కేసీఆర్ మరీ దిగజారిపోయారు... రేవంత్...

 

టీఆర్ఎస్ ప్రభుత్వం మీద, టీఆర్ఎస్ నాయకుల మీద తాను చేసిన ఆరోపణలు అబద్ధమని నిరూపిస్తే ఏ విచారణకైనా తాను సిద్ధమని తెలంగాణ తెలుగుదేశం నాయకుడు రేవంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం నాడు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. నిజాలు మాట్లాడినందుకు తెలంగాణ ప్రభుత్వం తనపై కక్షకట్టినట్టు వ్యవహరిస్తోందని అన్నారు. అవకతవకలను ప్రశ్నించినందుకు తనపై రకరకాల దాడులు చేయిస్తున్నారని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ స్థాయికి దిగజారతారని తాను అనుకోలేదన్నారు. తన ఇంటిమీద తెలంగాణ జాగృతి కార్యకర్తలు దాడి చేశారని, ఇది ఏరకమైన ప్రజాస్వామ్యమని ఆయన ప్రశ్నించారు. దాడులు చేయిస్తే తాను లొంగిపోతానని భావిస్తే అది పొరపాటు అని అన్నారు. మహిళలతో తనపై ఆరోపణలు చేయించడం ఏం సంస్కృతి అని రేవంత్ ప్రశ్నించారు. శాసనసభలో టీఆర్ఎస్ సభ్యులు తమ వెనక కూర్చుని అసభ్యమైన భాషతో నిందిస్తున్నారని, వ్యక్తిగతంగా ఆరోపణలు చేయడం సబబు కాదని, రాజకీయపరమైన ఆరోపణలు చేస్తే  సమాధానం చెబుతానని రేవంత్ చెప్పారు. రేవంత్‌రెడ్డి  మాటల్లో మరికొన్ని ముఖ్యాంశాలు...

 

* పోలవరంలో బండారం బయటపెట్టినందువల్లే నాపై ఆరోపణలు చేశారు. తారాచౌదరి విషయంలో నన్ను ఇరికించేందుకు ప్రయత్నించారు.

 

* నేను వాజ్‌పేయీని ఆదర్శంగా తీసుకుని రాజకీయాల్లో కొనసాగాలని అనుకుంటున్నాను. ఏ పార్టీ నుంచి ఎన్నికయ్యానో ఆ పార్టీలోనే ఉండాలనుకుంటున్నాను.

 

* శాసనసభలో మాట్లాడితే నాపై కేసులు పెట్టడం ఏం న్యాయం? తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ కేసీఆర్ కుటుంబ బడ్జెట్ అన్న మాటకు నేను కట్టుబడి వున్నాను.

 

* నన్ను తెలంగాణ సమాజం ముందు దోషిగా నిలబెట్టడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. నేను అబద్ధాలు చెబుతానని ప్రచారం చేస్తున్నారు. ఇప్పటి వరకు నేను చేసిన ఆరోపణలన్నిటికీ ఆధారాలు నా దగ్గర వున్నాయి. అవసరమైన చోట వాటిని ప్రవేశపెడతాను.

 

* దాడులు చేసి, అబద్ధపు ఆరోపణలు చేసి నా నైతిక, మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయాలనుకుంటే అది ఎవరివల్లా కాదు. నేను శిక్షణ పొందిన సంస్థ అలాంటిది. ఇలాంటి సందర్భాల్లో నేను మరింత ఉత్సాహంగా పనిచేస్తాను.