ఈఎంఐలు కట్టలేనోడు పార్టీని నడపగలడా..?
posted on May 12, 2017 11:24AM
.jpg)
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రత్యక్షంగా బరిలో దిగనున్న సంగతి తెలిసిందే. అప్పటి ఎన్నికల కోసం ఇప్పటి నుండే గ్రౌండ్ వర్క్ కూడా స్టార్ట్ చేసేశారు. మరి ఎన్నికల్లో పవన్ గెలుస్తారా అంటే..? అది సెకండరీ.. ఇప్పటికైతే పవన్ కళ్యాణ్ పై ప్రజల్లో ఉన్న క్రేజ్ గురించి చెప్పనక్కర్లేదు. సినిమాల్లో ఏదో ఒక చోట.. ఎవరో ఒకరు పవన్ పేరును ఉపయోగించుకుంటున్న వాళ్లే. అదే క్రేజ్ ను 2014 ఎన్నికల్లో బీజేపీ-టీడీపీ రెండు పార్టీలు క్యాష్ చేసుకున్నాయి. అసలు ఆ పార్టీలు గెలవడానికి పవన్ కీలక పాత్ర పోషించాడు అని చెప్పడంలో సందేహం లేదు. ఇక ప్రజల్లో కూడా పవన్ పై మంచి అభిప్రాయమే ఉంది. ఎక్కడ ఎలాంటి సమస్యలు వచ్చినా పవన్ ముందు స్పందిస్తారని.. తమ సమస్యలను ప్రభుత్వానికి వినిపిస్తారని నమ్ముతారు. మరి ఇన్ని ప్లస్ లు ఉన్నాయి కాబట్టి ఆయన ఎన్నికల్లో గెలుస్తారు అని కూడా చాలామంది అనుకుంటున్నారు.
అయితే ఇక్కడి వరకూ బాగానే అప్పుడప్పుడు పవన్ చేసే కొన్ని వ్యాఖ్యల వల్ల ఆయన పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్తారబ్బా అని సందేహాలు వ్యక్తమవుతుంటాయి. గతంలో కూడా తన దగ్గర డబ్బులు లేవని.. రాజకీయాలలో పూర్తిగా ఉండాలని ఉన్నప్పటికీ, పార్టీని నడుపుకోవడానికి తన దగ్గర తగినంత డబ్బు లేదని, అందుకే సినిమాలు చేసుకుంటూ డబ్బులు సంపాదిస్తున్నానని నవ్వుతూ చెప్పేవారు. ఇప్పుడు తాజాగా పవన్ మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేశారు. జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన ఉత్తర భారతాన్ని తాను వ్యతిరేకించటం లేదని.. ఉత్తరాదివారి మాదిరిగానే దక్షిణాది వారికీ అవకాశాలు కల్పించాలి.. అనిల్‌కుమార్ సింఘాల్ నియామకానికి నేను వ్యతిరేకం కాదు... ఉత్తరాదిలో కూడా దక్షిణాది వారికీ అదే ప్రాధాన్యత ఇవ్వాలనే చెప్పా... అహ్మదాబాద్‌లో మోదీని కలిసినప్పుడు కూడా ఉత్తరాది, దక్షిణాది అంశాలను చెప్పా.. దక్షిణాది వారి పట్ల చిన్నచూపు చూస్తున్న అంశాన్ని మోదీ దృష్టికి తీసుకెళ్లా అని అన్నారు. ఇక ఈ విషయం అయి పోయిన వెంటనే.. ఖరీదైన కార్ల అంశంపై ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు పవన్ స్పందిస్తూ.. ‘గతంలో నాకు బెంజ్‌కారు ఉండేది.. వాయిదాలు కట్టలేక అమ్మేశా’ అని చెప్పడంతో సమావేశంలో నవ్వులు విరబూశాయి.
అయితే పవన్ కళ్యాణ్ చెప్పేది నిజమా..? లేక అబద్దమా..? అని తెలియని అయోమయంలో ఉన్నవాళ్లు కూడా చాలామందే ఉన్నారు. ఎందుకంటే పవన్ కాస్త ఎటకారాన్ని జోడించి చెబుతుండటంతో అసలు నిజమో, కాదో అన్న అనుమానం తలెత్తుతుంది. అంతేకాదు అసలు ఈఎంఐ లు కూడా కట్టలేని పరిస్థితిలో ఉన్న పవన్ కళ్యాణ్ పార్టీని ఎలా ముందుకు తీసుకెళతాడు.. ఎన్నికల్లో ఎలా పోటీ చేస్తాడు అని పలువురు చర్చించుకుంటున్నారు. ఎందుకంటే ఒక పార్టీని పెట్టి.. దానిని ముందుకు నడిపించడమంటే సామాన్యమైన విషయం కాదు. అంతెందుకు తన అన్న చిరంజీవి వల్లే కాక పార్టీని విలీనం చేసేశాడు. మరి డబ్బులు లేవు.. డబ్బులు లేవు అని చెప్పే పవన్ పార్టీని ఎలా నడిపిస్తాడో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.