కొరివితో తల గోక్కొంటున్న శంకరావు

 

ఊరికే కూర్చొన్నోడు ఊసుపోక పేడ తీసి వాసన చూసినట్లు, మంత్రి పదవి ఊడగొట్టున్నశంకర్ రావు ఊసిపోక ముఖ్యమంత్రి మీద, డీజీపీ దినేష్ రెడ్డి మీద అధిష్టానానికి లేనిపోని చాడీలు వ్రాయడం మొదలుపెట్టారు. గ్రీన్ ఫీల్డ్స్ వ్యవహారంలో అరెస్టు తరువాత ఆయన తన పరిస్థితిని అర్ధం చేసుకొని తగ్గకపోగా, తన నోటికి మరింత పదును పెట్టారు. ఆయన దినేష్ రెడ్డి ఆదాయానికి మించి ఆస్తులు కూడా బెట్టాడని ఆరోపణలు చేయడమే కాకుండా, దానిపై సీబీఐ విచారణ కూడా జరిపించాలని డిమాండ్ చేసారు.

 

ఆయన నోటి దురదే ఇప్పుడు ఆయన కొంప ముంచింది. ఒకవైపు గ్రీన్ ఫీల్డ్ భూముల వ్యవహారం భూతంలా వెంటాడుతుంటే దానిని నుండి బయటపడక ముందే, తన ఆరోపణలతో మరో కొత్త కేసులో ఇర్రుకొన్నారు. నిన్న సైఫాబాద్ పోలీసులు ఆయనని దాదాపు ఆరు గంటలు ప్రశ్నించారు. గత అనుభవం దృష్టిలో ఉంచుకొని, పోలీసులు వైద్యులను ఒక అంబులెన్స్ ను కూడా సిద్ధంగా పెట్టుకొని, ముందుగా ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన తరువాతనే ప్రశ్నించడం మొదలుపెట్టారు. పోలీసులు తనని బాధిస్తున్నందుకు నిరసనగా శంకరావు మూతికి నల్లగుడ్డ కట్టుకొని విచారణకు హాజరయ్యారు. అయితే ఆ విచారణలో ఆయన దినేష్ రెడ్డి చేసిన ఆరోపణలకు ఎటువంటి ఋజువులు చూపించలేకపోయారని ఇన్స్పెక్టర్ వీ.ఉమేందర్ స్పష్టం చేసారు. అందువల్ల పోలీసులు ఈ రోజు కూడా మళ్ళీ విచారణకు హాజరవవలసిందిగా ఆయనను ఆదేశించారు.

 

కానీ, శంకరరావు తనకలవాటయిన ఎత్తుగడ వేసారు. నిన్న సాయంత్రమే ఆయన కేర్ ఆసుపత్రిలో చేరిపోయి, ‘తన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా తానూ విచారణకు హాజరు కాలేనని, అవసరమయితే పోలీసులే వైద్యుల సమక్షంలో ఆసుపత్రిలో విచారణ చేసుకోవచ్చునని’ ఆయన తన కుమార్తె సుష్మిత చేత ఒక లేఖ వ్రాయించారు. ఇప్పుడు ఆయన పోలీసుల నుండి తప్పించుకోవాలంటే కేర్ ఆసుపత్రే శరణ్యం అవుతోంది. వృద్దాప్యం మీద పడిన తరువాతయినా నోటిని అదుపులో పెట్టుకొని ఉండి ఉంటే ఆయనకు ఇప్పుడు ఇన్ని కష్టాలు ఉండేవి కావు.