దాసరికి షాక్.. వైసీపీ తరపున విజయవాడ బరిలో పీవీపీ
posted on Mar 12, 2019 12:34PM

ప్రముఖ పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్ (పీవీపీ) రేపు వైసీపీ అధినేత జగన్ సమక్షంలో ఆ పార్టీలో చేరబోతున్నట్లు సమాచారం. విజయవాడ పార్లమెంట్ స్థానానికి వైసీపీ అభ్యర్థిగా పీవీపీ పోటీ చేస్తారని, ఈ నెల 23న ఆయన నామినేషన్ వేస్తారని ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లోనే పీవీపీ వైసీపీ తరపున విజయవాడ ఎంపీగా పోటీ చేసేందుకు ప్రయత్నించారు. అయితే అప్పట్లో ఆయనకు సీటు దక్కలేదు. ఈ సారి కూడా ఆయన విజయవాడ నుంచే బరిలోకి దిగేందుకు ఆసక్తి చూపడంతో వైసీపీ అధిష్ఠానం అంగీకరించినట్లు తెలుస్తోంది.
కొద్దిరోజుల క్రితం.. వైసీపీ తరపున విజయవాడ ఎంపీ అభ్యర్థిగా దాసరి జైరమేష్ బరిలోకి దిగుతారంటూ వార్తలొచ్చాయి. విజయవాడ ఎంపీ టికెట్ ఆశిస్తూ ఇటీవల జైరమేష్ వైసీపీలో చేరారు. అయితే ఇప్పుడు పీవీపీ పేరు తెరమీదకు రావడంతో ఆయన సందిగ్ధంలో పడ్డారు. జైరమేష్ ను పక్కనబెట్టడంపై ఆయన వర్గం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది.