స‌హ‌నం పెరిగితే... స‌మ‌యం త‌గ్గిపోతుంది

 

జ‌పాన్‌లో ఒక కుర్ర‌వాడు ఉండేవాడు. అత‌నికి క‌త్తి విద్య నేర్చుకోవాల‌ని మ‌హా స‌ర‌దా! చుట్టు ప‌క్క‌ల‌వారంద‌రినీ వాక‌బు చేయ‌గా... ద‌గ్గ‌ర్లోని ఒక ప‌ట్ట‌ణంలో క‌త్తివిద్య‌లో ఆరితేరిన ఒక యోధుడు ఉన్నాడ‌ని తేలింది. వెంట‌నే మూటాముల్లే స‌ర్దుకుని ఆ యోధుడిని క‌లుసుకునేందుకు బ‌య‌ల్దేరాడు కుర్ర‌వాడు. ప‌ట్ట‌ణానికి చేరుకున్న త‌రువాత ఆ యోధుని ఇంటి ఆన‌వాలు ప‌ట్టుకోవ‌డం ఏమంత క‌ష్టం కాలేదు. ఆ యోధుని ఎదుట నిలిచిన కుర్ర‌వాడు `అయ్యా! నాకు క‌త్తిసామంటే ప్రాణం. మీరు ద‌య‌చేసి న‌న్ను శిష్యునిగా స్వీక‌రించి, ఆ క‌ళ‌ని నేర్పండి,` అంటూ ప్రాథేయ‌ప‌డ్డాడు.

 

`ఓస్‌! అదెంత ప‌ని,` అన్నాడు ఆ యోధుడు. `కాక‌పోతే ఆ క‌త్తిసాము మీద ప‌ట్టు సాధించాలంటే క‌నీసం ప‌దేళ్లు ప‌డుతుంది. ఫ‌ర్వాలేదా!` అని అడిగాడు. `ప‌దేళ్లే! నా తండ్రి ఇప్పుడిప్పుడే పెద్ద‌వాడు అవుతున్నాడు. నేను త్వ‌ర‌త్వ‌ర‌గా క‌త్తిసాముని నేర్చుకుని, ఆయ‌న వ్యాపారాన్ని అందుకోవాలి. కావాలంటే రోజూ తెల్ల‌వారే మీ ద‌గ్గ‌ర‌కి వ‌చ్చి రాత్రి పొద్దుపోయేదాకా క‌త్తిసాముని నేర్చుకుంటాను. అలా అయితే ఎన్నాళ్లు ప‌డుతుంది?` అని అడిగాడు కుర్ర‌వాడు.

 

యోధుడు ఒక్క నిమిషం సాలోచ‌న‌గా చూసి...`నువ్వు చెప్పిన ప్ర‌కారం క‌త్తిసాములో ప‌రిణ‌తిని పొందాలంటే ముప్ఫై ఏళ్లు ప‌డుతుంది,` అన్నాడు చిరున‌వ్వుతో. `అదేంటీ... స‌మ‌యాన్ని పొడిగించారు! రోజూ ప్ర‌యాణం చేయ‌డం వ‌ల్ల అల‌సిపోతాన‌న్న‌ది మీ ఉద్దేశం కాబోలు. అలా అయితే నేను ఎక్క‌డికీ వెళ్ల‌కుండా మీ ద‌గ్గ‌రే ఉండిపోయి క‌త్తిసాముని రాత్రింబ‌గ‌లూ నేర్చుకుంటాను. అలా అయితే నాకు విద్య ఎన్నిరోజుల‌లో ప‌రిపూర్ణంగా వ‌స్తుందంటారు?` అని అడిగాడు కుర్ర‌వాడు.

 

యోధుడు మ‌ళ్లీ సాలోచ‌న‌గా చూసి... `నువ్వు చెబుతున్న ప్ర‌ణాళిక ప్ర‌కారం నీకు ప‌రిపూర్ణంగా క‌త్తిసాము రావాలంటే యాభై ఏళ్లు ప‌డుతుంది,` అన్నాడు. యోధుని మాట‌ల‌కు కుర్ర‌వాడి క‌డుపు మండిపోయింది. `అయ్యా! విద్య‌ని వెతుక్కుంటూ మీ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చాను క‌దా అని మీరు న‌న్ను అవ‌మానిస్తున్నారు. లేక‌పోతే నేర్చుకునే స‌మ‌యం పెంచుతున్న కొద్దీ ప‌రిపూర్ణ‌తి సాధించే వ్య‌వ‌ధి ఎలా పెరుగుతుంది?` అని కోపంగా అడిగాడు కుర్ర‌వాడు.

 

`నాయ‌నా నువ్వే విద్య‌ని అవ‌మానిస్తున్నావు!` శాంతంగా చెప్పుకొచ్చాడు యోధుడు. `నాకు నీలో, విద్య‌ని వీలైనంత త్వ‌ర‌గా నేర్చేసుకోవాల‌న్న అస‌హ‌నం క‌నిపిస్తోంది. ఆ అస‌హ‌న‌మే నీ ఏకాగ్ర‌త‌ని దెబ్బ‌తీస్తుంది. మ‌రి క‌త్తిసాముకి కావ‌ల్సింది ఆ ఏకాగ్ర‌తే క‌దా! అదే లోపించిన‌ప్పుడు నువ్వు మ‌రింత త్వ‌ర‌గా విద్య‌ని ఎలా గ్ర‌హిస్తావు. గ్ర‌హించినా అది అర‌కొర‌గా, అసంపూర్ణంగా... నీ అస‌హ‌నంలాగానే ఉంటుంది,` అని వివ‌రించారు గురువుగారు. గురువుగారి మాట‌ల‌తో కుర్ర‌వాడు త‌న‌లోని లోప‌మేమిటో అర్థ‌మైంది. ప‌దేళ్ల‌పాటు క‌త్తిసాముని నేర్చుకునేందుకు మ‌న‌స్ఫూర్తిగా సిద్ధ‌ప‌డ్డాడు. కానీ ఆశ్చ‌ర్యం! ఐదేళ్ల‌లోనే అత‌ను ఆ విద్య‌లో ప‌రిపూర్ణ‌త‌ని సాధించేశాడు.

 

(ప్ర‌చారంలో ఉన్న జాన‌ప‌ద క‌థ ఆధారంగా)

 

- నిర్జ‌ర‌.