హైదరాబాద్... ఓ 'గులాబీ' వనం

 


హైదరాబాద్ మొత్తం గులాబీ రంగులో మునిగిపోయింది. ఇప్పుడు కానీ ఉపగ్రహం ఒక ఫోటో తీస్తే పింక్ కలర్ తప్ప ఏం కనిపించదేమో. హైదరాబాదా లేక గులాబీ వనమా అని అనిపిస్తుంది. త్వరలో టీఆర్ఎస్ పార్టీ తరపున పెద్ద ఎత్తున ప్లీనరీ జరగనుంది. ఈ సమావేశానికి గాను ఆ పార్టీ సభ్యులు పెద్ద పెద్ద హోర్డింగులు, చిన్న చిన్న పోస్టర్లు అన్ని సైజులలో ఎక్కడ పడితే అక్కడ అతికించారు. పార్టీ నాయకులంతా పోటీ పడి మరీ ఎక్కడ చిన్న గోడలు కనిపించినా వదల్లేదు. ఆఖరికి మెట్రో రైలు పిల్లర్లకు కూడా అతికించేశారు. ప్లీనరీ నిర్వహించనున్న లాల్ బహదూర్ స్టేడియం, పబ్లిక్ మీటింగ్  నిర్వహించనున్న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ పోస్టర్లతో నిండిపోయింది.

మంత్రులు పద్మారావ్, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ ప్లీనరీ ఏర్పాటు కార్యక్రమాలలో చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. మంత్రి పద్మారావ్ సికింద్రాబాద్ ఏరియా మొత్తం కట్ ఔట్స్ తో నింపేశారు. మరోవైపు తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్లీనరీ కార్యక్రమంలో పాల్గొనాలని టీఆర్ఎస్ నాయకులను, కార్యకర్తలను ఆహ్వానించారు. ప్రతి ఒక్క పోస్టర్లో టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తో పాటు కొడుకు ఐటీ మంత్రి కేటీఆర్, కూతురు ఎంపీ కవిత, మేనల్లుడు నీటిపారుదుల శాఖ మంత్రి హరీష్ రావ్ నలుగురు ఫోటోలు మాత్రం తప్పకుండా ఉండేలా చూసుకున్నారు. మొత్తానికి ఈ ప్లీనరీ పుణ్యమా అని హైదరాబాద్ లో పండుగు వాతావరణం కనిపిస్తోంది.