అసెంబ్లీని కుదుపుతున్న 'తెలంగాణ' రగడ

హైదరాబాద్: శాసనసభ బడ్జెట్ సమావేశాలు మరో నాలుగు రోజులు మాత్రమే ఉండగా తెలంగాణ డిమాండ్‌తో సభను స్తంభింప చేయాలని తెరాస నిర్ణయించడంతో ఇక సమావేశాలు సజావుగా జరిగే అవకాశం కనిపించడం లేదు. మిగిలిన నాలుగు రోజుల సమావేశాలను తెలంగాణ అంశంతో తెరాస హైజాక్ చేయనుంది. తెలంగాణ డిమాండ్‌తో ఢిల్లీలో లోక్‌సభను, ఇక్కడ శాసనసభను జరగనీయకుండా అడ్డుకుంటామని తెరాస అధినేత కెసిఆర్ స్వయంగా ప్రకటించారు. తెలంగాణ అంశంపై స్తంభనతో మొదలైన శాసనసభ బడ్జెట్ సమావేశాలు అదే అంశంతోనే ముగియనున్నాయి.


ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలు సోమవారం శాసనసభ ప్రారంభం కాగానే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తెరాసకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు, ఇండిపెండెంట్ ఎమ్మెల్యే నాగం జనార్దన్‌రెడ్డి, బిజెపి ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసిన వెంటనే తెలంగాణపై సభలో తీర్మానం చేయాలన్న డిమాండ్‌తో సభా కార్యక్రమాలను స్తంభింపచేయాలని తెరాస నిర్ణయించింది. తెలంగాణ అంశంపై రాజీనామా చేసి మళ్ళీ గెలుపొందిన ఇండిపెండెంట్ ఎమ్మెల్యే నాగం జనార్దన్‌రెడ్డి కూడా తెలంగాణ అంశంలో తెరాసతో జత కట్టనున్నారు. తెలంగాణ డిమాండ్‌తో వరంగల్‌లో భోజ్యానాయక్ అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటనను తెరాస ప్రధానంగా ప్రస్తావించనుంది. బడ్జెట్ సమావేశాలు ఆరంభమైనపుడు తెరాసకు పన్నెండు మంది సభ్యులుండగా ఇపుడు వారి సంఖ్య పదహారుకు పెరిగింది.


శాసనసభ సమావేశాలు ప్రారంభమైనపుడు మొదటి ఐదు రోజులూ ఎటువంటి కార్యక్రమాలు చేపట్టకుండానే సమావేశాలు వాయిదా పడుతూ వచ్చాయి. తెలంగాణ డిమాండ్‌తో తెరాస, మద్యం సిండికేట్లపై చర్చ డిమాండ్‌తో తెలుగుదేశం సభా కార్యక్రమాలను అడ్డుకున్నాయి. ఇప్పుడు మళ్ళీ తెరాస తెలంగాణ డిమాండ్‌ను తెరపైకి తీసుకురాగా, ఇపుడు తెలుగుదేశం పార్టీ ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల అంశంతో పాటు ‘అవినీతి మంత్రుల’ అంశాన్ని కూడా ప్రస్తావించడం ద్వారా సభను అడ్డుకోవాలని నిర్ణయించింది. ఇతర ప్రతిపక్షాలు కూడా ఎస్సీ,ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల అంశంపై ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలని నిర్ణయించాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu