మహిళలపై కొంటె కామెంట్లు విసిరిన శరద్ యాదవ్..
posted on Mar 14, 2015 11:42AM

జేడీయు నాయకుడు శరద్ యాదవ్‌కి వయసు అయిపోయినా వగరు, పొగరు తగ్గినట్టు లేదు. తలలు బోడులైన తలపులు బోడులౌనా అని ఇలాంటి పెద్దమనుషులను చూసే అని వుంటారు. పార్లమెంటులో బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల మీద చర్చ జరుగుతుండగా, ఈ పెద్దమనిషి లేచి నిలబడి సంబంధం లేని వ్యాఖ్యలు చేశాడు. అది కూడా దక్షిణ భారతదేశానికి చెందిన మహిళల మీద. శరద్ యాదవ్ తన ప్రసంగంలో భారతదేశ పురుషులకు తెల్లటి మహిళల మీద వున్న ఆసక్తి గురించి చెబుతూ సుదీర్ఘ సుత్తి కొట్టాడు. ఆ తర్వాత ఓ దీర్ఘ శ్వాస తీసుకుని, మొత్తం భారతదేశంలో దక్షిణ భారతదేశంలోని మహిళలు నల్లగా వున్నప్పటికీ, చాలా అందంగా వుంటారని, డాన్స్ కూడా బాగా చేస్తారని, వారు డాన్స్ చేస్తుంటే అలా చూడాలనిపిస్తుందని కళ్ళనిండా తన్మయత్వం కనిపిస్తూ వుండగా చెప్పాడు. దాంతో సభ మొత్తం గగ్గోలు పెట్టేసింది. సభలోని మహిళా ఎంపీలందరూ శరద్ యాదవ్ మీద గయ్యిమని విరుచుకుపడ్డారు. ఏమయ్యా పెద్దమనిషీ, నువ్వు బాధ్యతాయుతమైన పదవిలో వున్న ఎంపీవా? లేక పనీపాటా లేని పోకిరీవా అని ప్రశ్నల మీద ప్రశ్నలు సంధించారు. దాంతో శరద్ యాదవ్ ఎరక్కపోయి నోరుజారి ఇరుక్కుపోయానన్నట్టుగా ఎక్స్‌ప్రెషన్ ఇచ్చాడు. ఇక్కడ నడుస్తున్న టాపిక్కేంటి.. నోటికొచ్చినట్టు నీ వాగుడేంటి అని సభలోని మహిళలు ఆయన్ని కడిగిపారేశారు. శరద్ యాదవ్ కామెంట్లు దక్షిణాది మహిళలను కించపరిచేలా ఉన్నాయని ఆందోళనకు దిగారు. ఆయన తన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకుని.... దేశంలోని మహిళలందరికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్, సీపీఎం, బీజేపీ కూడా శరద్‌యాదవ్ వ్యాఖ్యలను తప్పుబట్టాయి. అయితే శరద్ యాదవ్ మాత్రం సారీ చెప్పనుగాక చెప్పనంటూ మూతి బిగించుకుని కూర్చున్నాడు. దాంతో నిరసనలు మరింత పెరిగాయి. చివరికి శరద్ యాదవ్ తరఫున జేడీయూ ఎంపీ కేసీ త్యాగి క్షమాపణలు చెప్పడంతో పరిస్థితి సర్దుమణిగింది. అయ్యగారికి కట్టుడు పళ్ళు వచ్చినా బుద్ధి మాత్రం మారలేదు. ఏం చేస్తాం... కలికాలం..