నిశిత్ మరణం...ఆ 2 సెకన్లే..!
posted on May 12, 2017 4:29PM

ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ నారాయణ హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. అతనితో పాటు స్నేహితుడు రవిచంద్ర కూడా మృతి చెందాడు. ఇక ఒక్కగానొక్కడ కుమారుడు మృత్యు బడిలోకి జారుకోవడంతో నారాయణ కుటుంబం ఒక్కసారిగా శోక సంద్రంలో మునిగిపోయింది. ఈ నేపథ్యంలో నారాయణ పుత్రుడి మరణంపై ప్రముఖ రాజకీయ నాయకులంతా స్పందించారు. యావత్ రాజకీయ లోకం కదిలింది. ఒక్క టీడీపీ నేతలే కాదు ప్రతి ఒక్క రాజకీయ నేత కూడా నారాయణకు ఓదార్చడానికి కదిలివచ్చారు. తెలంగాణ నుండి కూడా పలువురు ముఖ్య నేతలు నిశిత్ మరణానికి సంతాపం తెలియజేశారు. ఇక హరీశ్ రావు అయితే దగ్గరుండి మరీ పోస్ట్ మార్టం చేయించారు. ఇలా ఒకరు కాదు.. ఇద్దరు కాదు ఇలా రెండు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకులంతా నారాయణను.. వారి కుటుంబసభ్యులను ఓదార్చారు. నిశిత్ అంత్యక్రియలకు కూడా నేతలు, అభిమానులు, నారాయణ విద్యాసంస్థలనుండి టీచర్లు, విద్యార్ధులు కూడా పెద్ద ఎత్తున తరలివచ్చారు.
ఇదంతా నాణెనికి ఓ పక్క మాత్రమే. మరోపక్క వేరే ఉంది. డాక్టర్లు ఇప్పటికే నిశిత్ మరణానికి కారణం ఫాస్ట్ డ్రైవింగే అని.. అతను ఎలాంటి మద్యం సేవించలేదని చెప్పారు. కానీ ఎంతైనా బిగ్ షాట్స్ సుపుత్రులు కదా వాళ్లు ఏం చేసినా చెల్లుతుంది. ఒక రకంగా చూస్తే నిశిత్ మరణం తరువాత ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడే జేసీ దివాకర్ రెడ్డి మాటలు నిజమనిపిస్తోంది. “ధనవంతుల పిల్లల్లో విచ్చల విడితనం బాగా పెరిగిందని, ధనవంతుల పిల్లలు పబ్బులు, బార్లకు వెళ్తున్నారని ఆక్షేపించిన” జేసీ, రాత్రి 11 గంటల్లోపు పబ్బులు, బార్లు మూసేయాలని డిమాండ్ చేశారు. యువకులు తమ వంశాన్ని ఉద్దరిస్తారని భావిస్తే, ఇలా రోడ్డు ప్రమాదాలలో మృతి చెందారన్న వార్త తల్లితండ్రులకు జీర్ణించుకోవడం కష్టతరంగా మారుతోందని, యువకులు జాగ్రత్తగా ఉండాలని, అందుకు పెంపకం విషయంలో బాధ్యతలు తీసుకోవాలని సూచించారు. కానీ జేసీ లాగ అందరికి అలా మాట్లాడే ధైర్యం ఉండదు కదా. అందులోనూ కొడుకు మరణించిన బాధలో ఆ కుటుంబం ఉంది కాబట్టి.. ఇలాంటి సమయంలో ఎలాంటి విమర్శలు చేయకూడదు కాబట్టి అందరూ సైలెంట్ గా ఉన్నారు.
నిజానికి ఇక్కడ చెప్పాలంటే ఒకపక్క నిశిత్ మరణించాడు అని ఒక పక్క బాధ అనిపించినా.. మరోపక్క మాత్రం అతని ర్యాష్ డ్రైవింగ్ వీడియో కనుక చూస్తే నిషిత్ చనిపోయాడన్న బాధ కంటే కూడా, ఇంత దారుణంగా సిటీలో డ్రైవింగ్ చేస్తున్నారా? అన్న సందేహం రాక తప్పదు. సీసీ కెమెరాలలో రికార్డైన విధానాన్ని చూస్తే… రెప్పపాటు సమయంలో వచ్చిన కారు నేరుగా పిల్లర్ ను అలా గుద్దుకుని ఆగిపోయింది. ఇదంతా కేవలం రెండంటే రెండు సెకన్లలో జరిగిపోయింది. వీడియోచూస్తే ఈ విషయం క్లియర్ గా అర్ధమవుతుంది. నేరుగా వేగంగా వచ్చిన కారు పిల్లర్ ను గుద్దడం.. గుద్దిన కారు గాల్లో ఆలా లేచి పడడం రెప్పపాటులో జరిగిపోయి ఆఖరికి ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక యాక్సిడెంట్ అయిన తరువాత కారులో స్పీడ్ ఇండికేటర్ చూస్తే 200-250 మధ్యలో లాక్ అయింది. సాధారణంగా ఒక పిల్లర్ నుండి ఇంకో పిల్లర్ కు 4 సెకన్ల టైం పడుతుంది. కానీ ఇక్కడ నిశిత్ ప్రయాణిస్తున్న కారు వేగం.. వీడియోలోని టైం చూస్తే జస్ట్ సింగిల్ సెకన్ లో ఒక పిల్లర్ ను దాటి మరో పిల్లర్ ను గుద్దుకుంది. ఈ లెక్కన ఓ నార్మల్ పర్సన్ గంటకు 70 కిలో మీటర్ల వేగంతో ప్రయాణిస్తే.. నిశిత్ మాత్రం గంటకు 280 కిలో మీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నాడన్న మాట. అంటే గంటలో హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్లొచ్చు. అందుకే అంత స్పీడ్ లో ఉన్నారు కాబట్టే.. కోట్లు ఖరీదు.. ఎన్నో సదుపాయాలు ఉన్న కారు కూడా అతని ప్రాణాలను కాపాడలేకపోయింది.
మరి అలాంటి టైంలో.. అంత స్పీడ్ గా డ్రైవ్ చేయాల్సిన అవసరం నిశిత్ కు ఏముంది. ఎందుకంటే తమ తండ్రుల అండ చూసుకొని రెచ్చిపోతుంటారు. తాము ఏం చేసినా చెల్లిపోతుందిలే అన్న దీమా. అదే టైంలో కార్పోరేట్ ఉద్యోగులు బయటకు వస్తుంటారు.. జీహెచ్ఎంసీ ఉద్యోగులు ఉంటారు. రోడ్డు పై బండ్లు పెట్టుకునే వాళ్లు ఉంటారు. అలాంటిది ఇంత వేగంతో వచ్చే కారు వారిని దూసుకుంటూ వెళ్తే ఎంత మంది ప్రాణాలు పోయి ఉండేవో ఆలోచించడానికే భయంకరంగా ఉంది. ఏదో నిశిత్ మద్యం సేవించలేదు.. అదీ.. ఇదీ అని అటు మీడియా.. ఇటు పోలీసులు అసలు విషయం పక్కనపెట్టి కోడి గుడ్డు మీద ఈకలు పీకినట్టు విషయాన్ని మిస్ లీడ్ చేస్తున్నారు కానీ....దీన్ని ఎవరూ ఖడించడం లేదు. అంతేకాదు తెల్లవారు జాము వరకూ నడిచే పబ్ లు సిటీలో ఎన్నో ఉన్నాయి. మరి వాటిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. 12 గంటలు దాటిన తరువాత వాటిని ఎందుకు మూసేయడం లేదు. ఎందుకంటే ఎవరికి అందాల్సినవి వారికి అందుతున్నాయి కాబట్టి.. అందరూ సైలెంట్ గా చోద్యం చూస్తున్నారు.
మొత్తానికి ఏది ఏమైనా తమ డబ్బు అహంకారం చూసుకొని రెచ్చిపోయే సుపుత్రులకు.. వారి తల్లిదండ్రులకు ఈ ప్రమాదం ఒక గుణపాఠం అవుతుందని భావిద్దాం. డబ్బు, దర్పం అనే అహంకారాన్ని పక్కన పెట్టి అందరిలో ఒకరిలా ఉంటే వారికి మంచిదే.. వారితో పాటు పక్కన ఉన్న వారికీ మంచిదే.