చెల్లికి రాఖీ గిఫ్ట్‌గా కిడ్నీ

అన్నా చెల్లెళ్లు..అక్కాతమ్ముళ్ల మధ్యన ప్రేమానురాగాలకు చిహ్నాంగా నిర్వహించుకునే రక్షాబంధనం పండుగను దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. జన్మనిచ్చిన తల్లిదండ్రుల తర్వాత అంతటి అప్యాయతను పంచే సోదరసోదరి బంధం ప్రతి ఒక్కరి జీవితంలో అంతే ప్రముఖ స్థానాన్ని ఆక్రమించింది. ఈ రోజున సోదరీ స్వయంగా సోదరుని ఇంటికి వచ్చి వారికి బలాన్ని, శక్తిని ప్రసాదించి, రక్షణనివ్వవలసిందిగా కోరుతూ వారి ముంజేతికి రక్షాకంకణాన్ని కడతుంది. అలా రాఖీ కట్టిన సోదరికి సోదరుడు ఏదైనా బహుమతి ఇవ్వడం ఆనవాయితీ. ఈ నేపధ్యంలో తనతో పాటు పుట్టి..చిన్నప్పటి నుంచి కలిసి పెరిగి ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్న చెల్లెలి ప్రాణాన్ని నిలపడం కోసం తన కిడ్నీనే బహుమతిగా ఇచ్చాడు ఒక అన్న.

ముంబైకి చెందిన ఒక వ్యక్తికి చెల్లెలంటే పంచప్రాణాలు. అలాంటి చెల్లెలు అనుకోకుండా ఒక రోజు తీవ్ర అస్వస్థతకు గురైంది. ఆమెను పరీక్షించిన వైద్యులు రెండు కిడ్నీలు పాడైపోయినట్లు నిర్థారించారు. ఆమెను చికిత్స నిమిత్తం ముంబైలోని గ్లోబల్ ఆసుపత్రికి తరలించారు. ఆమె బ్రతకాలంటే కిడ్నీ మార్పిడి జరిగి తీరాలి. అయితే అంతకు నెలరోజుల ముందు ముంబైలో కిడ్నీ రాకెట్ వ్యవహారం వెలుగుచూడటంతో పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేశారు. అంతకంతకూ ఆమె పరిస్థితి విషమిస్తుండటంతో కుటుంబసభ్యులు తామే కిడ్నీ ఇవ్వడానికి ముందుకొచ్చారు. అయితే ఆమె తల్లిదండ్రులు షుగర్ వ్యాధిగ్రస్తులు కావడంతో వారి కిడ్నీ పనికిరాదు.

అన్నను పరీక్షించిన వైద్యులు అతని కిడ్నీ, బాధితురాలికి సూట్ అవుతుందని తేల్చారు..అయితే ఇక్కడ మరో అవాంతరం ఏదురైంది. అవయవ మార్పిడి జరిగేటపుడు దాతతో పాటు గ్రహీత బ్లడ్ గ్రూప్ కూడా సరిపోవాలి లేదంటే విపరీత పరిణామాలు ఎదురవుతాయి. అదృష్టం కొద్దీ చెల్లి బ్లడ్ గ్రూప్ ఓ పాజిటీవ్, అన్న బ్లడ్ గ్రూప్ బి పాజిటివ్ కావడం ఇక్కడ కలిసొచ్చింది. వైద్యులు ఇక లేట్ చేయకుండా వెంటనే ఆపరేషన్‌కి ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం అన్నాచెల్లెల్లు ఇద్దరు బాగానే ఉన్నారు. పండక్కో..పబ్బానికో నగలు, చీరలు కొనిపెట్టి బాగుండాలని కోరుకోవడం అన్నాచెల్లెలు బంధానికి అసలు అర్థమివ్వదు. కష్టాల్లో, సుఖాల్లో తోడు నిలబడ్డప్పుడే ఆ బంధానికి నిజమైన సార్థకత.