హ్యాండిచ్చిన కాంగ్రెస్ అభయహస్తం చూపితే ఆంధ్రులు నమ్మేస్తారా?
posted on Jun 5, 2017 11:13AM
.png)
కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ సౌత్ వైపుకొచ్చారు. తెలంగాణ కాంగ్రెస్ నేత మాటల్లో చెప్పాలంటే ఆయన బాహుబలి! మన తెలుగు బాహుబలి దక్షిణం నుంచీ ఉత్తరం వెళ్లి బాక్సాఫీసులు కొల్లగొడితే ఉత్తరాది బాహుబలి అయిన రాహుల్ దక్షిణాదికి వచ్చారు. ఓట్లు కొల్లగొట్టగలిగారా లేదా ఎన్నికలొస్తే తెలుస్తుంది! కాని, అసలు విషయం ఏంటంటే… ప్రధాన ప్రతిపక్షంగా వున్న తెలంగాణలో సభ ఓకే! కాని, సున్నా సీట్లున్న ఏపీలో కాంగ్రెస్ బాహుబలి బహిరంగ సభ సంగతేంటి?
వైఎస్ పాదయాత్రతో అధికారంలోకి వచ్చిన సోనియా కాంగ్రెస్ పదేళ్లు సమైక్య ఆంధ్రను ఆటాడుకుంది. మరీ ముఖ్యంగా రాజశేఖర్ రెడ్డి మరణం తరువాత దిల్లీ నుంచీ వచ్చే ఆదేశాలు, సందేశాలు, ఉద్దేశ్యాలతో తెలుగు నేల గందరగోళం అయిపోయింది. చివరకు , 2014లో రెండు ముక్కలు కూడా అయింది. అయితే, తెలంగాణ ప్రజల చిరకాలం వాంఛ తీర్చి కూడా ప్రతిపక్షానికే పరిమితం అయింది రాహుల్ బాబా పార్టీ! మరి ఆంధ్రాలో విభజనకి కారణమై ఏం మూటగట్టుకుంది? ఇప్పుడప్పుడే చల్లారని ఆంధ్రుల ఆగ్రహాన్ని స్వంతం చేసుకుంది! అటువంటి ఖాతా తెరవని , తెరవలేని రాష్ట్రంలో యువరాజా హడావిడి అనవసర హంగామానే అనుకోవాలి!
గుంటూరులో సభ పెట్టి చంద్రబాబును, జగన్ను, మోదీని చెడామడా విమర్శించిన రాహుల్ ప్రధానంగా ప్రత్యేక హోదా సమస్య రాజేయాలని తాపత్రయపడ్డారు. ఆంధ్రా ప్రజలకి నిజంగానే ప్రత్యేక హోదా రాలేదనే బాధ వుంది. కాని, అందుకు మూల కారణమైన కాంగ్రెస్సే ఇప్పుడు దాన్ని క్యాష్ చేసుకోవాలనుకోవటం దారుణం! విభజన బిల్లు తయారు చేసిన కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ ప్రత్యేక హోదా ఆలోచనే చేయలేదు. పట్టుబట్టిన వెంకయ్య నాయుడుని చల్లబర్చేందుకు మన్మోహన్ చేత మాట ఇప్పించారు. అసలు బిల్లులో పెట్టని హోదా ఎన్డీఏ ఎందుకని ఖచ్చితంగా ఇవ్వాలి? దీనికి రాహుల్ వద్ద సమాధానం లేదు! అలాగే,జనం కోరిక మేరకు బీజేపి ఇవ్వకుండా మోసం చేసిన హోదా కాంగ్రెస్ వస్తే ఎలా ఇస్తుంది? నీతీ ఆయోగ్ లాంటి వ్యవస్థల్ని కాదని ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇవ్వటం సాధ్యమా? అస్సలు కుదరదు. ఇప్పుడు అధికారంలో వున్న బీజేపీ,టీడీపీల వల్ల కాని ఆర్దిక సంబంధమైన నిర్ణయం రేపు కాంగ్రెస్ వస్తే కూడా వీలు కాదు. ప్రత్యేక హోదా అనే ఏర్పాటు గడిచిపోయిన చరిత్ర ఒక్క ఆంధ్రాకే కాదు ఇక మీదట ఏ భారతీయ రాష్ట్రానికీ అటువంటి అవకాశం లేదు. అన్నీ తెలిసినా రాహుల్ తాము వస్తే ప్రత్యేక హోదా అంటూ పచ్చి మోసానికి తెర తీశాడు!
హోదానే కాదు… పోలవరం గురించి రాహుల్ మాట్లాడినదంతా కూడా విడ్డూరమే! తాము పదేళ్లు పునాదులు తోడి పక్కన పారేసిన పోలవరం చంద్రబాబు కమీషన్ల కోసం కడుతున్నారని అనటం… విచిత్రం. పోలవరం కాంగ్రెస్ అధికారంలో వున్నప్పుడు ఎందుకు పూర్తి చేయలేదు? దీనికి కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ దగ్గర నో యాన్సర్! కాని, ఒకేసారి సున్నా ఎమ్మెల్యే స్థానాల నుంచి అధికారంలోకి తీసుకొచ్చే మ్యాజిక్ ఫిగర్ దాకా తమని ఓటర్లు నెత్తిన పెట్టుకుని అసెంబ్లీకి తీసుకుపోతే … ఏపీకి మహర్ధశ పట్టిస్తారట!
పోయిన చోటే వెదుక్కోవాలని మనకు ఓ సామెత వుంది. అలా ప్రత్యేక తెంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాల నేపథ్యంలో తెలుగు ప్రాంతాన్ని మొన్నటి వరకూ ఓ ఆటాడుకున్న కాంగ్రెస్ ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో మరోసారి అధికారం వెదుక్కుంటోంది! తెలంగాణలో కాస్త ఆశలు పెట్టుకోవచ్చు కాని… అంతా పోయిన ఆంధ్రాలో అందలం ఎక్కటం అంత ఈజీ కాదు! నిజానికి… అసాధ్యం! కాబట్టి రాహుల్ సభల మీద కంటే ఏపీలో ముందు పార్టీని కింద నుంచి బలోపేతం చేసుకోటంపై దృష్టి పెడితే బెటర్!