పార్లమెంటులో 'తెలంగాణ' భేరి

న్యూఢిల్లీ: పార్లమెంటులో చాలా రోజుల తరువాత సోమవారం మరోసారి ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు అంశం మారుమోగనుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, పౌరసమాజం నాయకుడు అన్నా హజారే ఢిల్లీలో ఆదివారం జరిపిన దీక్ష, బొగ్గు గనుల కేటాయింపు కుంభకోణం తదితర అంశాలపై ప్రతిపక్ష పార్టీలు సర్కారును నిలదీయనున్నాయి. దీనితో పార్లమెంటు ఉభయ సభలు సోమవారం సజావుగా కొనసాగే సూచనలు కనిపించటం లేదు. తెలంగాణ రాష్ట్ర సమితి, బిజెపితోపాటు రాష్ట్ర కాంగ్రెస్‌కు చెందిన సభ్యులు లోక్‌సభలో తెలంగాణ అంశాన్ని ప్రస్తావించనున్నారు. ఆదివారం రాత్రి ఢిల్లీకి చేరుకున్న టిఆర్‌ఎస్ అధ్యక్షుడు, లోక్‌సభ సభ్యుడు కె. చంద్రశేఖరరావు, విజయశాంతి రేపు తెలంగాణ అంశంపై లోక్‌సభను స్తంభింపజేయనున్నారు. కెసిఆర్ ఢిల్లీకి చేరిన అనంతరం లోక్‌సభలో తెలంగాణ అంశాన్ని ప్రస్తావించే విషయంపై బిజెపి, తదితర జాతీయ పార్టీల నాయకులతో టెలిఫోన్ సంభాషణలు జరిపినట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి.

తెలంగాణ అంశం గురించి వివరించేందుకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అపాయింట్‌మెంట్ కోరినట్లు టిఆర్‌ఎస్ నాయకుడు జితేందర్ రెడ్డి చెబుతున్నారు. బిజెపి తదితర ప్రతిపక్ష పార్టీలు పార్లమెంటు ఉభయ సభల్లో పౌరసమాజం నాయకుడు అన్నా హజారే ఢిల్లీలో చేసిన దీక్షపై ప్రశ్నించనున్నారు. హజారే ప్రస్తావించిన పలువురు అవినీతి మంత్రుల గురించి యుపిఏ సంకీర్ణ ప్రభుత్వాన్ని నిలదీయాలని బిజెపి నిర్ణయించింది. దీనితోపాటు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అంశాన్ని ప్రస్తావించాలని ఆలోచిస్తోంది. టిఆర్‌ఎస్, రాష్ట్ర కాంగ్రెస్ ఎంపిలతో పాటు బిజెపి కూడా తోడైతే లోక్‌సభలో తెలంగాణ అంశం దద్దరిల్లుతుందని అంటున్నారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఏడు ఉపఎన్నికల్లో బిజెపి మహబూబ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో విజయం సాధించిన విషయం తెలిసిందే.

బిజెపి జాతీయ నాయకులు మహబూబ్‌నగర్ విజయాన్ని ఆసరాగా తీసుకుని తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాలని ఆలోచిస్తోంది. దీని కోసం తెలంగాణ అంశాన్ని లోక్‌సభలో ప్రస్తావించాలని ఆ పార్టీ జాతీయ నాయకులు ఆలోచిస్తున్నారు. బిజెపి, టిఆర్‌ఎస్‌లతో పోటీగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అంశాన్ని లోక్‌సభలో ప్రస్తావించేందుకు రాష్ట్ర కాంగ్రెస్‌కు చెందిన తెలంగాణ ప్రాంతం ఎంపిలు సిద్ధమవుతున్నారు. ఇదిలా ఉంటే రాష్ట్ర కాంగ్రెస్‌కు చెందిన తెలంగాణ ఎంపిలు లోక్‌సభలో తెలంగాణ అంశంపై గొడవ చేయకుండా చూసేందుకు కాంగ్రెస్ అధినాయకత్వం ప్రయత్నిస్తోంది. అయితే తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ఎంపిలు మాత్రం ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఎంతకైనా తెగిస్తామని చెబుతున్నారు. మొత్తం మీద సోమవారం పార్లమెంటులో తెలంగాణ భేరి మోగడం ఖాయంగా కనిపిస్తున్నది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu