శంకుస్థాపనకు వెళుతున్నారుగా ప్రకటన చేయండి.. మోడీకి రాహుల్ లేఖ
posted on Oct 20, 2015 1:02PM

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోడీకి ఏపీ ప్రత్యేక హోదా గురించి లేఖ రాశారు. ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 22న జరగబోయే ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి వెళుతున్నసంగతి తెలిసిందే. ఈ సందర్బంగా రాహుల్ గాంధీ మోడీకి లేఖ రాశారు. అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి వెళుతున్న ప్రధాని మోడీ ఏపీకి ప్రత్యేక హోదా గురించి ప్రకటన చేయాలని.. ఏపీ ఆర్ధికంగా చాలా వెనుకబడి ఉందని.. ఈ పరిస్థితిలో ఏపీకి ప్రత్యేక హోదా చాలా అవసరమని.. అలాగే ప్రత్యేక ప్యాకేజీ కూడా ప్రకటించాలని లేఖలో పేర్కొన్నారు. ఆనాడు రాష్ట్ర విభజన జరిగినప్పుడు అప్పుడు ప్రధానిగా ఉన్న మన్మోహన్ సింగ్ ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు సమ్మిళిత ప్యాకేజీ కూడా ఇవ్వాలని నిర్ణయించారు.. ఆమేరకు రాజ్యసభలో ప్రకటన చేశారు.. దీనికి కేంద్ర కేబినేట్ కూడా అంగీకరించింది అని అన్నారు. అంతేకాదు నాడు ఎన్డీయే ప్రభుత్వం కూడా ఏపీకి ఐదేళ్లు కాదు పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కాని ఇప్పుడు రాష్ట్రం విడిపోయి ఏడాది అవుతున్న ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని.. ఈవిషయంలో మోడీ ప్రభుత్వం విఫలమైందని పేర్కోన్నారు. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న అన్ని అంశాలనూ అమలు చేయాలని, వాటి అమలుకు కాలవ్యవధి కూడా ప్రకటించాలని కోరారు.