మోడీ దైవదూత కాదు: రామ్ జెట్మలాని

 

దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి నిన్న మొన్నటి వరకు దేశాన్ని ఎక్కువ కాలం కాంగ్రెస్ పార్టీయే పరిపాలించింది. కానీ ఏనాడూ అది విదేశీ బ్యాంకులలో మూలుగుతున్న నలధనాన్ని వెనక్కి రప్పించేందుకు గట్టిగా ప్రయత్నించలేదు. సుప్రీంకోర్టు ఒత్తిడి చేయడంతో విదేశీ బ్యాంకులలో నల్లధనం దాచుకొన్న వారి జాబితాను కోర్టుకి సమర్పించింది కానీ వారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు.

 

కానీ మోడీ అధికారం చేపట్టిన వెంటనే సంబంధిత రంగాలకు చెందిన అధికారులు, నిపుణులు, న్యాయమూర్తులతో కూడిన సిట్ కమిటీ ఏర్పాటు చేసి నల్లధనం వెనక్కి రప్పించేందుకు తగిన చర్యలు తీసుకోవడం మొదలుపెట్టారు. నల్లధనం దాచినవారికి 10 ఏళ్ల జైలు శిక్ష, దొరికిన సొమ్ముపై ఏకంగా 120 శాతం పన్ను వసూలు చేసేందుకు వీలుగా చట్ట సవరణలు చేశారు. విదేశాలలో నల్లధనం దాచుకొన్నవారు స్వచ్చందంగా ఆ వివరాలను ప్రకటించినట్లయితే దానిపై 30 శాతం పన్ను, మరో 30 శాతం జరిమానా చెల్లించేందుకు కేంద్రప్రభుత్వం సెప్టెంబర్ 30వరకు గడువు ఇచ్చింది. ఆ గడువులోగా మొత్తం 638 మంది రూ.3, 770 కోట్లు ప్రభుత్వానికి చెల్లించారు. ఇక నుండి మిగిలిన వారిపై కటిన చర్యలు చేపట్టబోతున్నట్లు ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు.

 

విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్న నల్ల ధనాన్ని వెనక్కి రప్పించేందుకు మోడీ ప్రభుత్వం చేపడుతున్న ఈ చర్యలన్నిటినీ యావత్ భారతీయులు హర్షిస్తున్నారు. కానీ ప్రముఖ న్యాయవాది, రాజ్యసభ సభ్యుడు రామ్ జెట్మలాని మాత్రం ప్రధాని నరేంద్ర మోడీని తీవ్రంగా విమర్శిస్తున్నారు.

 

“లోక్ సభ ఎన్నికలకు ముందు విదేశీ బ్యాంకులలో పేరుకుపోయిన నల్లధనం వెనక్కి రప్పించి దేశాభివృద్ధికి వినియోగిస్తానని గొప్పగా చెప్పుకొన్న నరేంద్ర మోడి అధికారంలోకి వచ్చేక దాని కోసం గట్టిగా చర్యలు తీసుకోలేదు. భారతదేశాన్ని రక్షించడానికి భగవంతుడు పంపిన దూత ఆయన అని భావించాను. కానీ ఆయన కూడా సగటు రాజకీయ నాయకుడేనని నిరూపించుకొన్నారు. ఆయన మాటలు నమ్మి నేను మోసపోయాను. ఆయన ఇప్పుడు బీహార్ ప్రజలను కూడా మోసం చేయాలని చూస్తున్నారు. ఆయన మాటలు నమ్మవద్దని బీహార్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను,” అని అన్నారు.

 

నల్లధనం గురించి మోడీ ప్రభుత్వం చేపట్టిన చర్యలు, వాటి ఫలితాల గురించి మాట్లాడకుండా ఆయన బీహార్ ఎన్నికల నేపధ్యంలో మోడీని విమర్శించడం గమనిస్తే ఆయన బీహార్ లో ఏదో ఒక రాజకీయ పార్టీ లేదా కూటమికి ఎన్నికలలో లబ్ది చేకూర్చేందుకే ఈవిధంగా మాట్లాడుతున్నట్లు అనుమానం కలుగుతోంది. ఏదో ఒక పార్టీ లేదా కూటమి ఆయనను ఆవిధంగా మాట్లాడిస్తున్నట్లు అనుమానం కలుగుతోంది. ఆయన తన మేధస్సును ఈవిధంగా దుర్వినియోగం చేయడం కంటే నల్లదనాన్ని వెనక్కి రప్పించేందుకు మోడీ ప్రభుత్వానికి మంచి సూచనలు ఇచ్చి ఉండి ఉంటే అందరూ హర్షించేవారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu