బయటకి వచ్చాడు. ఇప్పుడు మళ్ళీ ఎర్రచందనం స్మగ్లింగ్‌లో  బిజీగా వున్నాడు.

కర్నూలు జిల్లా చాగలమర్రి ప్రాంతానికి చెందిన మస్తాన్ వలి మొదట్లో ఆటో నడిపేవాడు. కూరగాయలు అమ్మేవాడు. ఇలా ఎంతకాలం బతకాలని అనుకున్నాడో ఏమోగానీ, ఒక్కసారిగా ఎర్రచందనం స్మగ్లర్ అవతారం ఎత్తాడు. పెట్రోలుకు నిప్పు తోడైనట్టుగా ఈయనకి రాజకీయంగా కూడా అండ దొరికింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైన మస్తాన్ వలి ఇటు రాజకీయంగాను, అటు స్మగ్లర్‌గానూ ఎదిగాడు. ఆటో నడుపుకునే వ్యక్తి అతి కొద్దికాలంలోనే కోట్ల రూపాయలు సంపాదించాడు. కార్లు, బిల్డింగ్స్, విలాసాలు, దర్జాలు... గట్రా.. గట్రా అతని జీవితంలో మామూలు విషయాలైపోయాయి. అప్పుడు అయ్యగారికి సినిమా ఇండస్ట్రీ మీద మోజు పుట్టింది. అంతే ఎంటర్ ద టాలీవుడ్ అన్నాడు.

టాలీవుడ్‌లోకి ఎంటరైపోయిన మస్తాన్ వలి తన స్మగ్లర్ ప్రయాణంలో సంపాదించిన డబ్బుతో ‘ప్రేమ ప్రయాణం’ అనే సినిమా మొదలుపెట్టాడు. కొన్నాళ్ళపాటు షూటింగ్స్, ‘మీటింగ్స్’, ఆడియో ఫంక్షన్లు... ఆ ఫంక్షన్లు, ఈ ఫంక్షన్లు అని బాగానే కాలక్షేపం చేశాడు. చేతికి ఎముక లేనట్టుగా డబ్బు ఖర్చు పెడుతున్న మస్తాన్ వలీని చూసి టాలీవుడ్ జీవులు అబ్బ.. మన ఇండస్ట్రీకి మరో ‘మంచి’ ప్రొడ్యూసర్ వచ్చేశాడని మురిసిపోయారు. ఆ తర్వాత సదరు సినిమా విడుదలవటం, బాక్సాఫీసు దగ్గర ఢమాల్ అనడం సహజంగానే జరిగిపోయాయి. దాంతో మస్తాన్ వలీ మళ్ళీ తన సొంత ఊరికి వెళ్ళిపోయి మళ్ళీ స్మగ్లింగ్‌లో బిజీ అయిపోయాడు. ఇవన్నీ కర్నూలు జిల్లా పోలీసులు తెలిపిన విషయాలు.