అసెంబ్లీకి 'తెలంగాణ' సెగ

హైదరాబాద్: తెలంగాణ కోసం వరంగల్ జిల్లా రఘునాథపల్లి మండలానికి చెందిన బోజ్యా నాయక్ ఆత్మహత్య నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ శాసనసభ్యులు సోమవారం అసెంబ్లీ ద్వారానికి అడ్డుగా పడుకున్నారు. తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులను లోనికి వెళ్లనిచ్చేది లేదని హెచ్చరించారు. తెలంగాణపై మాట తప్పిన పార్టీలకు అసెంబ్లీలో ప్రవేశం లేదని, తెలంగాణ ద్రోహులను లోనికి వెళ్లనివ్వమని, సమైక్యవాదులకు, వెన్నుపోటు పొడిచిన వారికి ఇక్కడ స్థానం లేదని వారు నినాదాలు చేశారు. అయితే పోలీసులు కలుగజేసుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది.

సభ ప్రారంభమైన కొద్ది సేపటికే స్పీకర్ వాయిదా వేశారు. తెలుగుదేశం, తెరాస పార్టీ ఎమ్మెల్యేలు తెలంగాణ అంశంపై పట్టుబట్టారు. ఇరు పార్టీల సభ్యులు పోడియం వద్దకు దూసుకు పోయారు. దీంతో స్పీకర్ సభను పదిహేను నిమిషాలు వాయిదా వేశారు. అంతకుముందు విపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్ తిరస్కరించారు. కాగా ఇటీవల ఉప ఎన్నికల్లో గెలిచిన ఆరుగురు తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఎస్పీఎస్ నెల్లూరు జిల్లా కొవూరు నుండి గెలిచిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి 29న ప్రమాణం స్వీకారం చేయనున్నారు. గంప గోవర్ధన్, జోగు రామన్న, టి.రాజయ్య, జూపల్లి కృష్ణా రావు, నాగం జనార్ధన్ రెడ్డి, యెన్నం శ్రీనివాస్ రెడ్డిలు ప్రమాణ స్వీకారం చేశారు. కాగా సభలో తెరాస బలం 16, బిజెపి బలం 3కు పెరిగింది. కాగా అంతకుముందు గన్ పార్కు వద్ద తెరాస ఎమ్మెల్యేలు ఆందోళన నిర్వహించారు. తెలంగాణ కోసం యువకులు, విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవద్దని సూచించారు. తెలంగాణ కోసం ఇంతమంది చనిపోతున్నా ఆంధ్రా నేతలు సానుభూతి తెలిపింది లేదన్నారు.


కాగా, ఉప ఎన్నికలలో కోట్ల రూపాయలు పంచిపెట్టారని, అయితే తెలంగాణవాదం ముందు ఆ కోట్ల రూపాయలు బలాదూర్ అయ్యాయని నాగర్కర్నూలు నుంచి కొత్తగా ఎన్నికైన నాగం జనార్దన రెడ్డి అన్నారు. సీమాంధ్ర నేతలను తరిమికొట్టే సమయం ఆసన్నమైందన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu