రైల్వే మంత్రి- దుప్పట్లను ఎన్నాళ్లకి ఉతుకుతామంటే...

 

రైల్వేలలో ప్రయాణించేటప్పుడు ఏసీ కోచ్‌లలో ప్రయాణం సాగించడం ఓ దర్జా! కానీ ఇవాళ రైల్వే శాఖ సహాయ మంత్రి గారు చెప్పిన ఓ మాట వింటే ఆ దర్జా కాస్తా బిత్తరపోక తప్పదు. రాజ్యసభలో ఇవాళ అడిగిన ఒక ప్రశ్నకు బదులు ఇస్తూ రైల్వేశాఖ సహాయమంత్రి మనోజ్‌ సిన్హా, ప్రయాణికులు కప్పుకునే దుప్పట్లను రెండు నెలలకి ఓసారి ఉతుకుతామని సెలవిచ్చారు. దిండుగలీబులు, సీటు మీద పరుచుకునే దుప్పట్లు రోజూ ఉతికినప్పటికీ... కప్పుకునేందుకు వాడే మందపాటి దుప్పట్లను మాత్రం రెండు నెలలకి ఓసారి ఉతుకుతామన్నది మంత్రిగారి మాట.

 

ప్రస్తుతానికి ఈ దుప్పట్లన్నింటినీ తరచూ ఉతికేందుకు తగినన్ని లాండ్రీలు లేవనీ, త్వరలోనే లాండ్రీల సంఖ్యను పెంచి దుప్పట్లను రోజూ ఉతికేందుకు ప్రయత్నిస్తామనీ చెప్పారు. మంత్రిగారి సమాధానానికి రాజ్యసభ అధ్యక్షుడు హమీద్‌ అన్సారీ కూడా బిత్తరపోయారు. ‘దీనికంటే ప్రయాణికులు ఎవరికి వారే తమ దుప్పట్లను తెచ్చుకోవడం’ మంచిదంటూ అన్సారీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. బహుశా ఇకమీదట ఏసీలో ప్రయాణం చేయాలంటే ముక్కుమూసుకుని పడుకోవాలేమో!

Online Jyotish
Tone Academy
KidsOne Telugu