హరీష్ నివాసానికి కేటీఆర్!
posted on Jan 20, 2026 9:24AM
.webp)
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావుకు సిట్ నోటీసులు ఇవ్వడం సంచలనంగా మారింది. పొలిటికల్ హీట్ ను పెంచింది. మాజీ మంత్రి హరీష్ రావు సిట్ నోటీసుల మేరకు నేడు విచారణకు హాజరు కానున్న నేపథ్యంలో తెలంగాణ భవన్ , జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 2024 మార్చి 10న నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా సిట్ ఈ నోటీసులు జారీ చేసి విచారణకు పిలిచింది.
గత ప్రభుత్వ హయాంలో జరిగినట్లుగా చెబుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో హరీష్ ప్రమేయంపై సిట్ అధికారులు ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. హరీష్ రావును జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో విచారించనున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. ఇకపోతే తెలంగాణ భవన్ వద్ద కూడా పోలీసులు భారీ బందోబస్తు చేశారు.
అదలా ఉంటే.. హరీష్ రావు సిట్ విచారణకు బయలుదేరడానికి ముందుగానే మరో మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు హరీష్ రావు నివాసానికి చేరుకున్నారు. హరీష్ రావుకు సిట్ నోటీసులను కక్ష సాధింపు చర్యగా ఆయన అభివర్ణించారు. కేటీఆర్ మాత్రమే కాకుండా పలువురు బీఆర్ఎస్ ముఖ్య నేతలు కూడా హరీష్ నివాసానికి చేరుకున్నారు. వీరంతా కలిసి జూబ్లీ పోలీసు స్టేషన్ కు బయలుదేరారు. కాగావిచారణలో భాగంగా సిట్ అధికారులు ఎలాంటి ప్రశ్నలు వేస్తారు? హరీష్ రావు విచారణకు సహకరిస్తారా? అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.