నీట మునిగిన పులిచింతల

 

అందరూ ఊహించినట్టుగానే, కృష్ణా రివర్ బోర్డు హెచ్చరించినట్టుగానే జరిగింది. పులిచింతల గ్రామం నీట మునిగిపోయింది. అటు శ్రీశైలంలో, ఇటు నాగార్జున సాగర్‌లో వివాదాస్పద పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న విషయం తెలిసిందే. గత రెండు రోజులుగా నాగార్జున సాగర్ ప్రాజెక్టులో విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తూ వుండటంతో కృష్ణా రివర్ బోర్డు తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఈ చర్య వల్ల పులిచింత ప్రాజెక్టుతోపాటు దిగువన వున్న నల్గొండ జిల్లా గ్రామాలు, గుంటూరు జిల్లా గ్రామాలు నీట మునిగే ప్రమాదం వుందని తెలిపింది. అయినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం నాగార్జున సాగర్ నుంచి నీటిని విడుదల చేయడం ఆపలేదు. దాంతో అందరూ భయపడినట్టే జరిగింది. గుంటూరు జిల్లాలోని పులిచింతల ప్రాజెక్టులో నీటిమట్టం పెరుగుతోంది. పులిచింతల గ్రామం నీట మునిగింది. మరో మూడు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం నాగార్జున సాగర్‌లో విద్యుత్ ఉత్పత్తిని ఆపకపోయినట్టయితే పరిస్థితి మరింత విషమించే ప్రమాదం వుందని ప్రజలు భయపడుతున్నారు.